Hyderabad crush Meghalaya in final: దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ(Ranji Trophy)లో హైదరాబాద్(Hyderabad) అదరగొట్టింది. తిలక్‌ వర్మ(Tilak Varma) కెప్టెన్సీలో రంజీ ట్రోఫీ ప్లేట్‌ గ్రూపులో ఛాంపియన్‌గా నిలిచింది. ప్లేట్‌ గ్రూప్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోకుండా హైదరాబాద్‌ ఛాంపియన్‌గా నిలిచింది. ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన న ఫైనల్లో హైదరాబాద్‌ 5 వికెట్ల తేడాతో మేఘాలయపై ఘన విజయం సాధించింది. ప్లేట్‌ గ్రూప్‌లో విజయంలో రంజీ ట్రోఫీ ఎలీట్‌ గ్రూపులో హైదరాబాద్‌ జట్టు చోటు దక్కించుకుంది. 198 పరుగుల విజయ లక్ష్యంతో ఓవర్‌నైట్‌ స్కోరు 71/1తో నాలుగో రోజు ఉదయం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన హైదరాబాద్‌ సునాయసంగానే లక్ష్యాన్ని ఛేదించింది. 34.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. రాహుల్‌ సింగ్‌ 62 పరుగులతో తిలక్‌వర్మ  64 పరుగులతో సత్తాచాటి జట్టును విజేతగా నిలిపారు. వచ్చే రంజీ ట్రోఫీ సీజన్‌లో హైదరాబాద్‌ ఎలీట్‌ గ్రూపులో బరిలో దిగుతుంది. 



హెచ్‌సీఏ నజరాన
రంజీ ట్రోఫీ ప్లేట్‌ గ్రూపులో విజేతగా నిలిచిన హైదరాబాద్‌ను హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం(Hyderabad Cricket) అధ్యక్షుడు జగన్‌ మోహన్‌రావు అభినందించారు.  జట్టుకు రూ.10 లక్షలు నజరానా ప్రకటించాడు. మెరుగైన ప్రదర్శన చేసిన కెప్టెన్‌ తిలక్‌వర్మ, ఓపెనర్‌ తన్మయ్‌ అగర్వాల్‌, స్పిన్నర్‌ తనయ్‌ త్యాగరాజన్‌.. ఫైనల్లో సెంచరీలు సాధించిన నితేష్‌రెడ్డి, ప్రజ్ఞయ్‌రెడ్డికి ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా రూ.50,000 నగదు బహుమతి అందజేశాడు. వచ్చే మూడేళ్లలో రంజీ ట్రోఫీ ఎలీట్‌ గ్రూపులో హైదరాబాద్‌ ఛాంపియన్‌గా నిలిస్తే జట్టుకు రూ.1 కోటి నజరానా, ఒక్కో ఆటగాడికి బీఎండబ్ల్యూ కారు బహుమతిగా ఇస్తామని  హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు జగన్‌ మోహన్‌రావు ప్రకటించాడు. హెచ్‌సీఏ నుంచి ఆటగాళ్లకు ప్రోత్సాహంగా నగదు బహుమతి, కార్లు అందిస్తామని ప్రకటించడం ఆనందంగా ఉందని తిలక్‌వర్మ తెలిపాడు. ఆటగాళ్లకు ఇది మరింత ఉత్సాహాన్నిస్తుందని చెప్పాడు.


దేశవాళీలో దిగ్గజ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా ఆటకు వీడ్కోలు పలుకుతున్నారు. 2023-2024 సీజన్‌ రంజీ ట్రోఫీ(Ranji Trophy)తో అయిదుగురు దేశవాళీ అగ్రశ్రేణి క్రికెటర్ల కెరీర్‌కు తెరపడనుంది. బెంగాల్‌ దిగ్గజం మనోజ్‌ మనోజ్‌ తివారి, ఝార్ఖండ్‌ ద్వయం సౌరభ్‌ తివారి, వరుణ్‌ ఆరోన్‌.. ముంబయి దిగ్గజం ధవల్‌ కులకర్ణి, విదర్భ రంజీ ట్రోఫీ విన్నింగ్‌ కెప్టెన్‌ ఫయాజ్‌ ఫజల్‌లు దేశవాళీ కెరీర్‌లకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. 



మనోజ్‌ తివారీ గుడ్‌బై
ప‌శ్చిమ బెంగాల్ క్రీడా శాఖ మంత్రి మ‌నోజ్ తివారీ(Manoj Tiwary ) ఈ సీజన్‌తో ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రక‌టించనున్నాడు. కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో బిహార్‌తో మ్యాచ్ త‌న‌కు చివ‌రిద‌ని మనోజ్‌ తివారీ ప్రకటించేశాడు. గతంలో ఓసారి రిటైర్మెంట్‌ ప్రకటించి వెనక్కి తీసుకున్న మనోజ్‌ తివారీ... ఈసారి మాత్రం రిటైర్‌మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోనని తెలిపాడు. త‌న రంజీ కెరీర్.. ఈడెన్ గార్డెన్స్‌తో త‌న‌కున్న అనుబంధాన్ని చెప్తూ ఓ భావోద్వేగ పోస్ట్ చేశాడు. 2006లో రంజీల్లో అరంగేట్రం చేసిన తివారీ 2008లో టీమిండియాలో అరంగేట్రం చేశాడు. అయితే.. అత‌డికి కేవ‌లం 12 వ‌న్డేలు, 3 టీ20లు ఆడే అవ‌కాశం వ‌చ్చింది. భార‌త జ‌ట్టు త‌ర‌ఫున 2015లో జింబాబ్వేపై చివ‌రి మ్యాచ్ ఆడేసిన తివారీ రంజీల‌పై దృష్టి పెట్టాడు. 141 ఫ‌స్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన మనోజ్‌ తివారీ... 30 సెంచ‌రీలు, 45 హాఫ్ సెంచ‌రీలు బాదాడు. టీమిండియాలో చోటు కోల్పోయిన తివారీ ఐపీఎల్‌లో మెరిశాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌, కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్, రైసింగ్ పూణే సూప‌ర్ జెయింట్స్‌ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వ‌హించాడు.