దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ 2024(Ranji Trophy) ను ఆంధ్ర(Andhra) క్రికెట్‌ జట్టు... డ్రాతో ప్రారంభించింది. విశాఖ(Visakha)లో బెంగాల్‌(Bengal)తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు రోజుల మ్యాచ్‌ను ఆంధ్ర జట్టు డ్రా గా ముగించింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన ఆంధ్రా జట్టు ఖాతాలో మూడు పాయింట్లు చేరగా... బెంగాల్‌ జట్టుకు ఒక్క పాయింట్‌ లభించింది. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో రికీ భుయ్‌(Ricky Bhuis) అద్భుత శతకంతో చెలరేగాడు. 347 బంతుల్లో 23 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో రికీ 175 పరుగులు చేశాడు. రికీ భుయ్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో తొలి ఇన్నింగ్స్‌లో ఆంధ్రా జట్టు 165.4 ఓవర్లలో 445 పరుగులకు ఆలౌట్‌ అయింది. రికీ భుయ్‌ చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. బెంగాల్‌ బౌలర్లలో కైఫ్‌ మూడు వికెట్లు తీయగా, ఆకాశ్‌ దీప్, ఇషాన్‌ పోరెల్, కరణ్‌ లాల్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌లో 409 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనుస్తుప్‌ ముజుందార్‌ సెంచరీతో కదం తొక్కాడు. సౌరవ్‌ పటేల్‌ కుడా 96 పరుగులతో రాణించాడు. వీరిద్దరూ రాణించడంతో 126.2 ఓవర్లలో 409 పరుగులకు బెంగాల్‌ ఆలౌట్‌ అయింది. దీంతో ఆంధ్రాకు 36 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.

 

36 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన బెంగాల్‌ జట్టు 25 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టపోయి 82 పరుగులు సాధించింది. ఫలితం వచ్చే అవకాశం లేకపోవడంతో టీ విరామం తర్వాత ఇరు జట్ల కెప్టెన్‌లు ‘డ్రా’కు అంగీకరించి ఆటను ముగించారు. ఆంధ్ర జట్టు తదుపరి మ్యాచ్‌ను ఈనెల 12 నుంచి వాంఖడే స్టేడియంలో ముంబై జట్టుతో ఆడుతుంది.

 

ఢిల్లీకి పెద్ద షాక్‌

దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో ఢిల్లీ (Delhi) జట్టుకు పెద్ద షాక్‌ తగిలింది. పటిష్టమైన ఢిల్లీ జట్టును పుదుచ్చేరి(Puducherry) చిత్తు చేసింది. తొలి మ్యాచ్‌లోనే ఘోరా పరాభవంతో ఢిల్లీ జట్టుకు దిమ్మతిరిగిపోయింది. బలహీనంగా కనిపించిన పుదుచ్చేరి జట్టు.. ఢిల్లీలాంటి బలమైన జట్టును ఓడించడం క్రికెట్‌ విశ్లేషకులను కూడా విస్మయపరిచింది. ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ మైదానం వేదికగా జరిగిన ఎలైట్ గ్రూప్ డి మొదటి మ్యాచ్‌లో ఢిల్లీను 9 వికెట్ల తేడాతో పుదుచ్చేరి చిత్తు చేసింది. రంజీ ట్రోఫీ చరిత్రలో పుదుచ్చేరి సాధించిన అతిపెద్ద విజయాల్లో ఇదీ ఒకటని మాజీ క్రికెటర్లు అంటున్నారు.

 

పుదుచ్చేరి దెబ్బకు విలవిల

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి పుదుచ్చేరి బౌలర్లు చుక్కలు చూపించారు. గౌరవ్‌ యాదవ్‌ బౌలింగ్‌కు ఢిల్లీ బ్యాటింగ్‌ లైనప్‌ కకావికలమైంది. గౌరవ్ ఏడు వికెట్లతో ఢిల్లీ జట్టు పతనాన్ని శాసించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఢిల్లీ కేవలం 148 పరుగులకే కుప్పకూలింది.  తొలి ఇన్నింగ్స్‌లో గౌరవ్‌ యాదవ్‌ 7 వికెట్లతో సత్తా చాటాడు. ఢిల్లీ బ్యాటర్లలో హర్ష్‌ త్యాగీ(34) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పుదుచ్చేరి 244 పరుగులకు ఆలౌటైంది. దీంతో పుదుచ్చేరికి కీలకమైన 96 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. రెండో  ఇన్నింగ్స్‌లోనూ ఢిల్లీ ఆటతీరు ఏమీ మారలేదు. మరోసారి పుదుచ్చేరి బౌలర్లు రాణించడంతో రెండో ఇన్నింగ్స్‌లోనూ ఢిల్లీ 145 పరుగులకే ఆలౌటైంది.  ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్‌ యష్ ధుల్ దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 25 పరుగులు మాత్రమే చేశాడు.  దీంతో పుదుచ్చేరి ముందు కేవలం 51 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది. 51 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే పుదుచ్చేరి ఛేదించింది. రెండు ఇన్నింగ్సుల్లో పది వికెట్లు పడగొట్టిన గౌరవ్‌ యాదవ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు.