Arjun Tendulkar Century:  1988 డిసెంబర్ లో తన రంజీ అరంగేట్ర మ్యాచులో సచిన్ టెండూల్కర్ సెంచరీ సాధించాడు. మళ్లీ ఇప్పుడు అతని తనయుడు అర్జున్ టెండూల్కర్ కూడా అచ్చం తండ్రిలానే అరంగేట్ర రంజీ మ్యాచులో శతకం బాదాడు. ఇవి రెండు సంఘటనలు యాధృచ్ఛికమే అయినా అభిమానులు మాత్రం అర్జున్ ను తండ్రికి తగ్గ తనయుడంటూ పొగుడుతున్నారు. భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ తన అరంగేట్ర రంజీ టోర్నీలో శతకం సాధించాడు. గోవా తరఫున బరిలోకి దిగిన అర్జున్ తన ఫస్ట్ క్లాస్ సెంచరీని అందుకున్నాడు. రాజస్థాన్ పై 177 బంతుల్లో 100 పరుగులు చేశాడు. 


గోవా 5 వికెట్లకు 201 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఏడో వికెట్ గా అర్జున్ టెండూల్కర్ క్రీజులోకి వచ్చాడు. 12 బౌండరీలు, 2 సిక్సర్ల సాయంతో 40వ ఓవర్ ముగిసే సరికి 112 పరుగులతో ఉన్నాడు. సుయూష్ ప్రభుదేశాయ్ (172 బ్యాటింగ్) తో కలిసి ఏడో వికెట్ కు అజేయంగా 205 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అర్జున్ ఈ ఏడాది గోవా తరఫున ఆడాలని నిర్ణయించుకున్నాడు. ముంబయి నుంచి ఎన్ ఓసీ పత్రం తెచ్చుకుని రంజీ టోర్నీలో గోవాకు ఆడుతున్నాడు. 






అర్జున్  టెండూల్కర్ ముంబై తరఫున ఆడేవాడు. అయితే ఈ సీజన్ లో గోవా తరపున విజయ్ హజారే ఇంకా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలను ఆడాడు. ఎడమ చేతివాటం బ్యాట్స్‌మన్ మరియు మీడియం-పేసర్ అయిన అర్జున్ 8 లిస్ట్ ఏ గేమ్‌లలో 8 వికెట్లు తీశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గోవా తరఫున మూడు టీ20 మ్యాచ్‌ల్లో 4 వికెట్లు పడగొట్టాడు.


గత సీజన్‌లో ముంబై రంజీ ట్రోఫీ ఫైనల్‌కు చేరుకున్నప్పుడు ముంబై క్రికెట్ అసోసియేషన్ సీనియర్ సెలక్షన్ కమిటీ అర్జున్‌ని జట్టులో చేర్చింది. అయితే అతను తుది జట్టులో లేడు. ఆ తర్వాత ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టు అర్జున్ ను వేలంలో కొనుగోలు చేసింది. కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. అర్జున్ టెండూల్కర్ గోవా తరఫున ఆడేందుకు ఆసక్తి కనబరిచాడు. అందుకే మమ్మల్ని సంప్రదించాడు. అందుకు ముందు ఎంసీఏ నుంచి నిరభ్యంతర పత్రం పొందమని మేం చెప్పాం. అతనిని ఎంపిక చేసేముందు ఫిట్ నెస్, స్కిల్ టెస్ట్ లాంటి ప్రక్రియను అనుసరించాం. అని గోవా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ విపుల్ ఫడ్కే తెలిపారు.