IND vs ENG 3rd Test Live Score: రాజ్‌కోట్‌ టెస్టు భారత్‌ ఆధిపత్యం కొనసాగుతోంది. టీమిండియా ఇచ్చిన టార్గెట్‌కు దీటుగా మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్‌ 319 పరుగుల వద్ద ముగిసింది. దీంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 126 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇంగ్లాండ్ తరఫున ఓపెనర్ బెన్ డకెట్ అత్యధిక స్కోరు 153 పరుగులు చేశాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్ 41, ఓలీ పోప్ 39 పరుగులు చేశారు. ఇది తప్ప ఏ బ్యాట్స్ మన్ కూడా నిలవలేకపోయాడు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. 


భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మూడో రోజు ఆట ప్రారంబించిన ఇంగ్లండ్‌ ధాటిగా ఆడే ప్రయత్నం చేసింది. కానీ వారిని భారత్ బౌలర్లు విజయవంతంగా నిలువరించారు. తొలి ఓవర్ వేసిన జస్ప్రీత్ బుమ్రా రెండు పరుగులు ఇచ్చాడు. ఐదో ఓవర్‌లో టీమిండియాకు బ్రేక్‌త్రూ వచ్చింది. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో టీ20 షాట్ ఆడే క్రమంలో జో రూట్ స్లిప్‌లో చిక్కుకున్నాడు. యశస్వి జైస్వాల్ అద్భుతమైన క్యాచ్‌తో రూట్‌ను పెవెలియన్‌కు పంపించాడు. రూట్ 31 బంతుల్లో 18 పరుగులు చేశాడు. 


రూట్‌ తర్వాత వచ్చిన జానీ బెయిర్ స్టో ఖాతా తెరవకుండానే కుల్దీప్‌ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. తర్వాత వచ్చిన బెన్ స్టోక్స్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు డకెట్‌. ఈ క్రమంలోనే బెన్ డకెట్ కేవలం 135 బంతుల్లోనే 150 పరుగులు పూర్తి చేశాడు. టెస్టు క్రికెట్లో డకెట్ ఈ ఘనత సాధించడం ఇది రెండోసారి. 


153 పరుగులు చేసిన తర్వాత డకెట్‌ను కుల్దీప్ అవుట్ చేశాడు. ఐదో వికెట్‌ రూపంలో డకెట్‌ వెనుదిరిగాడు. బెన్ స్టోక్స్, బెన్ ఫోక్స్ క్రీజ్‌లో నిలదొక్కునే ప్రయత్నం చేశారు. ఇలా తొలి సెషన్‌ ముగిసే సరికి టీమ్ఇండియా 83 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది. ఇంగ్లాండ్ ఐదు వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. 


రెండో సెషన్‌ ప్రారంభమైన తర్వాత టీమిండియా వేగం పెంచింది. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో సిక్సర్ కొట్టే ప్రయత్నంలో బెన్ స్టోక్స్ బౌండరీలో చిక్కాడు. ఆ తర్వాత ఓవర్ తొలి బంతికే సిరాజ్ బెన్ ఫోక్స్‌ను ఔట్ చేశాడు. స్టోక్స్ 41, ఫోక్స్ 13 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. రెహాన్ అహ్మద్‌ను మహ్మద్ సిరాజ్ యార్కర్‌తో బోల్తా కొట్టించాడు. టామ్ హార్ట్లీ రవీంద్ర జడేజాకు చిక్కాడు. ఆఖరి వికెట్‌ ఆడ్రంసన్‌ను సిరాజ్‌ 319 పరుగుల వద్ద తీశాడు. దీంతో ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌కు తెరపడింది. 


ఇంగ్లండ్ అలౌట్ అయిన తర్వాత భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. రోహిత్ శర్మ, జైస్వాల్‌ దీటుగా బదులిస్తున్నారు. రోహిత్ శర్మ మాత్రం చాలా దూకుడుగా ఆడుతున్నాడు. మూడో రోజు భారత ఆటగాళ్లు చేతులకు నల్ల బ్యాండ్లు ధరించి మైదానంలోకి వచ్చారు. ఇటీవలే కన్నుమూసిన భారత మాజీ క్రికెటర్ దత్తాజీరావ్ గైక్వాడ్ జ్ఞాపకార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది.