Rahul Dravid Health:
క్రికెట్ అభిమానులకు షాక్! టీమ్‌ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ అనారోగ్యానికి గురయ్యారు. ఆరోగ్య సమస్యలు ఏర్పడటంతో బెంగళూరుకు వెళ్లారని తెలిసింది. శ్రీలంకతో జరిగే మూడో వన్డేకు ఆయన అందుబాటులో ఉండరని సమాచారం. తిరువనంతపురంలో జరిగే ఈ మ్యాచు కోసం ఎన్‌సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ వస్తారని వినికిడి. అయితే ద్రవిడ్ ఆరోగ్య సమస్యేంటో బయటకు తెలియలేదు.
రెండు రోజుల క్రితమే రాహుల్ ద్రవిడ్ 50వ పుట్టిన రోజు జరుపుకున్నారు. అభిమానులు, మాజీ క్రికెటర్లు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే ఉత్సాహంలో టీమ్‌ఇండియా శ్రీలంకపై సిరీస్ గెలిచింది. కేఎల్ రాహుల్ అజేయ అర్ధశతకంతో జట్టును ఆదుకున్నాడు. ఇంతలోనే ద్రవిడ్ అనారోగ్యానికి గురికావడం ఆందోళనకు గురిచేసింది. ఆయన గైర్హాజరీలో వీవీఎస్ లక్ష్మణ్ కోచింగ్ బాధ్యతలు పర్యవేక్షిస్తారని తెలిసింది. బహుశా న్యూజిలాండ్ సిరీసుకే మిస్టర్ డిపెండబుల్ అందుబాటులోకి రావొచ్చు.
రెండో వన్డే హైలైట్స్
శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 39.4 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం టీమిండియా ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో సిరీస్‌ను కూడా టీమిండియా 2-0 తేడాతో గెలుచుకుంది.
216 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మొదటి 10 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (17: 21 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్), శుభ్‌మన్ గిల్ (21: 12 బంతుల్లో, ఐదు ఫోర్లు), విరాట్ కోహ్లీ (4: 9 బంతుల్లో, ఒక ఫోర్) విఫలం అయ్యారు. శ్రేయస్ అయ్యర్ (28: 33 బంతుల్లో, ఐదు ఫోర్లు) ఉన్నంతలో కాసేపు జట్టును ఆదుకున్నా అతను కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. దీంతో 86 పరుగులకే టీమిండియా నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది.
అనంతరం కేఎల్ రాహుల్ (64 నాటౌట్: 103 బంతుల్లో, ఆరు ఫోర్లు), హార్దిక్ పాండ్యా (36: 53 బంతుల్లో, నాలుగు ఫోర్లు) జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 75 పరుగులు జోడించారు. ఆ తర్వాత హార్దిక్‌ను అవుట్ చేసి కరుణరత్నే ఈ భాగస్వామ్యాన్ని విడదీసినప్పటికీ అప్పటికే భారత్ లక్ష్యానికి 55 పరుగుల దగ్గరకి వచ్చేసింది. హార్దిక్ పాండ్యా తర్వాత అక్షర్ పటేల్ (21: 21 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) కూడా అవుటైనా కేఎల్ రాహుల్ చివరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించాడు.