ప్రతీ నిమిషం ఆనందించా
టీమిండియాకు కోచింగ్ ఇవ్వడం తనకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. ప్రస్తుత జట్టుతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందన్నాడు. తాను మళ్లీ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోలేదని ద్రవిడ్ స్పష్టం చేశాడు. తాను కోచ్‌గా చేరిన మొదటి రోజు నుంచి ప్రతి మ్యాచ్‌ను చాలా ముఖ్యమైన దానిలాగానే భావించానని ద్రవిడ్ వెల్లడించాడు.
ఓపెనింగ్‌పై కీలక వ్యాఖ్యలు
ఓపెనర్లుగా తమకు చాలా అవకాశాలు ఉన్నాయని రాహుల్ తెలిపాడు. విరాట్ కోహ్లితో కలిసి రోహిత్ శర్మ ఓపెనింగ్ చేయాలని కొంతమంది చెబుతుండగా..మరికొందరు యశస్వి జైస్వాల్ పేరును ప్రస్తావిస్తున్నారు. దీనిపై కూడా రాహుల్ స్పందించాడు. ఓపెనర్లుగా తమకు చాలా అవకాశాలు ఉన్నాయన్న ద్రవిడ్... తమ రహస్యాలను బహిర్గతం చేయబోమన్నాడు. ఐపీఎల్‌లో రోహిత్, జైస్వాల్, విరాట్ ఓపెనర్లుగా రాణించిన విషయాన్ని ది వాల్ గుర్తు చేశాడు. పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని ద్రవిడ్ తెలిపాడు.
ఐసీసీ టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన
ఇటీవల ఐసీసీ టోర్నీలలో టీమిండియా మెరుగ్గా ప్రదర్శన చేస్తోందని రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. గత ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఓడిపోయినా స్ఫూర్తిదాయక ప్రయాణం చేసిందని గుర్తు చేశాడు. ప్రపంచకప్ టోర్నమెంట్‌లలో బాగా ఆడామనే తాను భావిస్తున్నట్లు ద్రవిడ్ తెలిపాడు. ఐసీసీ టోర్నమెంట్‌లో తాము నాకౌట్ మ్యాచుల్లో పరాజయం పాలయ్యామని... తమ వ్యూహాలను చివరి దశలో అమలు చేయలేకపోయామని ద్రవిడ్ అంగీకరించాడు. నాకౌట్ మ్యాచ్‌ల ఒత్తిడిని అధిగమించేందుకు మరింత మెరుగ్గా సాధన చేశామని వెల్లడించాడు. తాము గతం గురించి ఆలోచించడం లేదని... వర్తమానంపైనే పూర్తి దృష్టి పెట్టామని మిస్టర్ డిపెండబుల్ వివరించాడు.