Kedar Jadhav Retirement: భారత ఆల్‌రౌండర్‌ కేదార్‌ జాదవ్‌( Kedar Jadhav) ఒకేశారు అన్ని రకాల క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 39 ఏళ్ల కేదార్ తన అధికారిక 'X' ఖాతా నుండి ట్వీట్ ద్వారా ఈ నిర్ణయాన్ని ప్రకటించాడు. కేదార్ జాదవ్ 73 సార్లు వన్డే ఇంటర్నేషనల్స్‌(ODI)లో మరియు 9 సార్లు T20I లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ చేసే కేదార్‌ ఆఫ్‌స్పిన్నర్‌గానూ రాణించాడు. మహారాష్ట్ర(Maharastra) తరఫున రంజీల్లో ఆడిన కేదార్‌ 87 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ల్లో తలపడ్డాడు. ఐపీఎల్ 2023 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున జాదవ్ చివరిసారిగా ఆడాడు.


అచ్చు ధోనీ లాగే.. 


కేదార్ జాదవ్ తన రిటైర్మెంట్‌ను ధోనీ స్టైల్‌లో ప్రకటించాడు. 2020 ఆగష్టు 15న ధోనీ సోషల్ మీడియా వేదికగా 'మద్దతు ఇచ్చిన అభిమానులకు ధన్యవాదాలు. 19.29 గంటల నుంచి రిటైర్మెంట్ అయినట్లుగా పరిగణించండి' అని ధోనీ పేర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు  కేదార్  అచ్చు అలాగే కేదార్ జాదవ్ కూడా పోస్ట్ చేశాడు. ''నా కెరీర్‌లో మద్దతు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. 15.00 గంటల నుంచి అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ అయినట్లుగా పరిగణించండి'' అని జాదవ్ సోషల్ మీడియాలో  పోస్ట్ చేశాడు. 




టీమిండియా(Team India) సాధించిన ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 2019 వరల్డ్ కప్‌లో కీలక ఆటగాడిగా  సత్తాచాటాడు. బ్యాటింగ్‌తో పాటు బంతితోనూ మెరుస్తూ విలువైన ప్లేయర్‌గా ఎదిగాడు.  అయితే ఫామ్ లేమి, మైదానంలో చురుకుగా కదలలేక పోవటంతో  క్రమంగా భారత జట్టు నుంచి దూరమయ్యాడు.  జట్టుకు వికెట్ కావాల్సిన స్థితిలో పార్ట్ టైమ్ స్పిన్నర్‌గా బంతిని అందుకొని ప్రత్యర్థికి జోరుకు బ్రేక్‌లు వేయడంలో కేదార్ సిద్ధహస్తుడు. అందుకే అతనిని ఒకప్పుడు గోల్డెన్ హ్యాండ్ గా అభివర్ణించేవారు.  భారత్ తరఫున 73 వన్డేలు ఆడాడు. 52 ఇన్నింగ్స్‌ల్లో 1389 పరుగులు సాధించాడు. వీటిలో రెండు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 


మరోవైపు  5.16 ఎకానమీ రేటుతో 27 వికెట్లు పడగొట్టాడు. ఇక టీ20 ఫార్మాట్ లో మాత్రం పెద్దగా మెరిపించలేకపోయాడు.  9 మ్యాచ్‌లు ఆడిన జాదవ్ 123.23 స్ట్రైక్ రేట్‌తో కేవలం 122 పరుగులు మాత్రమే సాధించాడు. 2019 వరల్డ్ కప్‌లో కీలక ఆటగాడిగా ఉన్న జాదవ్ ఆ తర్వాత రాణించలేకపోయాడు. టీమిండియా తరఫున 2014లో అరంగేట్రం చేసినకేదార్‌ జాదవ్‌ 2020 ఫిబ్రవరిలో చివరి  మ్యాచ్ ఆడాడు. ఇక ఐపీఎల్(IPL) విషయానికి వస్తే  2018లో చెన్నై సూపర్ కింగ్స్(CSK) టైటిల్  గెలుచుకున్నసమయంలో జాదవ్ కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2023 ద్వితీయార్ధంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున జాదవ్ చివరిసారిగా ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్(DC), సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) జట్ల తరపున కూడా ఆడాడు. ఐపీఎల్ కెరియర్‌లో మొత్తం 95 మ్యాచ్‌లు ఆడిన జాదవ్ 4 అర్ధసెంచరీలు సాధించాడు. 123.14 స్ట్రైక్ రేట్‌తో 1208 పరుగులు సాధించాడు.