ICC Cricket WC 2023: భారత జట్టులో ప్రయోగాలు చేయడం మానేసి 2023 వన్డే ప్రపంచకప్ కోసం సన్నాహాలు మొదలుపెట్టాలని... టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ సూచించాడు. కప్ గెలవాలంటే ఇప్పటినుంచే సన్నద్ధత అవసరమని అన్నాడు.
అక్టోబర్- నవంబర్ లలో జరిగిన టీ20 ప్రపంచకప్ లో టీమిండియా విఫలమైంది. గ్రూపు స్టేజ్ లో కోహ్లీ, సూర్య, హార్దిక్ పాండ్య మెరవటంతో సెమీస్ కు వెళ్లిన జట్టు అక్కడ బొక్కబోర్లా పడింది. ఇంగ్లండ్ చేతిలో అవమానకర రీతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ముగ్గురు, నలుగురు ఆటగాళ్లు తప్ప అందరూ విఫలమయ్యారు. ఈ పర్యవసానంతో బీసీసీఐ సెలక్షన్ కమిటీని సస్పెండ్ చేసింది. ఇక వచ్చే ఏడాది సొంతగడ్డపైనే వన్డే ప్రపంచకప్ జరగనుంది. దీనిపై మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ బీసీసీఐకు కొన్ని సూచనలు చేశాడు.
వజ్రాల కోసం బంగారాన్ని వదిలేస్తున్నాం
ఇప్పుడు జట్టులో అనవసర ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదని కైఫ్ అన్నాడు. 'మనం వజ్రాల వేటలో పడి బంగారాన్ని కోల్పోతున్నాం. కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వడం మంచిదేకానీ... అనుభవజ్ఞులను వదిలేయకూడదు. న్యూజిలాండ్ తో ఆడుతున్న వన్డే జట్టులో భువనేశ్వర్ ను ఎందుకు తీసుకోలేదు. అలాగే ఒక మ్యాచులో విఫలమయ్యాడని శార్దూల్ ను పక్కనపెట్టారు. దీపక్ చాహర్ మంచి ఆప్షనే కానీ ముందునుంచే అతన్ని తీసుకోవాల్సింది. ఇలా మ్యాచు మ్యాచుకు ఆటగాళ్లను మార్చుకుంటూ పోతే జట్టులో స్థిరత్వం ఎలా ఉంటుంది' అని కైఫ్ అన్నాడు.
వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ కోసం ఇప్పటినుంచే సుస్థిరమైన జట్టును తయారుచేసుకోవాలని కైఫ్ అన్నాడు. 'ఇక ప్రయోగాలకు సమయంలేదు. ప్రపంచకప్ నకు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలి. మెగా టోర్నీకి ఏయే ఆటగాళ్లను పరిగణనలోకి తీసుకున్నారో వారిని మళ్లీ మళ్లీ ఆడించాలి. అప్పుడే ప్రాక్టీస్ లభిస్తుంది. ముఖ్యంగా బౌలర్లను తయారుచేసుకోవాలి. బుమ్రా టీ20 ప్రపంచకప్ నకు దూరం అయ్యాడు. మంచి వేగంతో బంతులేసే ఉమ్రాన్ మాలిక్ ను మెగా టోర్నీ కోసం తయారుచేసుకోవాలి' అని మహమ్మద్ కైఫ్ సూచించాడు.