IND vs AUS Final 2023 : కోట్ల మంది భారత (Bharat) అభిమానుల హృదయాలు ముక్కలు చేస్తూ... కోటీ మంది ఆశలు గల్లంతు చేస్తూ ఆస్ట్రేలియా(Austrelia) ఆరోసారి ప్రపంచకప్‌ను ఒడిసిపట్టింది. ఆశలను.. ఆనందాలను.. అంచనాలను తలకిందులు చేస్తూ రోహిత్‌ సేనను ఫైనల్లో మట్టికరిపించి ఆరోసారి కంగారులు ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్నారు. తొలుత బ్యాటింగ్‌లో టీమిండియాను తక్కువ పరుగులకే అవుట్‌ చేసిన ఆస్ట్రేలియా ఆ తర్వాత సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించి ఆరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. టీంఇండియా నిర్ణీత 50 ఓవర్ లలో 240 పరుగులు చేయగా ఆస్ట్రేలియా మరో 42 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. కోటీ మంది అభిమానుల ఆశలను భగ్నం చేస్తూ స్వదేశంలో జరిగిన ప్రపంచ కప్‌ ఫైనల్లో టీమిండియా పరాజయం పాలైంది. ఈ ఓటమితో అభిమానుల గుండెలను రోహిత్‌ సేన కోత పెట్టింది. పుష్కర కాలం తర్వాత ఐసీసీ ట్రోఫీని ముద్దాడాలనే భారత జట్టు కల కలగానే మిగిలిపోయింది. ఫైనల్‌లో ఓటమి భారత ఆటగాళ్లతో పాటు కోట్లాది మంది అభిమానుల హృదయాలను ముక్కలు చేసింది. 

 

ఈ ఓటమిని జీర్ణించుకోలేక టీమ్‌ఇండియా ఆటగాళ్లు మైదానంలో భావోద్వేగానికి లోనయ్యారు. ఇలాంటి క్షణాల్లో నిరాశలో కూరుకుపోయిన మన జట్టుకు భరోసానిచ్చి, ఉత్సాహపరిచేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లి ఆటగాళ్లను ఓదార్చారు. ప్రధాని మోదీతో ఉన్న ఫొటోను రవీంద్ర జడేజా సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించినా ఫైనల్లో ఓడిపోవడంతో తమ గుండె బద్దలైందని రవీంద్ర జడేజా ట్వీట్‌ చేశాడు. మీ మద్దతుతోనే మేం ముందుకు సాగుతున్నామని ఈ లెఫ్టార్మ్‌ సీమర్‌ భావోద్వేగానికి గురయ్యాడు. ప్రధాని మోదీ డ్రెస్సింగ్‌ రూమ్‌కు రావడం చాలా ప్రత్యేకంగా అన్పించిందన్న రవీంద్ర జడేజా... ఇదీ ఎంతో ప్రేరణనిచ్చిందని జడ్డూ పోస్ట్‌లో పేర్కొన్నాడు. షమీ కూడా మరో ఫొటోను షేర్‌ చేస్తూ ప్రధానికి కృతజ్ఞతలు తెలిపాడు. మళ్లీ బలంగా తిరిగొస్తామని తాను చేసిన ట్వీట్‌లో ఈ స్పీడ్‌ స్టార్‌ పేర్కొన్నాడు.

 

ప్రపంచకప్ ఫైనల్లో (World Cup 2023 Final) ఆస్ట్రేలియా (Australia) చేతిలో ఓడిన భారత్‌ (Team India)కు అభిమానులు అండగా నిలుస్తున్నారు. గెలిచినా ఓడినా భారత్‌కు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెబుతున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) సైతం భారత్ ఓటమిపై స్పందించారు. సోషల్ మీడియా ఎక్స్ (Twitter)లో ఆయన భారత జట్టుకు మద్దతుగా ట్వీట్ చేశారు. యావత్ దేశం మీతోనే ఉంటుంది.. ఈరోజు, రేపు, ఎలప్పుడూ..’ అని ప్రధాని మోదీ అన్నారు.

ఆటలో గెలుపోటములు సహజం అని, ఓటమి పాలైనంత మాత్రాన నిరుత్సాహ పడిపోవాల్సిన అవసరం లేదని చెబుతూ ప్రధాని మోదీ స్పందించారు. ‘డియర్ టీమిండియా.. ప్రపంచ కప్ లో గొప్ప ప్రదర్శన కనబరిచారు. ఈ టోర్నీ మొత్తం మీ ప్రతిభ, సంకల్పం అద్భుతం, అమోఘం. మీరు గొప్ప స్ఫూర్తితో ఆడారు. దేశం గర్వించేలా చేశారు. ఈ దేశ ప్రజలు ఈరోజు, ఎల్లప్పుడూ మీతో పాటు ఉంటారు’ అంటూ ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.