World Cup Final 2023: భారత్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో అసలు సిసలు హీరో కచ్చితంగా సారధి రోహిత్‌ శర్మ(Rohit Sharma)నే. ఆరంభంలోనే దూకుడుగా బ్యాటింగ్ చేసి జట్టు భారీ స్కోరు చేసేందుకు హిట్‌ మ్యాన్‌ బలమైన పునాదిని వేశాడు. రికార్డులు, శతకాల గురించి ఆలోచనే లేకుండా భారత్‌(Bharat)కు ప్రపంచకప్‌(World Cup) అందించడానికి చేయాల్సిందంతా చేశాడు. రోహిత్‌ శర్మ విధ్వంసంతోనే టీమిండియా వన్డే ప్రపంచకప్ టైటిల్ కు అడుగుదూరంలో నిలిచిపోయింది. కప్పు గెలవకపోయినా రోహిత్‌ శర్మ నాయకత్వం... ఆటతీరు ఈ ప్రపంచకప్‌నే ప్రత్యేకంగా నిలిపింది. ఈ ప్రపంచకప్ చివరి మ్యాచ్‌లో రోహిత్ శర్మ 31 బంతుల్లో 47 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ప్రపంచకప్ టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. ఈ వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ 11 మ్యాచ్‌ల్లో మొత్తం 597 పరుగులు చేశాడు. ఇది ప్రపంచ కప్ చరిత్రలో ఏ కెప్టెన్ చేయని ఘనత. అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు హిట్‌మ్యాన్. ఈ రికార్డులో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, మరో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ పేరు మీద ఉండేది. ఇప్పుడు రోహిత్ శర్మ వాళ్లను అధిగమించి కొత్త చరిత్ర సృష్టించాడు. 


కానీ ఇప్పుడు మరో ప్రపంచకప్‌ రావాలంటే మరో నాలుగేళ్ల సమయం ఉంది. అప్పటివరకూ రోహిత్‌ శర్మ జట్టులో ఉంటాడా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. వయసు మీద పడే కొంతమంది ఆటగాళ్లు చివరి ప్రపంచకప్‌ ఆడేశారనే చెప్పాలి. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 2027 ప్రపంచకప్‌లో ఆడడం అంతే తేలిక కాదు. ఎందుకంటే రోహిత్‌ శర్మకు ఇప్పటికే 36 ఏళ్లు వచ్చేశాయి. అదీకాక ఫిట్‌నెస్‌ సమస్యలతో కూడా హిట్‌ మ్యాన్‌ ఇబ్బంది పడుతున్నాడు. అలాంటిది 2027 ప్రపంచకప్‌ నాటికి రోహిత్‌కు 40 ఏళ్ల వయసు వచ్చేస్తుంది. 40 ఏళ్ల వయసులో రోహిత్‌ శర్మ వచ్చే ప్రపంచకప్‌లో జట్టులో ఉండడం అంత తేలికైన విషయమేమీ కాదు. ఈ ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించిన మహ్మద్‌ షమీ కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు. మహ్మద్ షమీకి ప్రస్తుతం 33 ఏళ్లు వచ్చేశాయి. అంటే వచ్చే ప్రపంచకప్‌ నాటికి షమీ 37 ఏళ్ల వయసులో జట్టులో కొనసాగే అవకాశాలు దాదాపుగా లేనట్లే. అసలే పేసర్లకు గాయాలు ఎక్కువగా అవుతుంటాయి. అలాంటి  పరిస్థితుల్లో షమీ మరో నాలుగేళ్ల తర్వాత జట్టులో ఉంటాడని ఊహించడం అత్యాశే అవుతుంది.


రవిచంద్రన్‌ అశ్విన్‌కు ప్రస్తుతం 37 ఏళ్లు. అంటే అశ్విన్‌కు ఇదే చివరి ప్రపంచకప్‌. ఈ ప్రపంచకప్‌లోనూ అశ్విన్‌ను తుది జట్టులో స్థానం పెద్దగా లభించలేదు. అక్షర్‌ పటేల్‌కు గాయం కావడం వల్ల జట్టులోకి వచ్చిన అశ్విన్‌కు వచ్చే ప్రపంచకప్‌లో చోటు దక్కడం అసాధ్యమే. అంటే ఇక అశ్విన్‌ను ప్రపంచకప్‌లో చూడడం జరగదు. రవీంద్ర జడేజాకు ప్రస్తుతం 34 ఏళ్లు. అంటే జడేజా కూడా వచ్చే ప్రపంచకప్‌లో కనిపించే అవకాశంలేదు. అంటే ఈ ప్రపంచకప్‌తో దాదాపుగా అయిదుగురు క్రికెటర్ల వరల్డ్ కప్‌ శకం దాదాపుగా ముగిసినట్లే.


కోహ్లీకే మినహాయింపు
టీమిండియాలో ఫిట్‌నెస్‌ అంటే కోహ్లీ.. కోహ్లీ అంటేనే ఫిట్‌నెస్‌. కాబట్టి ఫిట్‌నెస్‌ విషయంలో వందకు వందశాతం ఫిట్‌గా ఉండే కోహ్లీ వచ్చే ప్రపంచకప్‌ ఆడే అవకాశం ఉంది. కోహ్లీకు ఇప్పుడు 35 ఏళ్లు. వచ్చే ప్రపంచకప్‌ నాటికి కోహ్లీకి 39 ఏళ్లు వచ్చేస్తాయి. అయినా పూర్తి ఫిట్‌గా ఉండే కోహ్లీ ఆ ప్రపంచకప్‌ ఆడే అవకాశం ఉంది. ఇక వేరే జట్టు ఆటగాళ్లు బెన్‌ స్టోక్స్‌, ఏంజెలో మాథ్యూస్‌, మహమ్మద్‌ నబి, వార్నర్‌, స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌, స్టాయినిస్‌, స్టార్క్‌, కేన్‌ విలియమ్సన్‌, బౌల్ట్‌, సౌథీ, షకిబుల్‌ హసన్‌, ముష్ఫికర్‌ రహీం, డేవిడ్‌ మలన్‌, మొయిన్‌ అలీ, క్రిస్‌వోక్స్‌, ఆదిల్‌ రషీద్‌, బవుమా, మిల్లర్‌, వాండర్‌ డసన్‌ వీళ్లందరికీ 30 ఏళ్ల వయసు దాటిపోయింది. కాబట్టి వీళ్లంతా వచ్చే ప్రపంచకప్‌లో దాదాపుగా కనపడరు. ఇప్పటికే డికాక్‌, డేవిడ్‌ విల్లీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు కూడా పలికారు.