Indian Cricket Team Lost: కోటీ మంది అభిమానుల ఆశలను భగ్నం చేస్తూ స్వదేశంలో జరిగిన ప్రపంచ కప్‌ ఫైనల్లో టీమిండియా (Team India) పరాజయం పాలైంది. ఈ ఓటమితో అభిమానుల గుండెలను రోహిత్‌(Rohit Sharma)  సేన కోత పెట్టింది. పుష్కర కాలం తర్వాత ఐసీసీ(ICC) ట్రోఫీని ముద్దాడాలనే భారత జట్టు కల కలగానే మిగిలిపోయింది. ఈ ఓటమితో ప్రపంచకప్‌(World Cup) లో టీమిండియా పోరాటం ముగియగా.... కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌(Rahul Drevid) పదవీకాలం కూడా అధికారికంగా ముగిసింది. భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డ్‌ ఒప్పందం ప్రకారం వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌తో రాహుల్ ద్రవిడ్‌ పదవీకాలం పూర్తయింది. రాహుల్‌ ద్రావిడ్‌ రెండేళ్ల పాటు టీమిండియాకు కోచ్‌గా ఉన్నాడు. ఈ రెండేళ్ల కాలంలో ఐసీసీ నిర్వహించిన టోర్నమెంట్‌లలో రెండుసార్లు ఫైనల్స్‌కు, ఒకసారి సెమీస్‌కు టీమిండియాను ది వాల్‌ తీసుకెళ్లాడు. ఆసియా కప్‌లో విజేతగా నిలిపాడు. ఇప్పుడు రాహుల్‌ ద్రావిడ్‌ను కొనసాగిస్తారా లేదా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో రాహుల్‌ ద్రావిడ్‌ స్పందించాడు. కనీసం ఒక్క ఫార్మాట్‌లోనైనా జట్టుకు కోచ్‌గా వ్యవహరించే అవకాశం వస్తే స్వీకరిస్తారా అన్న ప్రశ్నకు రాహుల్‌ ఆసక్తికరంగా సమాధానం ఇచ్చాడు. 



తాను ఇంకా టీమిండియా కోచింగ్‌పై ఎలాంటి ఆలోచనా చేయలేదని రాహుల్‌ ద్రావిడ్‌ స్పష్టం చేశాడు. ఇప్పటివరకూ ప్రపంచకప్‌పైనే దృష్టి సారించామని.. ఈ మెగా టోర్నీ ఇప్పటికే ముగిసినందున ఇంకా భవిష్యత్తు ప్రణాళికపై తాను ఇంకా ఎలాంటి ఆలోచన చేయలేదని స్పష్టం చేశాడు. తన రెండేళ్ల పనితీరుపై బయట నుంచి ఎన్ని విమర్శలు, వ్యాఖ్యలు వచ్చినా పట్టించుకోనని.. తన బాధ్యతలను ఎలా నిర్వర్తించానని స్వయంగా విశ్లేషించుకుంటానని రాహుల్‌ స్పష్టం చేశాడు. ప్రపంచకప్‌ లాంటి మెగా టోర్నీలో అద్భుతమైన జట్టుతో కలిసి పని చేసినందుకు గర్వపడుతున్నానని... అన్ని విభాగాల్లో ఆటగాళ్లతో కలిసిపోయి పని చేయడం ఆనందంగా ఉందన్నాడు. ఈ జట్టుతో కలిసి పనిచేయడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నానని ద్రవిడ్ తెలిపాడు. రోహిత్ శర్మ అద్భుతమైన నాయకుడని... జట్టును అద్భుతంగా నడిపించాడని రాహుల్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. చర్చకైనా, సమావేశాలకైనా రోహిత్‌ ఠంచనుగా వచ్చేస్తాడని.. ప్రతి మ్యాచ్‌ కోసం ముందే పక్కాగా ప్లానింగ్‌ ఉంటుందని ది వాల్ కొనియాడాడు. వరల్డ్‌ కప్ వంటి మెగా టోర్నీ ఫైనల్‌లో ఓడిపోవడంతో డ్రెస్సింగ్‌ రూమ్‌ తీవ్ర నిరుత్సాహానికి గురైందని... వారిని ఇలా చూడటం బాధగా ఉందన్నాడు. ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారని....ఎన్నో త్యాగాలు చేసి ఇక్కడి వరకు వచ్చారని ద్రవిడ్‌ వెల్లడించాడు.



 వచ్చేఏడాది జరిగే టీ 20 ప్రపంచకప్‌నకు కోచింగ్‌ బాధ్యతలు స్వీకరిస్తారా అనే దానికి కూడా రాహుల్‌ ద్రావిడ్‌ సూటిగా సమాధానం ఇవ్వలేదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది ఎవరు చెప్పలేరని.... ఇప్పటికైతే తన వద్ద ఎలాంటి ప్రణాళికలు లేవని రాహుల్‌ ద్రావిడ్‌ స్పష్టం చేశాడు. 2027 ప్రపంచకప్‌ గురించి కూడా ఇప్పుడే ఆలోచించడం సరికాదని... దానికి ఇంకా చాలా సమయం ఉందని రాహుల్‌ స్పష్టం చేశాడు. వచ్చే టీ 20 ప్రపంచకప్‌ నాటికి రాహుల్‌ ద్రవిడ్‌ టీ 20 కోచింగ్‌ బాధ్యతలు చేపట్టకపోతే వీవీఎస్‌ లక్ష్మణ్‌కు ఆ బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై బీసీసీఐ ఇప్పటివరకూ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.