Tim David On Rohit Sharma: ఐపీఎల్‌లో విజయవంతమైన  కెప్టెన్‌గా రోహిత్ శర్మకు  మంచి రికార్డు ఉంది.  కానీ గత సీజన్‌లో ముంబై  పేలవ ప్రదర్శనతో ఆ జట్టు  పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో నిలిచింది.  ఈ ఏడాది కూడా ఆ జట్టు ప్రయాణం ఒడిదొడుకుల మధ్యే సాగుతోంది. ఈ సీజన్ లో ముంబై  8 మ్యాచ్‌లు ఆడితే నాలుగింట గెలిచి నాలుగు ఓడింది. 

కాగా రాజస్తాన్ రాయల్స్‌తో ముగిసిన ఉత్కంఠ పోరులో గెలిచాక.. ఈ గెలుపులో కీలక పాత్ర పోషించిన ముంబై  బ్యాటర్ టిమ్ డేవిడ్  ఆ జట్టు సారథి   రోహిత్ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత సీజన్ తో పాటు  ప్రస్తుత ఎడిషన్ లో కూడా తాము (ముంబై) చెత్తగా ఆడటంతో  రోహిత్ నిద్రలేని రాత్రులు గడిపాడని, అందుకే ఎలాగైనా రాజస్తాన్ తో మ్యాచ్ లో గెలిచి  కెప్టెన్ కు బర్త్ డే గిఫ్ట్ ఇవ్వాలని ఫిక్స్ అయి  బాదినట్టు చెప్పుకొచ్చాడు. 

డేవిడ్ మాట్లాడుతూ..  ప్రస్తుత సీజన్లో తాము ఆశించిన  స్థాయిలో రాణించకపోవడం వల్ల  రోహిత్ శర్మ నిద్రలేని రాత్రులు గడిపాడని, చివరికి అతడి  పుట్టినరోజున  గెలుపును కానుకగా ఇచ్చామని  అన్నాడు.   రాజస్తాన్ తో మ్యాచ్ లో తిలక్ వర్మ కాస్త టచ్ లో లేనట్టు అనిపించిందని, అందుకే బాదే బాధ్యత తాను తీసుకున్నానని వివరించాడు. మ్యాచ్‌ను ముగించేందుకు  కసిగా ఆడానని, హ్యాట్రిక్ సిక్సర్లతో  గేమ్ ను ముగించడం  గొప్ప అనుభూతిని కలిగించిందని చెప్పుకొచ్చాడు. 

 

నెక్ట్స్ పొలార్డ్ : రోహిత్ 

రోహిత్ శర్మకు డేవిడ్ బర్త్ డే గిఫ్ట్ ఇవ్వగా  హిట్‌మ్యాన్ అతడి బ్యాటింగ్ పై  ప్రశంసలు కురిపించాడు.ముంబై టీమ్ లో కీరన్ పొలార్డ్ చాలా కీలక ఆటగాడని, సుదీర్ఘకాలం తమ జట్టుకు సేవలందించాడని చెప్పిన రోహిత్.. ఆ స్థానాన్ని టిమ్ డేవిడ్ భర్తీ చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. టిమ్ బ్యాటింగ్ లో  పవర్ ఉందని, లోయరార్డర్ లో అటువంటి బ్యాటర్ ఉండటం ఏ జట్టుకైనా   అవసరమని తెలిపాడు.  డేవిడ్ వంటి హిట్టర్ ఉంటే ప్రత్యర్థి బౌలర్ ఎంతటివాడైనా భయపడక తప్పదని   చెప్పాడు.  

కాగా ఆదివారం  రాజస్తాన్ తో ముగిసిన మ్యాచ్‌లో  రోహిత్ సేన  213 పరుగులతో బరిలోకి దిగింది.  రోహిత్ (3), ఇషాన్ కిషన్ (28) త్వరగానే  నిష్క్రమించినా  కామెరూన్ గ్రీన్ (44), సూర్యకుమార్ యాదవ్ (55) ల పోరాడగా చివర్లో టిమ్ డేవిడ్ 14 బంతుల్లోనే    2 బౌండరీలు,  5 సిక్సర్ల సాయంతో  45 పరుగులు చేసి మరో మూడు బంతులు మిగిలుండగానే  విజయాన్ని అందుకుంది.