LSG vs RCB IPL 2023: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు  (ఆర్సీబీ) టాపార్డర్ బ్యాటర్స్ విరాట్ కోహ్లీ, గ్లెన్  మ్యాక్స్‌వెల్, ఫాఫ్ డుప్లెసిస్ పేర్లలోని మొదటి అక్షరాలను తీసుకుని అభిమానులను  కేజీఎఫ్ అని పిలుస్తున్న విషయం తెలిసిందే.   ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్‌కు వీరే మూలస్థంభాలుగా ఉన్నారు.  ఈ ముగ్గురూ  ఐపీఎల్-16లో  వీరబాదుడు బాదుతున్నారు. ఎవరైనా ఒకరు విఫలమైతే మిగిలిన ఇద్దరూ బాధ్యత తీసుకుంటున్నారు.  అసలు ఆర్సీబీ   ఈ సీజన్ లో  కాస్తో కూస్తో నెగ్గుకొస్తుందంటే అది వీళ్ల చలవే అని చెప్పకతప్పదు. అదే సమయంలో ఈ ముగ్గురి మీద అధికంగా ఆధారపడుతుందన్నది కళ్లముందు కనబడుతున్న సత్యమే. 


తాజాగా  టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా ఇదే విషయాన్ని ఎత్తిచూపాడు. ఈ ముగ్గురూ విఫలమైతే   పరిస్థితి ఏంటని..?  అప్పుడు ఆర్సీబీ   బ్యాటింగ్  ఎవరిమీద  ఆధారపడాలని ప్రశ్నించాడు.  స్టార్  స్పోర్ట్స్‌లో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ ఇర్ఫాన్ ఈ కామెంట్స్ చేశాడు.  


ఇర్ఫాన్ మాట్లాడుతూ.. ‘ఆర్సీబీ కేజీఎఫ్‌కు మరీ ఒత్తిడి పెంచకుండా ఒక సొల్యూషన్ కనుగొనాలి.  ఒకవేళ కేజీఎఫ్ విఫలమైతే  అప్పుడు బండిని లాగించేది ఎవరు..?  దినేశ్ కార్తీకా లేక మహిపాల్ లోమ్రరా..?  ఆర్సీబీ మిడిలార్డర్ చాలా బలహీనంగా ఉంది.   కార్తీక్ ఈ సీజన్ లో  8 మ్యాచ్ లలో ఒక్కదాంట్లో కూడా ఆహా అనిపించే ప్రదర్శన చేయలేదు.  ఛేదనలో అయితే దారుణంగా విఫలమవుతున్నాడు.  ఈ సమస్యపై ఆర్సీబీ మేనేజ్మెంట్ ఎంత త్వరగా దృష్టి సారిస్తే అంత మంచిది..’అని సూచించాడు.  


 






వాస్తవానికి ఇర్ఫాన్ చెప్పింది కూడా అక్షర సత్యమే. ఈ సీజన్ లో ఆర్సీబీ చేసిన పరుగులలో మేజర్ వాటా (సుమారు 75 శాతం వీళ్లు చేసినవే) కోహ్లీ, మ్యాక్స్‌వెల్,  డుప్లెసిస్‌దే.  ఇప్పటివరకు  8 మ్యాచ్‌లలో డుప్లెసిస్ 422 పరుగులు చేయగా  కోహ్లీ 333 రన్స్ చేశాడు. మ్యాక్స్‌వెల్  258 పరుగులు సాధించాడు.  కానీ  మిడిలార్డర్ లో దినేశ్ కార్తీక్ 83, మహిపాల్ లోమ్రర్  75 పరుగులతో దారుణంగా విఫలమవుతన్నారు. ఇకా షాదాబ్ ఖాన్, ప్రభుదేశాయ్‌ల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. 


 






ఐపీఎల్-16 పాయింట్ల పట్టికలో  ఆరో స్థానంలో ఉన్న  ఆర్సీబీ.. ఇకనైనా కేజీఎఫ్ మాత్రమే కాకుండా మిడిలార్డర్, లోయరార్డర్ మీద దృష్టి సారించకుంటే మరో ఏడాది ఆ జట్టు అభిమానుల ఉసురు పోసుకోక తప్పదు.  ఇప్పటికే ప్లేఆఫ్ రేసులో ఆ జట్టు  చాలా కష్టపడాల్సి వస్తోంది. కేజీఎఫ్ విఫలమై మిడిలార్డర్ వైఫల్యం ఇలాగే కొనసాగితే ఫ్యాన్స్  ‘ఈసాలా కప్ నమదెల్ల’ (ఈసారి కూడా కప్ మనది కాదు) అనుకుంటూ గుండెలు బాదుకోవడమే.