Pat Cummins Reply On Rohit Sharma Statement: లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో ఆస్ట్రేలియా 209 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. దీంతో ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటి వరకు అన్ని ఫార్మాట్లలో ఐసీసీ ట్రోఫీని గెలుచుకున్న తొలి జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది.


ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో కంగారూ జట్టు ఐదు రోజులూ అద్భుతంగా ఆడింది. అదే సమయంలో ఈ మ్యాచ్‌లో ఓటమి తర్వాత ఒక మ్యాచ్‌కు బదులుగా మూడు మ్యాచ్‌ల సిరీస్ ద్వారా ఫలితాన్ని నిర్ణయిస్తే బాగుంటుందని భారత కెప్టెన్ రోహిత్ శర్మ సూచించాడు. ఇప్పుడు దీనికి ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ఇచ్చిన రిప్లై వైరల్ అవుతోంది.


ఈ మ్యాచ్‌లో ఓటమి తర్వాత విలేకరుల సమావేశంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఒక ప్రశ్నకు సమాధానంగా, విజేతను నిర్ణయించడానికి ఒక మ్యాచ్‌కు బదులుగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ని నిర్వహించి ఉంటుంటే అది చాలా బాగుంటుందని చెప్పాడు. రెండేళ్ల ఏళ్ల పాటు కష్టపడి ఫైనల్‌కు చేరుకున్నారు. అయితే 3 మ్యాచ్‌ల సిరీస్ కోసం, విండో కూడా తదనుగుణంగా చూడాలి.


రోహిత్ శర్మ చేసిన ఈ ప్రకటనపై ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్‌ను ప్రశ్న అడిగినప్పుడు ‘ఇది మూడు మ్యాచ్‌ల సిరీస్‌ అయినా లేదా 16 మ్యాచ్‌ల సిరీస్‌ అయినా మాకు ఎలాంటి సమస్య లేదు. కానీ ఒలింపిక్స్‌లో ఆటగాళ్లు ఫైనల్‌లో ఒకే ఒక్క అవకాశంలో పతకాలు సాధిస్తారు.’ అన్నాడు. 


పాట్ కమిన్స్ కెప్టెన్సీలో ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న కంగారూ జట్టులో నలుగురు ముఖ్యమైన ఆటగాళ్ల పేరిట కూడా ప్రత్యేక రికార్డు నమోదు చేయబడింది. మూడు ఐసీసీ ట్రోఫీలు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ చేరారు. ఇందులో వన్డే ప్రపంచ కప్, టీ20 ప్రపంచ కప్, ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఉన్నాయి.


ఐసీసీ ట్రోఫీ నాకౌట్ స్టేజ్‌లో భారత  జట్టు వైఫల్యాల పరంపర  కొనసాగుతోంది. టీమిండియా చివరిసారి ఐసీసీ ట్రోఫీ నెగ్గి  ఈనెల 23 కు పదేండ్లు పూర్తవుతాయి. ఇంగ్లాండ్‌లో 2013 లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ (జూన్ 23న ఇంగ్లాండ్‌తో ఫైనల్ ముగిసింది)యే టీమిండియాకు ఆఖరి ఐసీసీ ట్రోఫీ.  ఈ దశాబ్దకాలంలో భారత్ పలుమార్లు ఛాంపియన్ అవడానికి దగ్గరగా వచ్చింది.  కానీ  ప్రతీసారి టీమిండియా ఫ్యాన్స్‌కు  ఆర్తనాదాలే మిగిలాయే తప్ప  భారత ఆటగాళ్లు అద్భుతాలు చేయలేదు.  వరుసగా రెండోసారి ఐసీసీ ‘గద’ను దక్కించుకునే పోరులో భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరినా టీమిండియా మాత్రం మరోసారి నిరాశపరించింది. దీంతో అభిమానులకు మరోసారి ‘వ్యథ’ మిగిలింది. 


2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత   భారత జట్టు  2014లో   జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్ చేరింది. తుదిపోరులో శ్రీలంక చేతిలో  చిత్తుగా ఓడింది. ఇక్కడ మొదలైన  అపజయాల పరంపర  ఆచారంగా  కొనసాగుతూనే ఉంది. 


ఇక ఈ ఏడాదే  రోహిత్ సేన స్వదేశంలో  భారత్ మరో ఐసీసీ  ట్రోఫీ ఆడనుంది.  ఈ ఏడాది అక్టోబర్‌లో వన్డే వరల్డ్ కప్ లో అయినా భారత జట్టు అభిమానుల దశాబ్ది కలను నిజం చేస్తుందో లేదో మరి..!  పదేండ్లుగా అందని ద్రాక్షలా ఊరిస్తున్న  ఐసీసీ ట్రోఫీ మెన్ ఇన్ బ్లూ చెంత చేరేదెప్పుడో..?