Pak vs Eng, 2nd Test: ముల్తాన్ వేదికగా పాకిస్థాన్- ఇంగ్లండ్ మధ్య జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు మ్యాచుల సిరీస్ లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. అయితే ఈ మ్యాచ్ ముగిసిన సమయంలో జరిగిన ఒక ఘటన ఆసక్తికరంగా మారింది. 


355 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ కు ఆఖరి రోజు విజయానికి 157 పరుగులు అవసరమయ్యాయి. 4 వికెట్లకు 198 పరుగుల వద్ద ఆటను ప్రారంభించిన పాక్ కు సౌద్ షకీల్, ఇమాముల్ హక్ లు ఐదో వికెట్ కు 80 పరుగుల భాగస్వామ్యం అందించారు. దీంతో ఒక దశలో పాక్ విజయం సాధించేలా కనిపించింది. అయితే ఆ ఇద్దరు బ్యాట్స్ మెన్ ఔటయ్యాక పాక్ టపటపా వికెట్లు కోల్పోయింది. లంచ్ కు ముందు 5 వికెట్లకు 210 పరుగులతో ఉన్న పాకిస్థాన్ 9 వికెట్లకు 319 పరుగులతో నిలిచింది. ఇక ఇంగ్లండ్ విజయం లాంఛనమే అనుకున్న తరుణంలో సల్మాన్ పదకొండో నెంబర్ బ్యాటర్ అలీతో కలిసి గెలుపు కోసం పోరాడాడు. అయితే ఓలీ రాబిన్సన్ అలీని కీపర్ క్యాచ్ ద్వారా ఔట్ చేయటంతో ఇంగ్లండ్ విజయం సాధించింది. ఇక్కడే ఒక ఆసక్తికర ఘటన జరిగింది. 






షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరణ


రాబిన్సన్ బంతి అలీ బ్యాట్ ను తాకుతూ కీపర్ చేతుల్లో పడింది. దీంతో ఇంగ్లండ్ ఆటగాళ్లందరూ గెలుపు సంబరాలు ప్రారంభించారు. అంపైర్ కూడా ఔట్ అని వేలు పైకెత్తాడు. అయితే అలీ డీఆర్ ఎస్ కోరాడు. ఆ ప్రాసెస్ జరుగుతుండగానే ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అలీతో కరచాలనం చేసేందుకు చేతిని ముందుకు చాపాడు. అయితే స్టోక్స్ కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు అలీ నిరాకరించాడు. అతనితో ఏదో అన్నాడు. అంతే వెంటనే స్టోక్స్ తన చేతిని వెనక్కు తీసుకున్నాడు. బహుశా థర్డ్ అంపైర్ ఇంకా ఔట్ ఇవ్వనందున అలీ కరచాలనం చేసేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. తర్వాత డీఆర్ ఎస్ లో ఔట్ అని ప్రకటించాక అలీ ఇంగ్లండ్ ఆటగాళ్లందరకీ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. 


ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ ను కోల్పోయిన పాకిస్థాన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ఫైనల్ చేరే అవకాశాన్ని కోల్పోయింది.