Saud Shakeel:  పాకిస్తాన్  క్రికెట్ జట్టు యువ సంచలనం  సౌద్ షకీల్  టెస్టు క్రికెట్‌లో అద్భుతాలు చేస్తున్నాడు.  ఈ మిడిలార్డర్ బ్యాటర్   తాజాగా  146 ఏండ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో  అరుదైన ఘనతను అందుకున్నాడు.  శ్రీలంక పర్యటనలో ఉన్న  షకీల్.. రెండో టెస్టులో అర్థ సెంచరీ  చేయడం ద్వారా.. ఆడిన తొలి ఏడు టెస్టులలోనూ  హాఫ్ సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు.  


2022లో ఇంగ్లాండ్ జట్టుపై అరంగేట్రం చేసిన   షకీల్..  ఇప్పటివరకూ ఆడిన ఏడు టెస్టులలోనూ అర్థ సెంచరీలు చేయడం గమనార్హం.  అతడి స్కోరు వివరాలను చూస్తే..  ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో 37, 76.. రెండో టెస్టులో  63, 94, మూడో టెస్టులో 23, 53 పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో  22,55, రెండో టెస్టులో 125, 32  పరుగులు సాధించాడు. ఇక శ్రీలంక పర్యటనలో భాగంగా తొలి టెస్టులో డబుల్ సెంచరీ (208), 30 పరుగులు చేసిన షకీల్.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 57 పరుగులు చేశాడు.  టెస్టు క్రికెట్‌లో ఇలా ఆడిన ఏడు టెస్టులలోనూ అర్థ సెంచరీలు చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. 


బ్రాడ్‌మన్ తర్వాత అతడే.. 


టెస్టు క్రికెట్‌లో  కనీసం 10 ఇన్నింగ్స్‌లు ఆడి అత్యధిక యావరేజ్ కలిగిన  బ్యాటర్లలో  షకీల్.. ఆస్ట్రేలియా దిగ్గజం  సర్ డాన్ బ్రాడ్‌మన్ తర్వాతి స్థానంలో నిలిచాడు.   బ్రాడ్‌మన్ యావరేజ్ 99.94గా ఉండగా  షకీల్ యావరేజ్ 98.50గా ఉంది.  అయితే అతడు ఇప్పటివరకూ  ఆడింది ఉపఖండపు పిచ్‌ల (పాకిస్తాన్, శ్రీలంక)పైనే..  ఈ ఏడాది పాకిస్తాన్.. డిసెంబర్‌లో  ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. షకీల్  అక్కడి పిచ్‌లపై ఎలా ఆడతాడనేది ఆసక్తికరం. 


 






క్లీన్ స్వీప్ దిశగా  పాకిస్తాన్.. 
 
కొలంబో వేదికగా జరుగుతున్న  పాకిస్తాన్ - శ్రీలంక రెండో టెస్టులో  బాబర్ ఆజమ్ సేన ఇన్నింగ్స్ విజయం దిశగా సాగుతోంది.  ఈనెల 24న మొదలైన ఈ టెస్టులో  శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగులకే కుప్పకూలింది.   పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 134 ఓవర్లు ఆడి  576 పరుగుల భారీ స్కోరు చేసింది.  పాక్ ఓపెనర్ షఫీక్ (201) డబుల్ సెంచరీతో చెలరేగాడు.  అగా సల్మాన్ (132) సెంచరీ చేయడంతో పాక్ భారీ స్కోరు సాధించింది.   శ్రీలంకపై ఏకంగా 410 పరుగుల భారీ ఆధిక్యాన్ని దక్కించుకుంది.  రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక తడబడుతోంది.  నాలుగో రోజు టీ విరామానికే ఆ జట్టు సగం వికెట్లు కోల్పోయింది.  53 ఓవర్లు ముగిసేటప్పటికీ  శ్రీలంక.. 53 ఓవర్లలో  6 వికెట్లు నష్టపోయి  143 పరుగులు చేసింది.  లంక  ఇంకా  267 పరుగులు వెనుకబడి ఉంది.   లంక బ్యాటర్లలో ఔట్ అయినవారందరూ పాక్ బౌలర్ నోమన్ అలీ బౌలింగ్‌లోనే వెనుదిరగడం గమనార్హం.  ఆరు వికెట్లూ అలీకే దక్కాయి. ప్రస్తుతం లంకకు ఇన్నింగ్స్ ఓటమి  తప్పేట్లు లేదు.







ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial