ICC Test Rankings: వెస్టిండీస్‌తో రెండు టెస్టులలో పరుగుల పండుగ చేసుకున్న భారత బ్యాటర్లు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో తమ స్థానానాలను మెరుగుపరుచుకున్నారు. తొలి, రెండో టెస్టులో మెరుగ్గా ఆడిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బౌలర్లు మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటారు.
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా సారథి రోహిత్ శర్మ టాప్ - 10 లో చోటును కాపాడుకున్నాడు. గత వారం 9వ ర్యాంకులో ఉన్న హిట్‌మ్యాన్.. ప్రస్తుతం 759 పాయింట్లతో లంక బ్యాటర్ దిముత్ కరుణరత్నెతో కలిసి 9వ స్థానంలో కొనసాగుతున్నాడు. టాప్ - 10 లో ఉన్న ఏకైక భారత బ్యాటర్ అతడే. విరాట్ కోహ్లీ 14వ స్థానంలో ఉండగా గతేడాది రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ రిషభ్ పంత్ ఒకస్థానం దిగజారి 12వ స్థానంలో ఉన్నాడు. గతవారం 74వ స్థానంలో ఉన్న టీమిండియా యువ ఓపెనర్.. 11 స్థానాలు మెరుగుపరుచుకుని 63వ స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలిమయ్సన్ 883 రేటింగ్ పాయింట్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతోండగా లబూషేన్ (ఆసీస్), జో రూట్ (ఇంగ్లాండ్), ట్రావిస్ హెడ్ (ఆసీస్), బాబర్ ఆజమ్ (పాకిస్తాన్) టాప్ - 5లో ఉన్నారు.
బౌలర్ల విషయానికొస్తే టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. 879 రేటింగ్ పాయింట్స్‌తో ఉన్న అశ్విన్.. వెస్టిండీస్‌తో రెండు టెస్టులలోనూ 12 వికెట్లు పడగొట్టి తన స్థానాన్ని మరింత పదిలపరుచుకున్నాడు. బౌలర్ల జాబితాలో రవీంద్ర జడేజా ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని సిక్స్త్ ప్లేస్‌కు చేరాడు. బుమ్రా 11వ స్థానంలో కొనసాగుతుండగా ఐదు స్థానాలు మెరుగుపరుచుకున్న సిరాజ్.. 33వ స్థానానికి చేరాడు. షమీ 20వ స్థానంలో కొనసాగుతున్నాడు.
ఆల్ రౌండర్ల విషయంలో కూడా భారత ఆటగాడే నెంబర్ వన్, నెంబర్ టూ గా ఉండటం విశేషం. టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 455 రేటింగ్ పాయింట్స్‌తో అగ్రస్థానాన్ని కొనసాగిస్తుండగా.. 370 రేటింగ్ పాయింట్స్‌తో అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో షకిబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్), బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్), అక్షర్ పటేల్ (ఇండియా) లు టాప్ - 5లో కొనసాగుతున్నారు.
టెస్టు టీమ్ ర్యాంకులలో భారత జట్టు 121 పాయింట్లతో నెంబర్ వన్ ర్యాంకును కొనసాగిస్తోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ టాప్-5లో కొనసాగుతున్నాయి. భారత జట్టు టీ20లలో కూడా అగ్రస్థానంలోనే ఉండగా వన్డే ర్యాంకింగ్స్‌లో 3వ స్థానంలో కొనసాగుతోంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial