Asia Cup 2025 Farhan Made Fifty In Pak against Ind Match Update: ఇండో-పాక్ మ్యాచ్ అంచనాలకు తగిన విధంగా జరిగింది. పాక్ బ్యాటర్లు రాణించడంతో ఛేజింగ్ లో ఇండియాకు కాస్త సవాలు విసరగలిగే స్కోరు ఎదురైంది. ఇండియాతో జరుగుతున్న ఆసియాకప్ సూపర్-4 లీగ్ మ్యాచ్ లో పాకిస్థాన్ చాలెంజింగ్ టోటల్ ను సాధించింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాక్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు సాధించింది. ఓపెనర్ షాహిబ్జాదా ఫర్హాన్ (45 బంతుల్లో 58, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) సూపర్బ్ ఫిఫ్టీతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్లలో శివమ్ దూబే కు 2 వికెట్లు దక్కాయి. ఇదే టోర్నీ లీగ్ దశలో పాక్ పై భారత్ సునాయాస విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్ లో పక్కా ప్రణాళికతో పాక్ బ్యాటింగ్ కు వచ్చినట్లు తెలుస్తోంది. ఆరంభంలో తుఫాన్ స్టార్ట్ లభించినప్పటికీ, ఆ తర్వాత అదే జోరును కొనసాగించడంలో పాక్ విఫలమైంది. మరోవైపు ఫీల్డింగ్ లో భారత్ తడబాటు ప్రదర్శించింది. పలు క్యాచ్ లను జారవిడవడం ప్రభావం చూపించింది. అలాగే భారత బౌలింగ్ కూడా సాధారణంగా కనిపించింది.
టార్గెట్ బుమ్రా..
ఈ మ్యాచ్ లో ఇండియన్ ప్రీమియర్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రాను పాక్ బ్యాటర్లు టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. బ్యాటర్లరిద్దరూ జోరు కొనసాగించడంతో పవర్ ప్లే మూడు ఓవర్లలోనే బుమ్రా 34 పరుగులు సమర్పించుకున్నాడు. తన కెరీర్ లో ఒక పవర్ ప్లేలో ఇంత అత్యధిక పరుగులు సమర్పించుకోవడం ఇదే తొలిసారి. ఓవరాల్ గా వికెట్ లేకుండా 45 పరుగులిచ్చాడు. అంతకుమందు ఇన్నింగ్స్ ఫస్ట్ బంతికే ఫర్హాన్ ఇచ్చిన క్యాచ్ ను అభిషేక్ శర్మ జారవిడిచాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఫర్హాన్ ఫిఫ్టీ సాధించాడు. ఇక ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా సయిమ్ అయూబ్ స్థానంలో సీనియర్ ఫఖార్ జమాన్ (15) ను బరిలోకి దించడం ఫలించింది. వీరిద్దరూ తొలి వికెట్ కు 21 పరుగులు జోడించారు. ఆ తర్వాత అయూబ్ (21) తో కలిసి ఫర్హాన్ ఇన్నింగ్స్ ను మరింత ముందుకు తీసుకెళ్లాడు.
జోరుకు కళ్లెం..
అయూబ్, ఫర్హాన్ సత్తా చాటడం, మధ్యలో మరో లైఫ్ ఫర్హాన్ కు లభించడంతో ఈ భాగస్వామ్యం పాక్ కు లాభించింది. వీరిద్దరూ రెండో వికెట్ కు 72 పరుగులు జోడించారు. అయితే ప్రమాదకరంగా మారిన ఈ జంటను శివమ్ దూబే విడదీశాడు. అయూబ్ ఆడిన ఫ్లిక్ షాట్ ను అద్బుతంగా డైవ్ చేసి అభిషేక్ క్యాచ్ పట్టాడు. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే హుస్సేన్ తలత్ (10), ఫర్హాన్ వికెట్లు కోల్పోవడంతో 115/4 తో పాక్ వెనుకడుగు వేసింది. ఈ దశలో మహ్మద్ నవాజ్ (21), కెప్టెన్ సల్మాన్ ఆఘా (17 నాటౌట్) కాస్త దూకుడుగా ఆడటంతో పాక్ సవాలు విసరగలిగే స్కోరును సాధించింది. మధ్యలో ఫీల్డర్ల సమయస్ఫూర్తితో నవాజ్ ఔటవగా, ఫహీమ్ అష్రఫ్ (8 బంతుల్లో 20 నాటౌట్) కామియో ఆడటంతో పాక్ స్కోరు 170+ పరుగులను దాటింది.