PCB chairman instructs Pakistan cricketers to train with army to improve fitness:  పాకిస్థాన్ క్రికెటర్ల ఫిట్‌నెస్ విషయంలో ఆ దేశ క్రికెట్ బోర్డు పీసీబీ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్) 2024 సీజన్ ముగిసిన వెంటనే జాతీయ జట్టు సభ్యులందరికీ పాకిస్థాన్ సైన్యంలో శిక్షణ ఇప్పించాలని నిర్ణయించింది. సైన్యంలో శిక్షణతో ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ మెరుగుపడుతుందని భావిస్తోంది. 

 

గత కొంతకాలం నుంచి పాకిస్తాన్ క్రికెట్లో అనూహ్యమైన  మార్పులు జరుగుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో చెత్త ప్రదర్శన చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.  వన్డే వరల్డ్‌కప్‌లో ఓటమితో పాక్‌ కెప్టెన్సీ పదవికి బాబార్‌ ఆజమ్‌ రాజీనామా చేసినప్పుడు మొదలైన రాజీనామాల పర్వం కొనసాగింది. ముందుగా ప్రపంచకప్‌లో పాక్‌ క్రికెట్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన మికీ ఆర్థర్‌, గ్రాంట్ బ్రాడ్‌బర్న్‌, ఆండ్రూ పుట్టిక్‌  రాజీనామా చేశారు.  తరువాత పాకిస్థాన్ క్రికెట్‌ బోర్డు( Pakistan Cricket board) చైర్మన్ జ‌కా అష్రఫ్‌(Zaka Ashraf) తన పదవికి రాజీనామా చేశారు. ప‌ద‌వి చేప‌ట్టి ఏడాది కాక‌ముందే పీసీబీ మేనేజ్‌మెంట్ క‌మిటీ నుంచి అష్రఫ్ వైదొలిగాడు.

రెండేళ్లలోనే పాక్ బోర్డుకు ముగ్గురు అధ్యక్షులు

గ‌డిచిన రెండేళ్ల కాలంలోనే పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ముగ్గురు అధ్యక్షులు మారారు. ర‌మిజ్ రాజా, న‌జం సేథీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి వైదొలగగా... తాజాగా అష్రఫ్‌ కూడా పదవికి రాజీనామా చేశాడు.  అనంతరం  పాకిస్థాన్‌ జట్టు(Pakistan Cricket team)కు  సయిద్‌ మోహ్సిన్‌ రజా నఖ్వీ(Mohsin Naqvi) పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డుకు కొత్త చైర్మన్‌గా ఎన్నికయ్యాడు.  అయితే ఆటగాళ్లు ఫిట్నెస్ విషయంలో అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్దగా దృష్టి పెట్టడం లేదని.. అందుకే జట్టులో ఉన్న ఆటగాళ్లు ఎవరు కూడా పెద్దగారాణించడం లేదు అంటూ విమర్శలు కూడా వస్తున్నాయి అని చెప్పాలి. ఇలాంటి విమర్శలు వేళ ఇక ఆటగాళ్ల ఫిట్నెస్ను మరింత మెరుగుపరిచే విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్టు  తెలుస్తోంది. 

 

విదేశీ ఆటగాళ్ల తరహాలో పాకిస్థాన్ ఆటగాళ్లు ఫిట్‌గా లేకపోవడం.. తరుచూ గాయాల బారిన పడుతుండటం.. సిక్సర్లు కొట్టలేకపోవడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. విదేశీ ఆటగాళ్లలా ఫిట్‌గా ఉండాలంటే పాకిస్థాన్ క్రికెటర్లకు ఆర్మీ ట్రైనింగ్ అవసరమని పీసీబీ భావిస్తోంది. ఈ విషయాన్ని ఆటగాళ్లకు తెలియజేసినట్లు పీసీబీ చైర్మన్ మోహ్‌సిన్ నక్వీ తెలిపారు. ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు  పాకిస్తాన్ సూపర్ లీగ్ ను నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే ఇక ఈ లీగ్ ముగిసిన తర్వాత జాతీయ జట్టు సభ్యులందరికీ కూడా ఏకంగా సైన్యంలో శిక్షణ ఇప్పించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది .

 పీఎస్‌ఎల్ ముగిసిన వెంటనే న్యూజిలాండ్, ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఉన్నాయి. జూన్‌లో టీ20 ప్రపంచకప్ ఉంది. ఫిట్‌నెస్ క్యాంప్ నిర్వహించేందుకు మాకు సరైన సమయం కూడా లేదు.  దీంతో కాకుల్ మిలటరీ అకాడమీలో మార్చి 25 నుంచి ఏప్రిల్ 8 వరకు ఆర్మీ ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించనున్నామని ,  ఆటగాళ్లకు పాక్ ఆర్మీ అధికారులు సాయం చేయనున్నారని నఖ్వీ చెప్పారు.