Asia Cup 2023: 


పాకిస్థాన్‌ క్రికెట్‌కు మరో ఎదురుదెబ్బ! ఆ దేశం ప్రతిపాదించిన హైబ్రీడ్‌ మోడల్‌కు మిగిలిన ఆసియా జట్లు అంగీకరించడం లేదు. ఆసియాకప్‌ను ఏదో ఒక్క దేశంలోనే నిర్వహించాలని కోరుతున్నాయి. దాంతో పీసీబీ ఈ టోర్నీ నుంచి తప్పుకొనే సూచనలు కనిపిస్తున్నాయి.


ఐసీసీ వన్డే ప్రపంచకప్‌నకు (ICC ODI Worldcup 2023) ముందు ఆసియాకప్‌ (Asia Cup 2023) జరగనుంది. ఈ టోర్నీ ఆతిథ్య హక్కుల్ని పాకిస్థాన్‌ (PCB) దక్కించుకొంది. టీమ్‌ఇండియా తటస్థ వేదికలో ఆడుతుంది తప్ప పాక్‌లో అడుగు పెట్టే ప్రసక్తే లేదని బీసీసీఐ కార్యదర్శి జే షా స్పష్టం చేశారు. ఆసియాకప్‌పై నీలి నీడలు కమ్ముకోవడంలో పీసీబీ ఓ కొత్త ప్రతిపాదన చేసింది. హైబ్రీడ్‌ మోడల్‌ను తెరపైకి తీసుకొచ్చింది. నాలుగు మ్యాచులు పాక్‌లో మిగిలినవి ఇతర దేశాల్లో ఆడించేలా ప్లానింగ్‌ చేసింది. ఇందుకు శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ అంగీకరించడం లేదని తాజాగా తెలిసింది.


హైబ్రీడ్‌ మోడల్‌కు మిగిలిన ఆసియా దేశాలు ఒప్పుకోకపోవడంతో పీసీబీ చీఫ్‌ నజమ్‌ సేథీ దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. టోర్నీ మొత్తాన్నే తటస్థ వేదికకు మార్చాలన్న బీసీసీఐ ఆలోచనకు శ్రీలంక, బంగ్లా, అఫ్గాన్‌ మద్దతు ప్రకటించాయి. 'ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ బోర్డు సభ్యులు ఈ నెలాఖర్లో వర్చువల్‌గా సమావేశం కావడం ఇప్పుడు ఓ లాంఛనంగా మారింది. ఆసియాకప్‌ను హైబ్రీడ్‌ మోడల్‌లో నిర్వహించాలన్న ప్రతిపాదనకు శ్రీలంక, బంగ్లా, అఫ్గాన్‌ మద్దతు లేదని పీసీబీకి తెలిసిపోయింది' అని ఏసీసీ వర్గాలు మీడియాకు తెలిపాయి.


ఒకవేళ ఆసియాకప్‌ ఆతిథ్య హక్కులు మారిపోతే ఏం చేయాలో నజమ్‌ సేథీ పీసీబీ కమిటీతో మాట్లాడుతున్నారు. ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకోవాలో ప్రభుత్వంతో చర్చిస్తారని తెలిసింది. ఆసియాకప్‌ వేరే దేశానికి తరలిస్తే అందులో పాక్‌ ఆడబోదని సేథీ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. అలాగే భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌లో ఆడదని అంటున్నారు.


'పాకిస్థాన్‌కు ఇప్పుడు రెండే దారులు ఉన్నాయి. ఒకటి తటస్థ వేదికలో ఆడటం. రెండోది టోర్నీ నుంచి బయటకు వెళ్లిపోవడం. ఒకవేళ పాక్‌ ఆడకపోయినా టోర్నీని ఆసియాకప్‌ అనే పిలుస్తారు. కాకపోతే బ్రాడ్‌కాస్టర్‌ కొత్త డీల్‌ కుదుర్చుకోవాల్సి ఉంటుంది' అని ఏసీసీ వర్గాలు తెలిపాయి.


Also Read: డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ ఫ్రీ లైవ్‌స్ట్రీమింగ్‌ ఎందులో? టైమింగ్‌, వెన్యూ ఏంటి?


లాజిస్టిక్స్‌, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురవుతాయనే హైబ్రీడ్‌ మోడల్‌ను శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌, భారత్‌ వ్యతిరేకిస్తున్నాయని తెలిసింది. టీమ్‌ఇండియా ఎలాగూ పాక్‌కు వెళ్లదు కాబట్టి టోర్నీని శ్రీలంకకు తరలించడమే బెస్ట్‌ అని భావిస్తున్నారు. అవసరమైతే ఆసియాకప్‌ను ఈ ఏడాది రద్దు చేసి మిగిలిన దేశాలతో 50 ఓవర్ల ఫార్మాట్లో మల్టీ టీమ్‌ ఈవెంట్‌ నిర్వహించే అవకాశం ఉంది.


ఇందుకోసం ప్రపంచకప్‌ ముంగిట ఒక విండో కోసం బీసీసీఐ ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టిందని సమాచారం. ఆసియాకప్‌ అంత కాకపోయినా మంచి ధరకే హక్కుల సొంతం చేసుకొనేందుకే బ్రాడ్‌కాస్టర్‌ మొగ్గు చూపొచ్చు.