Asia Cup 2023: ఆసియా కప్ - 2023 ఆతిథ్య హక్కులు కలిగిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ).. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)లను బోనులో నిలబెట్టేందుకు మరోసారి బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేసింది. ఏసీసీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపిస్తూ.. లంకలో వర్షం వల్ల నష్టపోయిన మ్యాచ్‌ల ఆదాయాన్ని తమకు నష్టపరిహారంగా ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నది. పల్లెకెలె (క్యాండీ)లోని భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ వర్షార్పణం కాగా భారత్ - నేపాల్ మ్యాచ్ వర్షం కారణంగా ఓవర్లు కుదించాల్సి వచ్చింది. తాజాగా పీసీబీ చీఫ్ జకా అష్రఫ్.. తమకు నష్టపరిహారం అందించాలని ఏసీసీ అధ్యక్షుడు జై షాకు లేఖ రాసినట్టు తెలుస్తున్నది.
శ్రీలంకలో వర్షాల కారణంగా మ్యాచ్‌లలో అమ్ముడుపోని టికెట్లకు తమకు నష్టపరిహారం కావాలని పీసీబీ డిమాండ్ చేస్తోంది. దీనిపై పీసీబీ అధికారికంగా ఏ ప్రకటన విడుదల చేయకపోయినప్పటికీ పాకిస్తాన్‌కు చెందిన పలు టీవీ ఛానెళ్లు, వెబ్‌సైట్లు అష్రఫ్.. జై షాకు లేఖ రాసినట్టు కథనాలు వెలువరించాయి.
అంతేగాక సూపర్ - 4 మ్యాచ్‌ల నిర్వహణపై కూడా పీసీబీ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు సమాచారం. పల్లెకెలెలో భారత్ - పాక్ తో పాటు భారత్ - నేపాల్ మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగించిన నేపథ్యంలో రెండో దశ ఆసియా కప్ పోటీలకు ఆతిథ్యమిచ్చే కొలంబోలో కూడా వర్షాలు పడే అవకాశాలు పుష్కలంగా ఉండటంతో వేదికను కొలంబో నుంచి హంబన్‌టోటాకు మార్చినట్టు వార్తలు వెలువడుతున్నాయి.
దీనిపై ఏసీసీ.. ఆసియా కప్ ఆతిథ్య హక్కులు ఉన్న తమకు ఎటువంటి సమాచారం అందించలేదని, శ్రీలంకతో చర్చించి నిర్ణయం ఎలా తీసుకుంటారని అష్రఫ్ లేఖలో ప్రస్తావించినట్టు సమాచారం. అంతేగాక హంబన్‌టోటాకు మ్యాచ్‌లను తరలిస్తామని చెప్పిన ఏసీసీ.. తర్వాత నిర్ణయాన్ని మార్చుకుని కొలంబోలోనే వీటిని నిర్వహించాలని భావిస్తున్నదని ఆ విషయం కూడా తమకు చెప్పలేదని పీసీబీ ఆరోపిస్తున్నది. అంటే పీసీబీ ఆరోపణల ప్రకారం.. సూపర్ - 4 మ్యాచ్‌లు హంబన్‌టోటా లో కాకుండా కొలంబోలోనే జరుగనున్నాయి.
పల్లెకెలె, కొలంబోలలో వాతావరణ పరిస్థితుల కారణంగా మ్యాచ్‌లను హంబన్‌టోటాకు మార్చాలని ఏసీసీ నిర్ణయించినట్టు వార్తలు వచ్చాయి. హంబన్‌టోటాలో ప్రస్తుతానికి వర్షాలు లేకున్నా సెప్టెంబర్‌లో అక్కడ వర్షాలు కురిసే అవకాశాలు 20 శాతం మాత్రమే ఉండటం కాస్త తెరిపినిచ్చేదే. సూపర్ - 4తో పాటు ఫైనల్ కూడా ఇక్కడే నిర్వహించేందుకు ఏసీసీ ప్రణాళికలు సిద్ధం చేసినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అలాంటివేవీ లేవని, సూపర్- 4 తో పాటు ఫైనల్ కూడా కొలంబోలోనే జరగాల్సి ఉంది.
మరి పీసీబీ అధ్యక్షుడు జకా అష్రఫ్ చేసిన ఈ ఆరోపణలు, లేఖాస్త్రంపై ఏసీసీ, జై షా ఏ విధంగా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial