టీ20 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన సూపర్-12 మ్యాచ్‌లో పాకిస్తాన్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 91 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం పాకిస్తాన్ 13.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో సెమీస్ ఆశలను పాకిస్తాన్ సజీవంగా ఉంచుకుంది.


నెదర్లాండ్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే మొదటి నుంచి పాకిస్తాన్ బౌలర్లు నెదర్లాండ్స్‌ను పూర్తిగా కట్టడి చేశారు. నెదర్లాండ్స్ రన్‌రేట్ ఏ దశలోనూ ఆరు కూడా దాటలేదు. ఒక్కరి స్ట్రైక్ రేట్ కూడా 100ను దాటలేదు. పాకిస్తాన్ బౌలర్లలో అత్యధిక ఎకానమీ కూడా 5.5 పరుగులు మాత్రమే. దీంతో నెదర్లాండ్స్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 91 పరుగులు మాత్రమే చేసింది. పాకిస్తాన్ బౌలర్లలో షాదబ్ ఖాన్ అత్యధికంగా మూడు వికెట్లు తీసుకున్నాడు.


పాకిస్తాన్ స్వల్ప లక్ష్యంతోనే బరిలోకి దిగినప్పటికీ ఆశ్చర్యకరంగా నెట్ రన్‌రేట్ మెరుగుపరుచుకోవడానికి వేగంగా ఆడకుండా నెమ్మదిగా ఆడింది. బాబర్ ఆజమ్ (4: 5 బంతుల్లో) పేలవ ఫాం ఈ మ్యాచ్‌లో కూడా కొనసాగింది. ఫాంలో ఉన్న మరో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ (49: 39 బంతుల్లో, ఐదు ఫోర్లు) కూడా వేగంగా ఆడలేకపోయాడు. ఫకార్ జమాన్ (20: 16 బంతుల్లో, మూడు ఫోర్లు), షాన్ మసూద్ (12: 16 బంతుల్లో) కూడా చాలా నెమ్మదిగా ఆడారు. దీంతో 91 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి పాకిస్తాన్‌కు 13.5 ఓవర్లు పట్టింది.