Abrar Ahmed Record:  పాకిస్థాన్ లెగ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్. అరంగేట్ర మ్యాచ్ లోనే అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్ తో రెండో టెస్టుతో ఈ యువ ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. తన మొదటి మ్యాచ్ లోనే ప్రత్యర్థి జట్టుకు తన బౌలింగ్ పవర్ చూపించాడు. తొలి ఇన్నింగ్స్ లో ఏకంగా 7 వికెట్లతో చెలరేగాడు. అంతేకాదు ఇంగ్లండ్ తొలి 7 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అబ్రార్ ప్రదర్శనపై క్రికెట్ అభిమానులు ట్విటర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 


ఎన్నో రికార్డులు


అరంగేట్ర టెస్ట్ మ్యాచులో తొలి సెషన్ లోనే 5 వికెట్లు పడగొట్టిన పాక్ బౌలర్ గా అబ్రార్ అహ్మద్ రికార్డు సృష్టించాడు. అలాగే అరంగేట్ర మ్యాచ్ తొలి రోజే 5 వికెట్లు తీసిన పాకిస్థాన్ రెండో బౌలర్ గా అహ్మద్ నిలిచాడు. ఈ విషయంలో పాక్ పేసర్ వహాబ్ రియాబ్ మొదటి స్థానంలో ఉన్నాడు. మొత్తంగా డెబ్యూ టెస్టులో 5 వికెట్లు పడగొట్టిన 13వ పాక్ బౌలర్ గా అబ్రార్ అహ్మద్ రికార్డులకెక్కాడు. 


అబ్రార్ అహ్మద్ 7 వికెట్లతో చెలరేగటంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 281 పరుగులకు ఆలౌటైంది. అహ్మద్ తో పాటు జహీద్ మహ్మద్ 3 వికెట్లు సాధించాడు. మొత్తం 10 వికెట్లను స్పిన్నర్లే పడగొట్టడం విశేషం. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో డాకెట్‌ (63), ఓలీ పోప్‌(60) పరుగులతో రాణించారు.






మొదటి టెస్టులో ఇంగ్లండ్ విజయం


పాకిస్తాన్‌తో జరిగిన మొదటి టెస్టులో ఇంగ్లండ్ 74 పరుగుల తేడాతో విజయం సాధించింది. 343 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ తన రెండో ఇన్నింగ్స్‌లో 268 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండ్‌కు 74 పరుగుల తేడాతో విజయం దక్కింది.


మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ కేవలం 101 ఓవర్లలోనే 657 పరుగులు చేయడం విశేషం. ఏకంగా నలుగురు బ్యాటర్లు సెంచరీలు చేశారు. ఓపెనర్లు జాక్ క్రాలే (122: 111 బంతుల్లో, 21 ఫోర్లు), బెన్ డకెట్ (107: 110 బంతుల్లో, 15 ఫోర్లు), ఓలీ పోప్ (108: 104 బంతుల్లో, 14 ఫోర్లు), హ్యరీ బ్రూక్‌లు (153: 116 బంతుల్లో, 19 ఫోర్లు, ఐదు సిక్సర్లు) సెంచరీలు సాధించాడు.


ఆ తర్వాత పాకిస్తాన్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 579 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు షఫీక్ (114: 203 బంతుల్లో, 13 ఫోర్లు, మూడు సిక్సర్లు), ఇమామ్ ఉల్ హక్‌లతో (121: 207 బంతుల్లో, 15 ఫోర్లు, రెండు సిక్సర్లు) పాటు కెప్టెన్ బాబర్ ఆజం (136: 168 బంతుల్లో, 19 ఫోర్లు, ఒక సిక్సర్) కూడా సెంచరీలు సాధించారు. రెండో ఇన్నింగ్స్‌లో ఏడుకు పైగా రన్‌రేట్‌తో బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 35.5 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. తమ రెండో ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ 268 పరుగులకు ఆలౌట్ అయి 74 పరుగులతో ఓటమి పాలైంది.