వన్‌ వరల్డ్‌ వన్‌ ఫ్యామిలీ క‌ప్‌(One World One Family Cup)లో భాగంగా జ‌రిగిన ఫ్రెండ్లీ మ్యాచులో సచిన్‌ టెండూల్కర్‌(Sachin Tendulkar) తో పాటు భారత్‌, ఇతర దేశాలకు చెందిన క్రికెట్‌ దిగ్గజాలు మరోసారి బరిలోకి దిగారు. మధుసూదన్ సాయి గ్లోబల్ హ్యుమానిటేరియన్ మిషన్‌ (Sri Madhusudan Sai Global Humanitarian Mission) ఆధ్వర్యంలో జరిగిన వన్‌ వరల్డ్‌.. వన్‌ ఫ్యామిలీ' కప్‌లో వీరంతా రెండు టీమ్‌లుగా విడిపోయి ఫ్రెండ్లీ మ్యాచ్‌(Frendly Match) ఆడారు. ఈ మ్యాచ్‌ ద్వారా సమీకరించిన డబ్బును మధుసూదన్ సాయి గ్లోబల్ మిషన్‌ నిరుపేదలకు అందచేయనుంది. ఐక్యత శక్తిని, మానవత్వం బలాన్ని, సామాజిక బాధ్యత భావాన్ని వెదజల్లడానికి ఈ ఫ్రెండ్లీ క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. 

 

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే

ఈ మ్యాచ్‌లో యువీ టీమ్ అయిన వ‌న్ ఫ్యామిలీ నిర్ణీత 20 ఓవర్లలో 6 కోల్పోయి 180 పరుగులు చేసింది. డారెన్‌ మ్యాడీ (51) హాఫ్ సెంచ‌రీ చేయ‌గా కలువితరణ 22, యూసఫ్‌ పఠాన్‌ 38, యువరాజ్‌ సింగ్‌ 23 పరుగులు చేశారు. వన్‌ వరల్డ్‌ బౌలర్లలో హర్భజన్‌ సింగ్‌ 2 వికెట్లు తీశాడు. సచిన్‌, ఆర్పీ సింగ్‌, అశోక్‌ దిండా, మాంటీ పనేసర్ త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వన్‌ వరల్డ్‌ 19.5 ఓవ‌ర్లలో ఆరు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. అల్విరో పీట‌ర్సన్ (74), సచిన్‌ టెండూల్కర్‌ (27), నమన్‌ ఓఝా (25), ఉపుల్‌ తరంగ (29) రాణించారు. వ‌న్ ఫ్యామిలీ బౌల‌ర్లలో చ‌మింద వాస్ మూడు వికెట్లు తీశాడు. ముత్తయ్య మురళీథరన్‌, యువరాజ్‌ సింగ్‌, జేసన్‌ క్రేజా త‌లా ఓ వికెట్ సాధించారు. 

 

ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌..

ఆఖ‌రి ఓవ‌ర్‌లో స‌చిన్ టీమ్ గెల‌వాలంటే ఏడు ప‌రుగులు కావాలి. చివ‌రి ఓవ‌ర్ యూస‌ప్ ప‌ఠాన్ వేశాడు. మొద‌టి నాలుగు బంతుల‌ను క‌ట్టుదిట్టంగా వేయ‌డంతో కేవ‌లం నాలుగు ప‌రుగులు మాత్రమే వ‌చ్చాయి. దీంతో విజ‌య స‌మీక‌ర‌ణం రెండు బంతుల్లో మూడు ప‌రుగులుగా మారింది. అయితే.. ఐదో బంతికి ఇర్ఫాన్ పఠాన్‌ సిక్స్ బాది జ‌ట్టును గెలిపించాడు. సిక్స్ బాదిన వెంట‌నే అన్న యూస‌ఫ్ ను ఇర్ఫాన్ వ‌చ్చి గ‌ట్టిగా హ‌త్తుకున్నాడు. అనంతరం అన్నను కౌగించుకుని త‌న‌ను క్షమించాల‌ని వేడుకున్నాడు.  ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. 

 

సచిన్ డీప్‌ ఫేక్‌ వీడియోపై కేసు

క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ డీప్ ఫేక్ వీడియోపై ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. సచిన్ వ్యక్తిగత సిబ్బంది ఫిర్యాదు మేరకు  ముంబయి వెస్ట్ రీజియన్ సైబర్ పోలీస్ స్టేషన్ లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గేమింగ్ సైట్ , ఫేస్ బుక్పేజీపై కేసు పెట్టారు. "స్కైవార్డ్ ఏవియేటర్ క్వెస్ట్" అనే గేమింగ్ యాప్ కోసం సచిన్ ప్రచారం చేసినట్లు వీడియో రూపొందించి గేమింగ్ సైట్ తోపాటు ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు. సచిన్, ఆయన కుమార్తె సారా గేమ్ ఆడి భారీగా ఆర్జించినట్లు కల్పిత వీడియోను సృష్టించారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని సచిన్ స్వయంగా ఇటీవల వివరణ ఇచ్చారు. సాంకేతికతను దుర్వినియోగం చేయడం...బాధకలిగిస్తోందని చెప్పారు. ఆ గేమింగ్ యాప్ యజమాని వివరాలను పోలీసులు వెల్లడించలేదు.