PCB, ICC Trolls: ఆసీస్, ప్రొటీస్ కారాలు మిరియాలు.. దుబాయ్, లాహోర్ లకు హడావిడిగా ప్రయాణం చేస్తున్న ఇరుజట్లు.. అసలు కారణం ఏంటంటే..?
ఐసీసీ టోర్నీని నిర్వహించి 29 ఏళ్లు గడవడంతో అనుభవలేమీ పీసీబీ విషయంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే గ్రౌండ్ల నిర్వహణ అద్వానంగా ఉండటంతో వర్షం కారణంగా రెండు మ్యాచ్ లు రద్దయ్యాయి.

Hiccups In ICC Chapmpions Trophy 2025: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తొలి సెమీ ఫైనల్ దుబాయ్ వేదికగా మంగళవారం జరుగుతుంది. ఇప్పటికే ఈ సెమీఫైనల్ కు భారత్ అర్హత సాధించింది. అయితే భారత్ తో తొలి సెమీస్ లో తలపడే జట్టు ఇంకా ఖరారు కాలేదు. ఆదివారం జరిగే కివీస్, భారత్ మ్యాచ్ తర్వాత మాత్రమే ఏయే సెమీస్ లో ఎవరూ తలపడనున్నారో స్పష్టత రానుంది. అయితే టోర్నీ నిర్వాహకుల తెలివి తక్కువ తనం వల్ల ఇప్పుడు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు ఇబ్బంది పడుతున్నాయి. ఆదివారం రాత్రి మాత్రమే గ్రూప్-ఏలో తొలి రెండు స్థానాలపై స్పష్టత వస్తుంది. అప్పుడు మాత్రమే భారత్ తో తొలి సెమీస్ లో ఎవరు పాల్గొంటారో ఐడియా వస్తుంది. అయితే తొలి సెమీస్ కు ఆఖరి లీగ్ మ్యాచ్ కు మధ్య కేవలం ఒక్కరోజు గడువు మాత్రమే ఉంది. దీంతో ఆఖరు నిమిషంలో గందరగోళం నుంచి తప్పించుకునేందుకు ఆసీస్, సౌతాఫ్రికా జట్లు దుబాయ్ ప్రయాణం అవుతున్నాయి. ఆదివారం స్పష్టత రాగానే, రెండో జట్టు లాహోర్ కి వెంటనే బయలు దేరనుంది. ఆసీస్ ఇప్పటికే దుబాయ్ కి వెళ్లిపోగా, ఇంగ్లాండ్ తో మ్యాచ్ ముగిశాక సౌతాఫ్రికా శనివారం రాత్రి.. హడావిడిగా దుబాయ్ బయలు దేరుతుంది.
ఎవరితో ఎవరు..?
ఇంగ్లాండ్ పై సౌతాఫ్రికా గెలవడంతో గ్రూప్ బిలో సౌతాఫ్రికా, ఆసీస్ తొలి రెండు స్థానాల్లో నిలిచి సెమీస్ కు అర్హత సాధించాయి. అయితే సెమీస్ లో పాల్గొనే జట్ల డ్రా ప్రకారం.. గ్రూప్-బి టాపర్ అయిన సౌతాఫ్రికా, గ్రూప్-ఏ రెండో స్థానంలోని జట్టుతో తలపడుతుంది. అలాగే గ్రూప్-ఏ టాపర్.. గ్రూప్-బి రెండోప్లేస్ లో ఉన్న ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఇక్కడే ఆసీస్, ప్రొటీస్ లకు చిక్కు వచ్చింది. ఆదివారం జరిగే మ్యాచ్ లో మూడు రకాల ఫలితాలు వచ్చే అవకాశముంది. దీంతో గ్రూప్-ఏ విన్నర్ గా ఎవరు తేలుతారు అనే దానిపై రెండు ప్రాబబిలీటీలు వచ్చే అవకాశముంది. ఇప్పటికే గ్రూప్-ఏలో అగ్రస్థానంలో ఉన్న కివీస్.. భారత్ తో మ్యాచ్ గెలిచినా, రద్దు అయినా టాపర్ గానే నిలుస్తుంది. దీంతో గ్రూప్-బి రెండోస్థానంలో ఉన్న ఆసీస్ తో తలపడుంది. ఎందుకంటే నెట్ రన్ రేట్ ప్రకారం కివీస్ ముందంజలో ఉండటమే కారణం.. ఒకవేళ భారత్ గెలిస్తే, గ్రూప్ టాపర్ అవుతుంది కాబట్టి, గ్రూప్ -బిలో రెండో స్థానంలో ఉన్న ఆసీస్ తో ఆడుతుంది. అప్పుడు కివీస్.. గ్రూప్-బి టాపర్ సౌతాఫ్రికాతో ఆడుతుంది. ఈ మ్యాచ్ లాహోర్ లో జరుగుతుంది.
షెడ్యూల్ విషయంలో గందరగోళం..
ఐసీసీ టోర్నీని నిర్వహించి 29 ఏళ్లు గడవడంతో అనుభవలేమీ పాక్ క్రికెట్ బోర్డు విషయంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే గ్రౌండ్ల నిర్వహణ అద్వానంగా ఉండటంతో వర్షం కారణంగా రెండు మ్యాచ్ లు రద్దయ్యాయి. డ్రైనేజీ సిస్టం కరెక్టుగా లేకపోవడం, మైదానల్లో సరైన కవర్లు వాడకపోవడంతో పీసీబీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఇప్పుడు షెడ్యూల్ విషయంలోనూ అక్షింతలు పడుతున్నాయి. నిజానికి భారత్ ఆడే సెమీ ఫైనల్ కు చివరగా నిర్వహిస్తే బాగుండేదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అప్పుడు లాహోర్లో జరిగే తొలి సెమీస్ నిర్వహించడం ద్వారా అనవసరంగా ప్రయాణ హంగామా ఆసీస్, ప్రొటీస్ జట్లకు ఉండేది కాదని తెలుస్తోంది. ఇక ఆదివారం మ్యాచ్ స్పష్టతను బట్టి, ఆసీస్, ప్రొటీస్ లలోని ఒక జట్టు దుబాయ్ లో ఉండి, మరో జట్టు రెండో సెమీ ఫైనల్ కు లాహోర్ రానుందని తెలుస్తోంది. ఇక రెండు సెమీస్ లను వరుసగా మంగళ, బుధ వారాల్లో నిర్వహిస్తున్న ఐసీసీ.. ఫైనల్ ని మాత్రం ఆదివారం (మార్చి 9న) జరుపుతోంది. దీంతో రెండో సెమీస్ కు ఫైనల్ కు మధ్య మూడు రోజుల గ్యాప్ ఉండటం విశేషం.