ICC Champions Trophy 2025 Live Updates: ఇప్ప‌టికే భార‌త్ సెమీ ఫైన‌ల్ కు చేరిన వేళ‌.. వ‌న్డే, టెస్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ గాయంపై స్ప‌ష్ట‌మైన అప్డేట్ వ‌చ్చింది. త‌ను గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడ‌ని, అత‌ని గురించి కంగారు ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని టీమ్ మేనేజ్మెంట్ పేర్కొంది. ఆల్రెడీ ప్రాక్టీస్ మొదలు పెట్టిన హిట్ మ్యాన్, నెట్ లో శ్రమిస్తున్నాడ‌ని స‌హాయ‌క కోచ్ ర్యాన్ టెన్ డ‌స్క‌టే తెలిపాడు. త‌నకి గాయం నుంచి ఎలా కోలుకోవాలో తెలుస‌ని, అందుకు త‌గిన విధంగా ఏర్పాట్లు చేసుకున్నాడ‌ని వివ‌రించాడు. ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీలో వ‌రుస విజయాల‌తో భార‌త్ తో పాటు న్యూజిలాండ్ గ్రూప్-ఏ నుంచి సెమీస్ కి చేరిన సంగ‌తి తెలిసిందే. ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య ఆదివారం కీల‌క‌మైన గ్రూప్ మ్యాచ్ జ‌రుగుతుంది. కివీస్ తో జ‌రిగే మ్యాచ్ లో రోహిత్ ఆడ‌నుండ‌టం ఖాయంగా క‌నిపిస్తోంది. ఈ మ్యాచ్ లో విజేత‌గా నిలిచిన జ‌ట్టు గ్రూప్ టాప‌ర్ గా నిలుస్తుంది. దీంతోనే సెమీస్ లో ఎవ‌రితో ఎవ‌రు పోటీప‌డాల‌నే విష‌యం స్ప‌ష్ట‌త వ‌స్తుంది. ఇక గ్రూపు బి నుంచి ఆస్ట్రేలియా సెమీస్ కు చేర‌గా, సౌతాఫ్రికా అదే దారిలో ఉంది. ఇంగ్లాండ్ తో మ్యాచ్ ఫ‌లితం త‌ర్వాత దీనిపై స్ప‌ష్ట‌త వ‌స్తుంది. 

రాహుల్, పంత్.. ఇద్ద‌రిలో ఎవ‌రంటే..?టీమ్ మేనేజ్మెంట్ జ‌ట్టుకు కూర్పుకు సంబంధించి స్వీట్ పెయిన్ ను ఎదుర్కొంటోంద‌ని డ‌స్క‌టే తెలిపాడు. ముఖ్యంగా ఇద్ద‌రు వికెట్ కీప‌ర్లు కేఎల్ రాహుల్, రిష‌బ్ పంత్ ఉన్న క్ర‌మంలో వీరి నుంచి ఒక్క‌రిని ఎంచుకోవ‌డం క‌ష్ట‌మేన‌ని తెలిపాడు. తాజాగా వ‌న్డేల్లో రాహుల్ పైనే టీమ్ మేనేజ్మెంట్ న‌మ్మ‌కం పెడుతోంది. గ‌త ఇంగ్లాడ్ సిరీస్ నుంచి ప్ర‌స్తుతం మెగాటోర్నీ వ‌ర‌కు రాహులే ఫ‌స్ట్ చాయిస్ వికెట్ కీప‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. దీంతో వ‌న్డేల్లో పంత్ బెంచ్ కే ప‌రిమితం అవుతున్నాడు. దీనిపై వాదోపవాదాలు న‌డుస్తున్నా, త‌న ఆట‌తీరుతో రాహుల్ విమ‌ర్శ‌ల‌కు స‌మాధానం చెబుతున్నాడు. ఇంగ్లాండ్ తో మూడో వ‌న్డే, బంగ్లాదేశ్ తో తొలి లీగ్ మ్యాచ్ లో కీల‌క‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. 

మేనేజ్మెంట్ నిర్ణ‌యం.. త‌న‌కు దొరికిన అవకాశాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని భావిస్తాన‌ని, తుది జ‌ట్టు ఎంపిక టీమిండియా మేనేజ్మెంట్ చేతిలోనే ఉంద‌ని రాహుల్ తెలిపాడు. పంత్ గురించి అంద‌రికీ తెలుస‌ని, ఇప్పుడు త‌న ఆట‌తీరు ఎంత విధ్వంస‌క‌రంగా ఉంటుందో విదితమేన‌ని పేర్కొన్నాడు. టోర్నీ, ప‌రిస్థితుల కార‌ణంగా తుది జ‌ట్టును టీమ్ యాజ‌మాన్యం నిర్ణ‌యిస్తుంద‌ని పేర్కొన్నాడు. ఇక 2002, 2013లో ఐసీసీ చాంపియ‌న్స్ టోర్నిని నెగ్గిన భార‌త్ ముచ్చ‌ట‌గా మూడోసారి గెల‌వాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉంది. ఆదివారం మ్యాచ్ ముగిశాక మంగ‌ళ‌వారం నుంచి నాకౌట్ మ్యాచ్ లు ప్రారంభ‌మ‌వుతాయి. భార‌త్ ఆడే తొలి సెమీ ఫైన‌ల్ దుబాయ్ లో జ‌రుగుతుంది. ఈ మ్యాచ్ లో భార‌త ప్ర‌త్య‌ర్థి ఎవ‌ర‌నేదానిపై స్ప‌ష్ట‌త చివ‌రి లీగ్ ముగిశాక  వ‌స్తుంది. 

Read Also: Aus Vs Afg Troll: ఆసీస్ ప్లేయ‌ర్ ఇంగ్లీస్ ను ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్లు.. క్రీడా స్ఫూర్తి మ‌రిచాడ‌ని చుర‌క‌లు.. స్మిత్ స‌మయ‌స్ఫూర్తికి ప్ర‌శ‌సంలు