Usain Bolt:  జమైకా స్ప్రింటింగ్ లెజెండ్, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వ్యక్తిగా పేరున్న ఉసేన్ బోల్ట్ కు పెద్ద షాక్ తగిలింది. అతను ఆర్ధిక మోసానికి గురయ్యాడు. ఓ ప్రైవేటు పెట్టుబడి సంస్థలో ఉన్న తన   ఖాతాలో నుంచి సుమారు 12 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ. 103 కోట్లు) కోట్లు మాయమయ్యాయి. 


జమైకన్ పెట్టుబడి సంస్థ స్టాక్స్ అండ్ సెక్యూరిటీసి లిమిటెడ్ లో బోల్డ్ ఖాతా నుంచి 12 మిలియన్ డాలర్లు మాయమయ్యాయని బోల్ట్ ప్రతినిథులు తెలిపారు. అతని ఖాతాలో ఇంకా కేవలం 12వేల డాలర్లు మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పారు. ఆ కంపెనీ బోల్ట్ నిధులను తిరిగివ్వకపోతే కోర్టుకు వెళతామని బోల్ట్ ప్రతినిథులు తెలిపారు. 


తన జీవితకాల పొదుపు ఆ డబ్బు


'ఇది ఎవరికైనా బాధ కలిగించే విషయమే. ఈ మొత్తం బోల్ట్ పదవీ విరమణ ఇంకా జీవితకాల పొదుపులో భాగం. తన ప్రైవేట్ పెన్షన్ లో భాగంగా బోల్డ్ ఈ ఖాతాను మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆ కంపెనీ 10 రోజుల్లోగా బోల్ట్ డబ్బును తిరిగివ్వకపోతే మేం కోర్టుకు వెళతాం' అని ఉసేన్ బోల్ట్ న్యాయవాది లింటన్ పీ గోర్డాన్ తెలిపారు. 


ఈ మోసాన్ని ఈ నెల ఆరంభంలోనే గుర్తించినట్లు స్టాక్స్‌ అండ్‌ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌ తెలిపింది. ఓ మాజీ ఉద్యోగి మోసపూరిత కార్యకలాపాల కారణంగా తమ క్లయింట్స్‌ ఖాతాల్లో నుంచి మిలియన్‌ డాలర్ల డబ్బు మాయమైనట్లు జనవరి 12న కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఉసేన్‌ బోల్ట్‌ సహా దాదాపు 30 మంది ఖాతాదారులు డబ్బులు కోల్పోయినట్లు పేర్కొంది. తమ ఖాతాదారుల ఆస్తులను మరింత భద్రంగా చూసుకొనేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొంది.


ఉసేన్ బోల్ట్ తన కెరీర్ లో 8 ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ ను సాధించాడు. అంతేకాదు పరుగులో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. 2017లో తన అంతర్జాతీయ కెరీర్ కు బోల్ట్ రిటైర్ మెంట్ ప్రకటించాడు.