కోట్ల మంది హృదయాలు ముక్కలయ్యాయి. కోటీ మంది ఆశలు గల్లంతయ్యాయి. క్రికెటర్ల మనసులు ముక్కలయ్యాయి. ఫైనల్ వరకు అప్రతిహాత విజయాలతో దూసుకొచ్చిన టీమిండియాకు ఫైనల్లో ఆస్ట్రేలియా దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఆశలను.. ఆనందాలను.. అంచనాలను తలకిందులు చేస్తూ రోహిత్ సేనను ఫైనల్లో మట్టికరిపించి ఆరోసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌లో టీమిండియాను తక్కువ పరుగులకే అవుట్ చేసిన ఆస్ట్రేలియా ఆ తర్వాత సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించి ఆరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. టీంఇండియా నిర్ణీత 50 ఓవర్ లలో 240 పరుగులు చేయగా ఆస్ట్రేలియా మరో 42 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ బౌలింగ్‌కు అనుకూలిస్తుందన్న అంచనాలు నిజం చేస్తూ కంగారు బౌలర్లు కట్టడి చేశారు. రోహిత్ శర్మ ధాటిగా ఆడినా శుభ్‌మన్ గిల్ ఆదిలోనే అవుట్ కావడంతో టీమిండియాకు షాక్ తగిలింది. 4.2 ఓవర్ వద్ద స్కోరు 30 పరుగులు ఉన్నప్పుడు 7 బంతుల్లో నాలుగు పరుగులు చేసిన గిల్ అవుటయ్యాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ మరోసారి ధాటిగా ఆడాడు. 31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో రోహిత్ విధ్వంసం సృష్టించడంతో టీమిండియా స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. కానీ మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో హెడ్ పట్టిన అద్భుత క్యాచ్‌కు రోహిత్‌శర్మ వెనుదిరిగడంతో భారత్ కష్టాలు మొదలయ్యాయి. కేవలం 31 బంతుల్లో 47 పరుగులు చేసి రోహిత్ వెనుదిరిగాడు. శ్రేయస్స్ అయ్యర్ ఇలా వచ్చి అలా అవుటైపోవడంతో భారత్ స్వల్ప వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. 81 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది.
పిచ్ నెమ్మదించడంతో బ్యాట్‌పైకి బంతి అస్సలు రాకపోవడంతో విరాట్ కోహ్లీ, రాహుల్ ఆచితూచి ఆడారు. 81 పరుగుల 148 పరుగుల వరకు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. విరాట్, రాహుల్ నెమ్మదించడంతో పరుగులు రావడమే గగనమైపోయింది. ఈక్రమంలో విరాట్ కోహ్లీ వరుసగా అయిదో అర్ద సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ క్రమంగా పరుగుల వేగం పెంచుతారనుకున్న దశలో కోహ్లీ అవుటయ్యాడు. 63 బంతుల్లో 4 ఫోర్లతో విరాట్ 54 పరుగులు చేసి కోహ్లీ అవుటయ్యాడు. విరాట్ అవుటైనా రాహుల్ పోరాడాడు. రవీంద్ర జడేజాతో కలిసి రాహుల్ స్కోరు బోర్డును కదిలించాడు.
ఈ క్రమంలో 22 బంతుల్లో 9 బంతులు చేసిన రవీంద్ర జడేజా హాజిల్‌వుడ‌్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. రాహుల్ మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. రాహుల్ చివరి వరకు ఆడితే భారీ స్కోరు వస్తుందని ఆశించినా ఆ ఆశ ఫలించలేదు. 107 బంతుల్లో కేవలం ఒకే ఫోర్‌తో 66 బంతులు ఆడిన రాహుల్ కీపర్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న సూర్యకుమార్ యాదవ్ కూడా 28 బంతుల్లో 18 పరుగులు చేసి అవుటై టీమిండియా ఆశలపై నీళ్లు పోశాడు. కనీసం 250 పరుగులైనా చేస్తుందనుకున్న భారత్... ఆస్ట్రేలియా బౌలర్లు సమర్థంగా బౌలింగ్ చేయడంతో 240 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ 3... హాజిల్‌వుడ్ 2, కమిన్స్ 2 వికెట్లు తీశారు.
అనంతరం టీమిండియా బౌలర్లు మ్యాచ్‌ను బలంగానే ప్రారంభించారు. ఆరంభంలోనే వార్నర్ వికెట్ తీసి షమీ శుభారంభం ఇచ్చాడు. ఆ తర్వాత మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్ కూడా వెంటనే అవుటవ్వడంతో ఆసిస్ 47 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు పట్టు బిగించేలానే కనపడ్డారు. కానీ ట్రానిస్ హెడ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 120 బంతుల్లో 137 పరుగులు చేసి కంగారులకు మరచిపోలేని విజయం అందించాడు. లబుషేన్.. ట్రానిస్ హెడ్‌కు మంచి సహకారం అందించాడు. లబుషేన్ 110 బంతుల్లో 58 పరుగులు చేశాడు. వీరిద్దరి భాగస్వామ్యంతో ఆస్ట్రేలియా సునాయసంగా విజయం సాధించింది. ఫైనల్లో ఎలా ఆడాలో బాగా తెలిసిన ఆసిస్ బ్యాటర్లు నాలుగు వికెట్‌లు కోల్పోయి మరో 42 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.