ODI World Cup 2023: మరో 26 రోజులలో స్వదేశంలో మొదలుకాబోయే వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు గాను బీసీసీఐ ఇటీవలే 15 మందితో కూడిన సభ్యులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. దాదాపు ముందుగా ఊహించిన ఆటగాళ్లే జట్టులో ఉన్నప్పటికీ టీమిండియా స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అతడిని కాదని స్పిన్ బాధ్యతలతో పాటు బ్యాటింగ్ కూడా చేయగలడనే ఉద్దేశంతో సెలక్టర్లు అక్షర్ పటేల్ వైపునకు మొగ్గుచూపారు. బ్యాటింగ్‌లో డెప్త్ (లోతు) కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. కానీ టీమిండియాకు రాబోయే వరల్డ్ కప్‌లో ఈ నిర్ణయం ఏ మేరకు లబ్ది చేకూర్చుతుంది..?
అక్షర్ అంతంతమాత్రమే..
వన్డేలలో 2014లో ఎంట్రీ ఇచ్చిన అక్షర్ పటేల్ ఇప్పటివరకూ భారత జట్టు తరఫున మూడు ఫార్మాట్లలోనూ ఆడుతున్నా తనదైన ముద్ర వేయలేకపోయాడు. 9 ఏండ్ల తన వన్డే కెరీర్‌లో 52 మ్యాచ్‌లు ఆడిన అక్షర్.. బ్యాటింగ్‌లో చేసింది 413 పరుగులు మాత్రమే. సగటు 18.77 గా ఉంది. 2022 వరకూ అడపాదడపా వన్డేలలో ఆడినా గతేడాది నుంచి దాదాపు వన్డే జట్టులో రెగ్యులర్ ప్లేయర్ అయిన అక్షర్.. గత పది వన్డేలలో చేసిన పరుగులు 1, 2, 29, 21, 20, 56, 1, 6, 64, 21 (మొత్తంగా 221). తీసిన వికెట్లు 12. అక్షర్ పటేల్ బౌలింగ్ సగటు 32కు చేరువగా ఉంది.
చాహల్ మచ్ బెటర్..
2016లో వన్డేలలో ఎంట్రీ ఇచ్చిన చాహల్ మణికట్టు స్పిన్నర్‌గా తనకు ఇచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. కెప్టెన్ బంతిని ఇచ్చిన ప్రతీసారి వికెట్లను తీశాడు. తన కెరీర్‌లో ఇప్పటివరకూ 72 వన్డేలు ఆడిన చాహల్.. 121 వికెట్లు తీశాడు. చాహల్ బౌలింగ్ సగటు 27గా ఉంది. చాహల్ ఆడిన గత పది వన్డేలలో 17 వికెట్లు పడగొట్టాడు. స్వదేశంలో స్పిన్‌కు సహకరించే పిచ్‌లపై మరింత ప్రభావం చూపే చాహల్‌ను సెలక్టర్లు పక్కనబెట్టారు. పూర్తిస్థాయి స్పిన్నర్ అయిన చాహల్ బ్యాటింగ్ చేయలేడు. ఇంతవరకూ వన్డేలలో 14 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసిన చాహల్.. 77 రన్స్ చేశాడు.
బ్యాటింగ్ డెప్త్ ఎక్కడ..?
గణాంకాలపరంగా అంతంతమాత్రంగానే ఉన్న అక్షర్‌ను ఇతర జట్లలో సెలక్టర్లు అయితే ఎంపిక చేసేవారే కాదన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవల కాలంలో అక్షర్ ఫామ్ దారుణంగా ఉంది. వరుసగా విఫలమవుతున్నా అవకాశాలు దక్కించుకున్న అక్షర్‌ను బ్యాటింగ్‌లో లోతు కోసం ఎంపిక చేసినా గత 10 ఇన్నింగ్స్‌లలో అతడి గణాంకాలు కూడా అంత గొప్పగా ఏంలేవు. బౌలింగ్‌లో చూస్తే అక్షర్.. చాహల్ కంటే గొప్ప టర్నర్ కూడా కాదు. మరి ఇలాంటి ఆటగాడి కోసం తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థులను బెంబేలెత్తించే చాహల్‌ను పక్కనబెట్టడం వెనుక మర్మమేంటో సెలక్టర్లకే తెలియాలి.
గడిచిన నాలుగేండ్లలో..
అదీగాక 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత భారత్ ఆడించిన నలుగురు ప్రధాన స్పిన్నర్లలో చాహల్‌కే మెరుగైన రికార్డు ఉంది. గడిచిన నాలుగేండ్లలో చాహల్ 21 ఇన్నింగ్స్‌లలో బౌలింగ్ చేసి 28 సగటుతో 37 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం వన్డే వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకున్న కుల్దీప్ యాదవ్.. 34 మ్యాచ్‌లు ఆడి 32 సగటుతో 48 వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజా 23 వన్డేలలో ఏకంగా 45 సగటుతో 21 వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్ 13 వన్డేలలో 13 వికెట్లు తీశాడు. వచ్చిన అవకాశాలు తక్కువే అయినా చాహల్.. మిగిలిన ముగ్గురు స్పిన్నర్ల కంటే మెరుగ్గానే రాణించాడు.
జట్టులో టెయిలెండర్లు బ్యాటింగ్ చేయడం ముఖ్యమే గానీ దాని కారణంగా ప్రధాన బౌలర్లను కూడా కాదని పార్ట్ టైమ్ స్పిన్నర్లను జట్టులోకి తీసుకోవడం ఎంతవరకు సమంజసం..? అయినా ప్రతీ మ్యాచ్‌లో అక్షర్ పటేల్‌ను ఆడిస్తారా..? రోహిత్, కోహ్లీ, గిల్, శ్రేయాస్, రాహుల్, రవీంద్ర జడేజా, హార్ధిక్ పాండ్యా దాకా బ్యాటర్లే ఉన్నా ఇంకెంతమంది బ్యాటింగ్ చేస్తారు..? అయినా జట్టులో జడేజా రూపంలో ఓ స్పిన్ ఆల్ రౌండర్ ఉండగా మళ్లీ అక్షర్ ఎందుకు..? ఇవన్నీ ఇప్పటికైతే సమాధానం తేలని ప్రశ్నలే..!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial