Asia Cup 2023, IND vs PAK: ఆది నుంచి వివాదాలకు కేంద్ర బింధువుగా మారుతున్న ఆసియా కప్ నిర్వహణ తాజాగా మరోసారి అదే బాటలో పయనిస్తోంది. భారత్ - పాకిస్తాన్ మధ్య సూపర్ - 4లో భాగంగా ఆదివారం (సెప్టెంబర్ 10న)  జరుగబోయే మ్యాచ్‌కు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)  రిజర్వ్ డే కేటాయించడం తాజా వివాదానికి కారణమైంది.   సూపర్ - 4 లో మిగిలిన జట్లైన బంగ్లాదేశ్, శ్రీలంకలకు  లేని రిజర్వ్ డే ఒక్క  భారత్ - పాక్ మ్యాచ్‌కే ఎందుకన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  దీనిపై బంగ్లాదేశ్, శ్రీలంక కోచ్‌లు ఇదివరకే  స్పందించగా తాజాగా భారత మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ కూడా  జై షా అధ్యక్షుడిగా ఉన్న  ఏసీసీపై విమర్శల వర్షం కురిపించాడు. 


రెండో రోజూ వర్షం పడాలి.. 


బ్రాడ్‌కాస్టర్లకు మేలు చేయడానికే భారత్ - పాక్ మ్యాచ్‌కు  రిజర్వ్ డే కేటాయించారని మిగిలిన మ్యాచ్‌లు ఏమైపోయినా  ఏసీసీకి అవసరం లేదని ఎక్స్ (ట్విటర్‌)లో పలువురు  బంగ్లా, లంకకు చెందిన మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్న వేళ  ప్రసాద్ ఎక్స్  వేదికగా స్పందించాడు. ఓ ట్వీట్‌కు రిప్లై ఇస్తూ.. ‘అదేగనక నిజమైతే  దానికంటే సిగ్గుమాలిన పని ఇంకోటి ఉండదు.  నిర్వాహకులు (ఏసీసీ) ఈ టోర్నీని అపహస్యం చేసినట్టే లెక్క.  టోర్నీ నిబంధనలను, విలువలను తుంగలో తొక్కి   కేవలం రెండు జట్ల కోసం ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు. ఒకవేళ అన్ని జట్లకు సమన్యాయం చేకూర్చాలంటే వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోతే  దానికి తొలిరోజే రద్దు చేయాలి.  సరే, మీరు కోరుకున్నట్టే రెండో రోజైన రిజర్వ్ డేలో కూడా వర్షం పడితే ఏం చేస్తారు..’అని ప్రశ్నించారు. అంతేగాక దురుద్దేశపూరితమైన ఈ ప్రణాళికలు విజయవంతం కాకూడదని, రెండో రోజు కూడా వాన పడాలని వెంకటేశ్ ప్రసాద్  ఆకాంక్షించాడు. 


 






లంక బోర్డుకూ  చురకలు.. 


భారత్ - పాక్ మ్యాచ్ రిజర్వ్ డే పై ఏసీసీ ఏకపక్ష నిర్ణయం తీసుకుందని  బంగ్లా హెడ్ కోచ్  చండిక హతురుసింఘ  ఆరోపించిన నేపథ్యంలో  ఈ టోర్నీ కో హోస్ట్‌గా ఉన్న శ్రీలంక  నష్ట నివారణ చర్యలకు దిగింది.  అబ్బే ఇదేం  ఏకపక్ష నిర్ణయం కాదు. మమ్మల్ని కూడా అడిగారు. మేం ఓకే చెప్పాం అన్న చందంగా కలరింగ్ ఇచ్చింది. ట్విటర్‌లో శ్రీలంక క్రికెట్ స్పందిస్తూ.. ‘భారత్ - పాకిస్తాన్ మధ్య జరుగబోయే సూపర్ - 4 మ్యాచ్ లో రిజర్వ్ డే పై  ప్రస్తుతం  టోర్నీలో ఉన్న నాలుగు దేశాలనూ ఏసీసీ సంప్రదించింది.  టోర్నీని సమర్థవంతంగా నిర్వహించేందుకే  ఈ నిర్ణయం తీసుకుంది’ అని   ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌పైనా ప్రసాద్ కౌంటర్ ఇచ్చాడు.  ‘మీ జట్టుకు నష్టాన్ని చేకూర్చే ఈ  అన్యాయమైన డిమాండ్‌ను మీరు ఎందుకు అంగీకరించారు..? మీ సొంత మ్యాచ్ ‌లకు కూడా రిజర్వ్ డే లేదు కదా.  భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ మీద ఎందుకంత ప్రేమ..? ఒకవేళ  ఈ రిజర్వ్ డే వల్ల మీ జట్టు ఫైనల్‌కు కూడా క్వాలిఫై కాలేకపోవచ్చు.  దయచేసి దీని వెనుక ఉన్న నిజమైన కారణమేంటో మాకు వివరించగలరా..?’ అని  ప్రశ్నించాడు. బంగ్లాదేశ్ క్రికెట్‌ బోర్డుకూ ఇదే ప్రశ్న సంధించాడు. 


 






 






వరుసబెట్టి అటు ఏసీసీకి, శ్రీలంక క్రికెట్ బోర్డు‌కు కౌంటర్లు ఇస్తున్న వెంకటేశ్ ప్రసాద్‌‌కు క్రికెట్ అభిమానులు కూడా మద్దతుగా నిలుస్తున్నారు. ‘అన్న ఫైర్ మీద ఉన్నాడు..’ అంటూ  కామెంట్స్ చేస్తున్నారు.  బ్రాడ్‌కాస్టర్లకు లాభం చేకూర్చడానికి  ఏసీసీ ఇలా చేయడం కరెక్ట్ కాదన్న భావన కూడా వారిలో వ్యక్తమవుతున్నది.  ఈ టోర్నీకి స్టార్ నెట్‌వర్క్ అధికారిక ప్రసాదారుగా ఉన్న విషయం తెలిసిందే. 





























ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial