ODI World Cup 2023: అక్టోబర్ నుంచి భారత్‌లోని పది నగరాలలో జరుగబోయే వన్డే వరల్డ్ కప్‌ నేపథ్యంలో టీమిండియా 15 మంది సభ్యుల జట్టు ఇదేనంటూ మాజీ క్రికెటర్లు హల్చల్ చేస్తున్నారు. ఇదివరకే  పలువురు మాజీ క్రికెటర్లు తమ అంచనా జట్లను ప్రకటించారు.  సంజయ్ బంగర్, సౌరవ్ గంగూలీ తమ జట్లను ఇటీవలే విడుదల చేశారు. తాజాగా  ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ మాథ్యూ హెడెన్, టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కూడా ఈ జాబితాలో చేరారు. ఈ ఇద్దరూ  స్టార్ స్పోర్ట్స్‌లో తమ అంచనా జట్ల వివరాలను ప్రకటించారు. 


గంగూలీ పక్కనబెట్టిన  కేరళ స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను మాథ్యూ హెడెన్ ఎంపిక చేశాడు. పేసర్  ప్రసిధ్ కృష్ణతో పాటు  స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్‌లకు హెడెన్   చోటు కల్పించలేదు. స్పిన్ ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లనే కొనసాగించాలని ఆసీస్ దిగ్గజం పేర్కొన్నాడు.  


హెడెన్ వరల్డ్ కప్ జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర  జడేజా, హార్ధిక్ పాండ్యా, మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్


 






ఎమ్మెస్కేపై ట్రోలింగ్.. 


హెడెన్‌తో పాటు ఎమ్మెస్కే ప్రసాద్ కూడా స్టార్ స్పోర్ట్స్ వేదికగా తన అంచనా జట్టును ప్రకటించాడు. ఓపెనర్లుగా రోహిత్, గిల్‌తో పాటు ఇషాన్ కిషన్‌నూ ఇంక్లూడ్ చేసిన ఎమ్మెస్కే.. మిడిలార్డర్ బ్యాటర్లుగా విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్,  శ్రేయాస్ అయ్యర్‌లతో పాటు సూర్యకుమార్ యాదవ్‌లకు చోటు కల్పించాడు. ఇక ఆల్ రౌండర్లుగా హార్ధిక్ పాండ్యాతో పాటు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లకు ఛాన్స్ ఇచ్చిన ప్రసాద్.. పేసర్లుగా బుమ్రా, షమీ, సిరాజ్‌లను తీసుకున్నాడు. ఆశ్చర్యకరంగా  స్పిన్నర్‌గా  రవిచంద్రన్ అశ్విన్‌ను తీసుకోవడం గమనార్హం. అశ్విన్ వన్డేలు ఆడి చాలాకాలమైంది. అశ్విన్‌తో పాటు కుల్దీప్, చాహల్‌లలో ఎవరికో ఒకరికి అవకాశం ఇస్తే బాగుంటుందని ప్రసాద్ అభిప్రాయపడ్డాడు.  అంతా బాగానే ఉన్నా  ఎమ్మెస్కేపై   సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ నడుస్తోంది.  ప్రసాద్  ప్రకటించిన జట్టులో 3డీ ప్లేయర్ ఎక్కడ..? అంటూ నెటిజన్లు ఎమ్మెస్కేను ఆటాడుకుంటున్నారు.  


2019లో వన్డే వరల్డ్ కప్ జట్టు ప్రకటన సందర్భంగా అంబటి రాయుడును కాదని హైదరాబాద్‌కే చెందిన విజయ్ శంకర్‌ను ఎంపిక చేయడం  తీవ్ర దుమారానికి దారితీసింది.  విజయ్ శంకర్ త్రీడీ ప్లేయర్ అని ప్రసాద్ సమర్థించుకోవడం, దానికి కౌంటర్‌‌గా రాయుడు ‘నేను వరల్డ్ కప్‌ను త్రీడీ గ్లాసెస్‌తో చూస్తా’ అని  చెప్పడం  అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. 20‌19లో ప్రసాద్.. టీమిండియాకు చీఫ్ సెలక్టర్‌గా ఉన్నాడు. తాజాగా ప్రసాద్ ప్రకటించిన జట్టులో  ఆ త్రీ డీ ప్లేయర్ ఎవరు..? అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 


ప్రసాద్ వరల్డ్ కప్ జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్/కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఇషాన్ కిషన్ 


 






ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial