Most Sixes In A WC Edition Rohit Sharma: ప్రపంచకప్‌లో రోహిత్‌ శర్మ విధ్వంసం అంతా ఇంతా కాదు. ముందుగా రోహిత్‌  భారీ షాట్లతో విరుచుకుపడి భారీ స్కోరుకు బాటలు వేయడం... తర్వాత మిగిలిన పనిని విరాట్‌, అయ్యర్‌, రాహుల్‌  పూర్తి చేయడం ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ ఇదే జరిగుతూ వస్తోంది. మరోసారి అదే జరిగింది. ఆరంభంలోనే దూకుడుగా ఆడుతున్న రోహిత్‌...దొరికిన బంతిని దొరికినట్లు బాదేస్తున్నాడు. అద్భుతమైన ఫుల్‌ షాట్లు.. ఫ్రంట్‌ ఫుట్‌పై భారీ షాట్లతో విరుచుకుపడుతున్నాడు. న్యూజిలాండ్‍‌( New Zealand)తో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడిన రోహిత్ శర్మ అనేక రికార్డులు బద్ధలుకొట్టాడు. ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్‌గా ఇప్పటికే తన పేరును చరిత్ర పుటల్లో లిఖించుకున్న హిట్‌మ్యాన్... మరో రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 


ప్రపంచకప్‌(World Cup)లో ఒక ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా హిట్‌మ్యాన్‌ చరిత్ర సృష్టించాడు. రోహిత్‌ శర్మ 27 సిక్సులతో మహా సంగ్రామంలో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా రికార్టు సృష్టించాడు. రోహిత్‌ ఈ ప్రపంచకప్‌లో 10 ఇన్నింగ్స్‌ల్లో 27 సిక్సులు బాదేశాడు. ఈ క్రమంలో గేల్‌ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు. క్రిస్‌ గేల్‌ ఒక ప్రపంచకప్‌ ఎడిషన్‌లో 26 సిక్సులు కొట్టగా రోహిత్‌ ఆ రికార్డును బద్దలు కొట్టాడు. తర్వాతి స్థానాల్లో మ్యాక్స్‌ వెల్‌ కూడా ఇదే ప్రపంచకప్‌లో 22 సిక్సులతో ఉన్నాడు. మోర్గాన్‌ కూడా 2019 ప్రపంచకప్‌లో 22 సిక్సులు కొట్టాడు. ఇదే ప్రపంచకప్‌లో డికాక్‌ 21 సిక్సులు కొట్టాడు. 2015 ప్రపంచకప్‌ ఎడిషన్‌లో డివిలియర్స్‌ 21 సిక్సులు కొట్టాడు. రోహిత్‌ విధ్వంసంతో ఇప్పటికే పలు రికార్డులు బద్దలయ్యాయి.


ఇదే మ్యాచ్‌లో గేల్‌ పేరున ఉన్న మరో రికార్డును కూడా రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు. ప్రపంచకప్‌లో  అత్యధిక సిక్స్ లు కొట్టిన రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటి వరకు ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సిక్సులు కొట్టిన రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరు మీద ఉంది. మొత్తం ప్రపంచకప్‌ చరిత్రలో గేల్ 49 సిక్సులు కొట్టగా.. రోహిత్ శర్మ 50 సిక్స్ లు కొట్టి ఆ రికార్డును తిరగరాశాడు. వన్డే ప్రపంచకప్‌లో అత్యధికంగా ఏడు సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ఈ విషయంలో అతను భారత మాజీ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ (6 సెంచరీలు)ను దాటేశాడు. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.  అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్‌ రికార్డు సృష్టించాడు. అన్ని ఫార్మాట్లలో 553 సిక్సర్లతో అత్యధిక సిక్సర్ల రికార్డు విండీస్‌ దిగ్గజం క్రిస్‌ గేల్ పేరిట ఉంది. యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌  పేరిట ఉన్న ఈ రికార్డును టీమిండియా సారధి రోహిత్‌ శర్మ బద్దలు కొట్టాడు. క్రిస్‌ గేల్‌ 551 ఇన్నింగ్స్‌ల్లో 553 సిక్సర్లు బాదగా... హిట్ మ్యాన్ మాత్రం కేవలం 473 ఇన్నింగ్స్‌ల్లోనే 554 సిక్సులు బాది ఆ రికార్డును బద్దలు కొట్టాడు. క్రిస్‌ గేల్‌కు.. రోహిత్‌ శర్మ మధ్య 78 ఇన్నింగ్స్‌ల తేడా ఉండడం విశేషం.