India vs Australia: 


ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023లో నేడు భారత్, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. చెన్నై వేదికగా ఈ పోరు జరుగుతోంది. ఈ మ్యాచ్‌ టాస్‌ వేశారు. టాస్‌ గెలిచిన కంగారూ కెప్టెన్‌ ప్యాట్ కమిన్స్‌ మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఎండ బాగా ఉండటంతో తొలుత పరుగులు చేయడం సులభంగా ఉంటుందని తెలిపాడు.


ప్యాట్‌  కమిన్స్‌, ఆసీస్‌ కెప్టెన్‌: మేం మొదట బ్యాటింగ్‌ చేస్తాం. వికెట్‌ బాగుంది. ఎండ బాగా ఉంది. బ్యాటింగ్‌ చేయడానికి ఇదే మంచి అవకాశం. మేం చక్కగా సన్నద్ధమయ్యాం. చక్కని క్రికెట్‌ ఆడాం. జట్టులో సమతూకం ఉంది. కుర్రాళ్లకు గేమ్‌ టైమ్‌ కల్పించాం. వారిని తాజాగా ఉంచాం. ట్రావిస్‌ హెడ్‌ ఇంకా కోలుకోలేదు. అబాట్‌, స్టాయినిస్‌, ఇంగ్లిస్‌ ఆడటం లేదు.


రోహిత్‌ శర్మ, భారత సారథి: ఇక్కడి పరిస్థితులు బౌలర్లకు అనుకూలంగా ఉంటాయి. మ్యాచ్‌ సాగే కొద్దీ బంతి టర్న్‌ అవుతుంది. సరైన లైన్‌ అండ్‌ లెంగ్తులను త్వరగా గుర్తించి సర్దుబాటు చేసుకోవాలి. మెగా టోర్నీకి ముందు చాలా క్రికెట్‌ ఆడాం. వార్మప్‌ మ్యాచులకు ముందు రెండు చక్కన సిరీసుల్లో పాల్గొన్నాం. అన్ని అంశాలను సరిదిద్దుకున్నాం. దురదృష్టవశాత్తు శుభ్‌మన్‌ గిల్‌ ఇంకా కోలుకోలేదు. ఈ రోజు ఉదయం వరకు ఎదురుచూశాం. అతడి స్థానంలో ఇషాన్‌ వస్తున్నాడు. నాతో పాటు ఓపెనింగ్‌కు దిగుతాడు.


భారత్‌: రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌


ఆస్ట్రేలియా: డేవిడ్‌ వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌, స్టీవ్‌ స్మిత్‌, మార్నస్‌ లబుషేన్‌, కామెరాన్‌ గ్రీన్‌, అలెక్స్‌ కేరీ, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, ప్యాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, జోష్ హేజిల్‌వుడ్‌, ఆడమ్‌ జంపా


హోరాహోరీ తప్పదా..?
 చెన్నై వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచి శుభారంభం చేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది. కానీ పాట్ కమ్మిన్స్ నేతృత్వంలో ఆస్ట్రేలియా ఎప్పుడూ కఠినమైన ప్రత్యర్థే కావడంతో భారత్‌ తొలి పోరులో హోరాహోరీ తప్పక పోవచ్చని మాజీలు అంచనా వేస్తున్నారు. చెపాక్‌ వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య రసవత్తరమైన మ్యాచ్‌లు జరిగాయి. ఈసారి కూడా అలాంటి పోరు తప్పదని అభిమానులు అంచనా వేస్తున్నారు. భారత్ బ్యాటింగ్ బలంగా ఉంటే... ఆస్ట్రేలియా పేస్ అటాక్ అత్యున్నత స్థాయిలో ఉంది. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలతో భారత బ్యాటింగ్‌ దుర్భేద్యంగా ఉంది. పాట్ కమిన్స్, హాజిల్‌వుడ్, మార్కస్ స్టోయినిస్‌లతో కంగారుల బౌలింగ్‌ కూడా బలంగా ఉంది. బ్యాట్‌కు బాల్‌కు జరిగే ఈ పోరులో భారతే గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.


బుమ్రా సారధ్యంలో...
బుమ్రా సారధ్యంలో భారత బౌలింగ్‌ కూడా బలంగా ఉంది. అశ్విన్‌కు తుది జట్టులో స్థానం దక్కవచ్చనే మాజీలు భావిస్తున్నారు. చెపాక్‌ పిచ్‌ స్పిన్నర్లుకు అనుకూలంగా ఉండడంతో..... అశ్విన్‌, కుల్దీప్‌ యాదవ్‌లు తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. చెపాక్ పిచ్‌పై మిడిల్ ఓవర్లలో భారత స్పిన్నర్లు ఎలా బౌలింగ్ చేస్తారనే దానిపైనే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. సిరాజ్‌తో కలిసి బుమ్రా పేస్‌ విభాగాన్ని పంచుకోకున్నాడు. మరోవైపు ఐదుసార్లు ఛాంపియన్ అయిన ఆసీస్‌ బ్యాటింగ్‌, బౌలింగ్  రెండు విభాగాల్లోనూ పటిష్టంగా ఉంది. ముగ్గుర స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. చెపాక్‌లో భారత్ 14 వన్డలు ఆడగా ఏడు మ్యాచ్‌ల్లో గెలిచింది. ఆరు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్‌ రద్దయింది. ఈ వేదికపై ఆస్ట్రేలియా ఆడిన ఆరు వన్డేల్లో ఐదింటిలో విజయం సాధించింది.