ODI World Cup 2023: లైఫ్ ఎవరిని ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్తుందో అంచనా వేయలేం. ‘భగవంతుడి స్క్రీన్ ప్లే’లో మనం ఊహించని మలుపులు ఎన్నో ఉంటాయి. అందులో కొన్ని మనకు అనుకూలంగా ఆనందాన్ని ఇచ్చేవి అయితే ‘అసలు ఇక అది జరగదేమో!’ అని నైరాశ్యంలో చిక్కుకున్నవారికి ఆశ్చర్యాన్ని కలిగించేవీ మరికొన్ని జరుగుతాయి. ప్రస్తుతం చెన్నైకి చెందిన లోకేశ్ కుమార్ ఇంచుమించు ఆశ్చర్యం, ఆనందం కలగలిసిన ఫీలింగ్‌లో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న లోకేశ్ కుమార్.. తాను కలలో కూడా ఊహించని విధంగా వన్డే వరల్డ్ కప్‌లో భాగం కాబోతున్నాడు. ఇది అతడి లైఫ్‌లో అస్సలు ఊహించని ప్రయాణం.. ఆ కథా కమామీషు ఇదే..
ఎవరీ లోకేశ్..?
చెన్నైకి చెందిన లోకేశ్‌కు ఐపీఎల్‌లో, అంతర్జాతీయ స్థాయిలో ఆడాలనేది కల. చదువు పూర్తి చేశాక క్రికెటర్ కావాలనే కోరికతో దాదాపు నాలుగేండ్ల పాటు ఆ దిశగా ప్రయత్నం చేశాడు. కానీ క్రికెట్‌లో ఉన్న పోటీ, రాజకీయాల కారణంగా అతడి కల కలగానే మిగిలిపోయింది. ఐపీఎల్‌లో ఆడకపోయినా తమిళనాడు క్రికెట్ లీగ్ (టీఎన్‌పీఎల్) లోనో లేక తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీఎన్‌సీఏ) నిర్వహించే థర్డ్ డివిజన్ లీగ్‌లలో అయినా ఆడాలని చూసినా ఆ అవకాశమూ రాలేదు. ‘ఇక ఇది అయ్యేలా లేదు. ఏదో ఓ పని చూసుకుందాం’ అని డిసైడ్ అయిన లోకేశ్.. 2018 నుంచి స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా చేరాడు. ఏదో ఒక పనిచేసుకుంటున్నా ఆట మీద మమకారం చావలేదు. వీలుచిక్కినప్పుడల్లా క్రికెట్ ఆడటంతోనే గడిపేవాడు లోకేశ్..
డచ్ టీమ్‌లోకి ఎంట్రీ..
వెతకబోయిన తీగ కాలికి దొరికినట్టు లోకేశ్ కలను డచ్ టీమ్ తీర్చబోతోంది. భారత్‌లో జరుగబోయే వన్డే వరల్డ్ కప్‌కు గాను ఇక్కడి స్పిన్ పిచ్‌లపై అవగాహన పెంచుకునేందుకు నెదర్లాండ్స్ టీమ్ భారత స్పిన్నర్లను నియమించుకోవాలని సంకల్పించింది. అనుకున్నదే తడువుగా ‘మాకు భారత బౌలర్లు కావాలి’ అని ప్రకటన కూడా ఇచ్చింది. ఇందుకు గాను సోషల్ మీడియాలో తమ బౌలింగ్‌కు సంబంధించిన క్లిప్స్‌ను పంపిస్తే అందులోంచి తమకు నచ్చినవారిని ఎంపిక చేసుకుంటామని వెల్లడించింది. ఇలా ఎంపికైన బౌలర్లు ప్రధాన జట్టులో కాకపోయినా నెట్స్ లో ప్రాక్టీస్ కోసం ఆ జట్టు వాడుకోనుంది. డచ్ టీమ్‌కు నెట్ బౌలర్లు కావాలనే యాడ్ చూసిన లోకేశ్.. వెంటనే తాను బౌలింగ్ చేస్తున్న వీడియోను క్రికెట్ నెదర్లాండ్స్ టీమ్‌కు పంపాడు. దేశంలో లోకేశ్ వంటి వారు దాదాపు పది వేల మంది నుంచి డచ్ టీమ్‌కు అప్లికేషన్లు వచ్చాయి. వీరిలో కాచి వడబోచి నలుగురు నెట్ బౌలర్లను ఎంపిక చేయగా అందులో లోకేశ్ పేరు కూడా ఉంది.
ఆ నలుగురు ఎవరంటే..
- హేమంత్ కుమార్ (చురు, రాజస్తాన్ - లెఫ్టార్మ్ పేసర్ గతంలో ఆర్సీబీకి నెట్ బౌలర్‌గా పనిచేశాడు)
- రాజమణి ప్రసాద్ (హైదరాబాద్, తెలంగాణ - లెఫ్టార్మ్ పేసర్, స్టేట్ రంజీ టీమ్‌తో పాటు చెన్నై సూపర్ కింగ్స్‌కు నెట్ బౌలర్‌గా పనిచేశాడు)
- హర్షా శర్మ (కురుక్షేత్ర, హర్యానా - లెఫ్టార్మ్ స్పిన్నర్, రాజస్తాన్ రాయల్స్ నెట్ బౌలర్‌గా పనిచేశాడు)
- లోకేశ్ కుమార్ (చెన్నై, తమిళనాడు - మిస్టర్ స్పిన్నర్)
ఎడమ చేతి వాటం స్పిన్నర్ అయిన లోకేశ్‌ను నెదర్లాండ్స్ టీమ్ మిస్టరీ స్పిన్నర్ అని పేర్కొంది. మరి ఈ నలుగురూ నెదర్లాండ్స్ టీమ్‌కు ఏ మేరకు ఉపయోగపడతారు..? వీరి సాయంతో అసలు మ్యాచ్‌లలో డచ్ జట్టు ఎలా నెగ్గుకురాగలుగుతుంది..? అనేది త్వరలోనే తేలనుంది. కాగా ఇదివరకే బెంగళూరుకు చేరుకున్న నెదర్లాండ్స్ టీమ్ ఆలూరులో శిక్షణ పొందుతోంది. పైన పేర్కొన్న నలుగురు బౌలర్లు నెదర్లాండ్స్ టీమ్‌తో కలిశారు.
నెదర్లాండ్స్ టీమ్‌కు నెట్ బౌలర్‌గా ఎంపికైనందుకు గాను లోకేశ్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. తన ప్రతిభకు ఇప్పటికైనా గుర్తింపు దక్కిందని అతడు చెప్పాడు. నెదర్లాండ్స్ టీమ్ తనను బాగా రిసీవ్ చేసుకుందని, తాను ఇప్పటికే డచ్ టీమ్ ఫ్యామిలీ మెంబర్ అయిపోయానని చెప్పుకొచ్చాడు.