ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు సృష్టించాడు. వన్డే ప్రపంచకప్‌లో వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు. ప్రపంచకప్‌లో భాగంగా ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. వార్నర్ 19 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకుని అతి తక్కువ ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. సచిన్ టెండూల్కర్, ఏబీ డివిలియర్స్ 20 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు పూర్తి చేయగా వార్నర్ కేవలం 19 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించి వారి పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో స్ట్రెయిట్ డ్రైవ్‌తో బౌండరీతో వార్నర్ ఈ ఫీట్ సాధించాడు. ప్రపంచకప్‌లో వెయ్యికిపైగా పరుగులు చేసిన నాల్గవ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
వార్నర్ ప్రపంచకప్‌లలో ఇప్పటివరకూ మూడు అర్ధసెంచరీలు, నాలుగు సెంచరీలు చేశాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ జాబితాలో అగ్రస్థానానికి చేరుకునే పోటీలో ఉన్నాడు. రోహిత్ 17 ఇన్నింగ్స్‌లలో 978 పరుగులు చేశాడు. వార్నర్ రికార్డు బద్దలు కొట్టేందుకు రోహిత్ కేవలం 22 పరుగుల దూరంలో ఉన్నాడు. 21 ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగులను దాటిన వివ్ రిచర్డ్స్, సౌరవ్ గంగూలీ, 22 ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగుల మార్క్ దాటి మార్క్ వా, హర్షలే గిబ్స్ వారి తర్వాత స్థానాల్లో ఉన్నారు.
ఇటీవలే టెస్టులపై డేవిడ్ వార్నర్ కీలక ప్రకనట చేశాడు. 2024లో జనవరిలో పాకిస్థాన్‌తో జరగనున్న టెస్టు సిరీస్ చివరిదని వెల్లడించాడు. తన సొంత మైదానమైన సిడ్నీలో చివరి మ్యాచ్ ఆడనున్నట్లు ప్రకటించాడు. 2024 జనవరిలో ఆసీస్ జట్టు, పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్ ముగిశాక వెస్టిండీస్‌తో తలపడనుంది. ఆ మ్యాచులో తాను ఆడబోనని ఈ లెఫ్ట్ హ్యాండర్ స్పష్టం చేశాడు.
వార్నర్ 2009లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇప్పటివరకు 103 టెస్టు మ్యాచులాడి.. 8,158 పరుగులు చేశాడు. అందులో 25 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 150 వన్డేల్లో ఆసీస్ తరఫున బరిలోకి దిగిన వార్నర్.. 20 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలో 6397 పరుగులు చేశాడు. 99 టీ-20 మ్యాచుల్లో ఒక సెంచరీ 24 హాఫ్ సెంచరీలతో 2894 రన్స్ స్కోరు చేశాడు.
వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన ఆటగాళ్లు..
డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) -19 ఇన్నింగ్స్‌ల్లో
సచిన్ టెండూల్కర్ (భారత్) – 20 ఇన్నింగ్స్‌ల్లో
ఏబి డివిలియర్స్ (దక్షిణాఫ్రికా) – 20 ఇన్నింగ్స్‌ల్లో
వివ్ రిచర్డ్స్ (వెస్టిండీస్) – 21 ఇన్నింగ్స్‌ల్లో
సౌరవ్ గంగూలీ (భారత్) – 21 ఇన్నింగ్స్‌ల్లో
మార్క్ వా (ఆస్ట్రేలియా)- 22 ఇన్నింగ్స్‌ల్లో
హెర్షెల్ గిబ్స్ (దక్షిణాఫ్రికా) – 22 ఇన్నింగ్స్‌ల్లో