భారత్ సహా ప్రపంచమంతా క్రికెట్ వరల్డ్ కప్ మానియాలో మునిగిపోయింది. ఈ సారి ప్రపంచకప్ ఎవరికి దక్కుతుందా... స్వదేశంలో జరుగుతున్న వరల్డ్‌కప్‌ను టీమిండియా కైవసం చేసుకుంటుందా అని అభిమానులు లెక్కలేసుకుంటున్నారు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు టీమిండియా ఈసారి ప్రపంచకప్ దక్కించుకుంటుందని ధీమాగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన పోస్టు తెగ వైరల్ అవుతోంది. స్వతహాగా క్రికెట్‌ను ఇష్టపడే ఆయన.. వన్డే వరల్డ్ కప్ పోటీలు ప్రారంభమైన సందర్భంగా మళ్లీ వార్తల్లో నిలిచారు. తన పేరుతో ఉన్న జెర్సీ ఫొటోను షేర్ చేయడంతో ప్రస్తుతం అందరి దృష్టీ ఈ ఫొటోపైనే పడింది.
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన చాలా విషయాలను ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా షేర్ చేస్తూ నెటిజన్ల ప్రశ్నలకు రిప్లై ఇస్తూ ఉంటాడు. తాజాగా ఆనంద్ మహీంద్రా ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ఎక్స్‌లో టీమిండియా జెర్సీపై ‘‘ఆనంద్ 55’’ అని రాసి ఫొటోను ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. ఐయాం రెడీ... థాంక్యూ బీసీసీఐ, టెక్ మహీంద్రా అంటూ పోస్టు పెట్టారు. ఆనంద్ పంచుకున్న ఫొటోల్లో టీమిండియా జెర్సీ ఉంది. దానిపై ఆనంద్ 55 అని రాసి ఉంది. మహీంద్ర ట్వీట్‌తో క్రికెట్ అభిమానులంతా ప్రస్తుతం ఈ జెర్సీపై ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. టీమ్ ఇండియా జెర్సీ ఓకే గానీ.. దానిపై 55 అనే నెంబర్ ఏంటి..?.. అని చాలా మంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఎవరు సరైన సమాధానం చెప్పగలరో తెలుసుకోవాలనుందని ఆనంద్ మహీంద్ర నెటిజన్లకు ఓ టాస్క్ కూడా ఇచ్చారు. ఇంకేం అభిమానులు రకరకాల సమాధానాలు ఇస్తున్నారు. చాలా మంది ఈ జెర్సీపై ఉన్న 55నంబర్ ఏంటని సందేహాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేశారు.
చాలా మంది నెటిజన్లు 55 ఆనంద్ మహీంద్రా లక్కీ నెంబర్ 55 అని ఆ పోస్ట్ కింద కామెంట్ చేస్తున్నారు. మీరు 1955లో జన్మించారు కాబట్టి జెర్సీపై 55 అని ఉందని ఒకరు, కోహ్లీ, ఆనంద్‌కు 5అక్షరాలు ఉన్నాయి కాబట్టి అని మరొకరు.. ఇలా రకరకాల సమాధానాలు ఇచ్చారు.
ఇలా చాలా ఊహాగానాల మధ్య, ఆనంద్ మహీంద్రా 55 రహస్యాన్ని రివీల్ చేశారు. మీరందరూ చాలా సింపుల్‌గా కనిపెట్టారే! అవును. నా పుట్టిన తేదీ 1-5-55. 5 ఎల్లప్పుడూ నా అదృష్ట సంఖ్య అని ఆనంద్ మహీంద్ర రహస్యాన్ని చెప్పేశారు. ఈ ప్రత్యేక జెర్సీని బీసీసీఐ ఆనంద్ మహీంద్రాకు బహూకరించినట్టు తెలుస్తోంది. భారత్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కంపెనీల్లో మహీంద్రా గ్రూప్ ఒకటి. దీనికి ఆనంద్ మహీంద్రా ఛైర్మన్. బారత్- ఆస్ట్రేలియా మధ్య జరగనున్న మ్యాచ్‌ను ఆనంద్ మహీంద్ర ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉందన్న వార్తలు ఉన్నాయి.
మరికాసేపట్లో టీమిండియా ప్రపంచకప్ వేటను ప్రారంభించనుంది. రోహిత్ శర్మ సారథ్యంలో భీకరంగా ఉన్న భారత జట్టు.. అయిదుసార్లు ప్రపంచకప్ విజేత, కఠిన ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. విజయంతో టోర్నీని ప్రారంభించాలని ఇరుజట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇందుకోసం రెండు జట్లు తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాయి. చెన్నై వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచి శుభారంభం చేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది. కానీ పాట్ కమ్మిన్స్ నేతృత్వంలో ఆస్ట్రేలియా ఎప్పుడూ కఠినమైన ప్రత్యర్థే కావడంతో భారత్ తొలి పోరులో హోరాహోరీ తప్పక పోవచ్చని మాజీలు అంచనా వేస్తున్నారు.