IND Vs AUS, Innings Highlights: 


ఇదీ బౌలింగంటే! ఇదీ ఆధిపత్యమంటే! ఇదీ టీమ్‌ఇండియా బౌలర్లంటే! ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023 ఆరంభ మ్యాచులో హిట్‌మ్యాన్‌ సేన దుమ్మురేపుతోంది. ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించింది. తమ బౌలింగులో పరుగులు చేయడం సులభం కాదని చాటిచెప్పింది. ప్రత్యర్థిని 49.3 ఓవర్లకు 199కి ఆలౌట్‌ చేసింది. రవీంద్ర జడేజా (3/28), జస్ప్రీత్‌ బుమ్రా (2/35), కుల్‌దీప్‌ యాదవ్‌ (2/42) సమష్టిగా కంగారూలను దెబ్బకొట్టారు. ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (41; 52 బంతుల్లో 6x4), స్టీవ్‌ స్మిత్‌ (46; 71 బంతుల్లో 5x4) టాప్‌ స్కోరర్లు. అనవసర షాట్లకు పోకుండా సమయోచితంగా ఆడితే చాలు! భారత్‌ ఈ టార్గెట్‌ను ఛేదించడం సులువే!


తొలి స్పెల్‌ నుంచే


చెపాక్‌.. మందకొడి పిచ్‌! చారిత్రకంగా స్పిన్‌ ట్రాక్‌! మందకొడిగా ఉంటుంది. సరైన లెంగ్తుల్లో బంతులేస్తే ఆడటం ఎంతటి బ్యాటర్‌కైనా కష్టమే! ఇక్కడ స్కోర్‌ చేయడానికి మొదటి ఇన్నింగ్సే బెస్ట్‌! అయితే టాస్‌ ఓడటంతో మొదట బౌలింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా పరిస్థితులను అందిపుచ్చుకుంది. తొలి ఓవర్‌ నుంచే భీకరంగా బౌలింగ్‌ చేసింది. జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌ మొదటి స్పెల్‌లో చురకత్తుల్లాంటి బంతులేశారు. ఆ తర్వాత యాష్‌, జడ్డూ, కుల్‌దీప్‌ కట్టడి చేశారు. తొలి 10 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 43 పరుగులు చేసిన ఆసీస్‌.. తర్వాతి 30 ఓవర్లలో 6 వికెట్లు చేజార్చుకొని 113 పరుగులు చేసిందంటేనే తీవ్రత అర్థం చేసుకోవచ్చు.


నిలిచిన స్మిత్‌, వార్నర్‌


జట్టు స్కోరు 5 వద్దే ఆసీస్‌ ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ (0) బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. పరిస్థితులపై అవగాహన ఉన్న ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌ ఆచితూచి ఆడారు. రెండో వికెట్‌కు 85 బంతుల్లో 69 పరుగుల భాగస్వామ్యం అందించారు. గేర్లు మార్చే తరుణంలో డేవిడ్‌ వార్నర్‌ను కుల్‌దీప్‌ యాదవ్‌ కాట్ అండ్‌ బౌల్డ్‌ చేశాడు. అప్పటికి స్కోరు 74. ఈ సిచ్యువేషన్లో స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొనే మార్నస్‌ లబుషేన్ (27; 41 బంతుల్లో 1x4) స్మిత్‌కు అండగా నిలిచాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 64 బంతుల్లో 36 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు.


స్పిన్నర్ల ఊచకోత


టీమ్‌ఇండియా బౌలర్లు పక్కా లైన్‌ అండ్‌ లెంగ్తులో బంతులు వేస్తుండటంతో ఆసీస్‌ స్కోరు వేగం తగ్గింది. అయితే వరుస ఓవర్లలో జడ్డూ మూడు వికెట్లు తీసి కంగారూలకు షాకిచ్చాడు. 27.1వ బంతికి స్మిత్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. 30వ ఓవర్లో ఒక బంతి అంతరంతోనే లబుషేన్‌, అలెక్స్‌ కేరీ (0)ని పెవిలియన్‌కు పంపించాడు. 39.3 ఓవర్లకు ఆసీస్‌ స్కోరు 150కి చేరుకుంది. కామెరాన్‌ గ్రీన్‌ (8; 20 బంతుల్లో) త్వరగానే పెవిలియన్‌ చేరాడు. దూకుడుగా ఆడే క్రమంలో ప్యాట్‌ కమిన్స్‌ (15) బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. దాంతో 165కే కంగారూలు 8 వికెట్లు చేజార్చుకున్నారు. ఆఖర్లో మిచెల్‌ స్టార్క్‌ (28; 35 బంతుల్లో 2x4, 1x6), పోరాటంతో ఆసీస్‌ స్కోరు 199కి చేరుకుంది.


భారత్‌: రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌


ఆస్ట్రేలియా: డేవిడ్‌ వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌, స్టీవ్‌ స్మిత్‌, మార్నస్‌ లబుషేన్‌, కామెరాన్‌ గ్రీన్‌, అలెక్స్‌ కేరీ, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, ప్యాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, జోష్ హేజిల్‌వుడ్‌, ఆడమ్‌ జంపా