IND vs AUS:
ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 తొలి మ్యాచులో టీమ్‌ఇండియా అదరగొడుతోంది. పటిష్ఠమైన ఆస్ట్రేలియాను ఇబ్బంది పెడుతోంది. కీలక సమయాల్లో వికెట్లు పడగొడుతూ మ్యాచ్‌పై పట్టు సాధిస్తోంది. దాంతో 30 ఓవర్లు ముగిసే సరికి కంగారూలు 5 వికెట్లు నష్టపోయి 119 పరుగులు చేశారు. క్రీజులో కొత్త బ్యాటర్లు కామెరాన్ గ్రీన్ (0), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (4) ఉన్నారు. రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టి తన స్పిన్‌తో ప్రత్యర్థిని వణికిస్తున్నాడు. అంతకు ముందు ఓపెనర్ డేవిడ్ వార్నర్ (41; 52 బంతుల్లో 6x4), స్టీవ్ స్మిత్ (46; 71 బంతుల్లో 5x4) రాణించారు.
బెంబేలెత్తిస్తున్న బౌలర్లు
చెపాక్.. మందకొడి పిచ్! చారిత్రకంగా స్పిన్ ట్రాక్! మందకొడిగా ఉంటుంది. సరైన లెంగ్తుల్లో బంతులేస్తే ఆడటం ఎంతటి బ్యాటర్‌కైనా కష్టమే! ఇక్కడ స్కోర్ చేయడానికి మొదటి ఇన్నింగ్సే బెస్ట్! అయితే టాస్ ఓడటంతో మొదట బౌలింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా పరిస్థితులను అందిపుచ్చుకుంది. తొలి ఓవర్ నుంచే భీకరంగా బౌలింగ్ చేసింది. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ మొదటి స్పెల్‌లో చురకత్తుల్లాంటి బంతులేశారు. జట్టు స్కోరు 5 వద్దే ఆసీస్ ఓపెనర్ మిచెల్ మార్ష్ (0) బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. పరిస్థితులపై అవగాహన ఉండటంతో ఓపెనర్ డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ ఆచితూచి ఆడారు. వికెట్లు కాపాడుకుంటే తర్వాత స్కోరు చేయొచ్చని భావించారు. తొలి వికెట్‌కు 85 బంతుల్లో 69 పరుగుల భాగస్వామ్యం అందించారు.
ఆదుకున్న వార్నర్, స్మిత్
గేర్లు మార్చే తరుణంలో డేవిడ్ వార్నర్‌ను కుల్‌దీప్ యాదవ్ కాట్ అండ్ బౌల్డ్ చేశాడు. అప్పటికి స్కోరు 74. ఈ సిచ్యువేషన్లో స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొనే మార్నస్ లబుషేన్ (27; 41 బంతుల్లో 1x4) స్మిత్‌కు అండగా నిలిచాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 64 బంతుల్లో 36 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. టీమ్‌ఇండియా బౌలర్లు పక్కా లైన్ అండ్ లెంగ్తులో బంతులు వేస్తుండటంతో ఆసీస్ స్కోరు వేగం తగ్గింది. అయితే వరుస ఓవర్లలో జడ్డూ మూడు వికెట్లు తీసి కంగారూలకు షాకిచ్చాడు. 27.1వ బంతికి స్మిత్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. 30వ ఓవర్లో ఒక బంతి అంతరంతోనే లబుషేన్, అలెక్స్ కేరీ (0)ని పెవిలియన్‌కు పంపించాడు. మిగతా బౌలర్లు సైతం వికెట్లు తీయకపోయినా పరుగులు ఇవ్వకుండా ఒత్తిడి చేస్తున్నారు.
రోహిత్ శర్మ, భారత సారథి: ఇక్కడి పరిస్థితులు బౌలర్లకు అనుకూలంగా ఉంటాయి. మ్యాచ్ సాగే కొద్దీ బంతి టర్న్ అవుతుంది. సరైన లైన్ అండ్ లెంగ్తులను త్వరగా గుర్తించి సర్దుబాటు చేసుకోవాలి. మెగా టోర్నీకి ముందు చాలా క్రికెట్ ఆడాం. వార్మప్ మ్యాచులకు ముందు రెండు చక్కన సిరీసుల్లో పాల్గొన్నాం. అన్ని అంశాలను సరిదిద్దుకున్నాం. దురదృష్టవశాత్తు శుభ్‌మన్ గిల్ ఇంకా కోలుకోలేదు. ఈ రోజు ఉదయం వరకు ఎదురుచూశాం. అతడి స్థానంలో ఇషాన్ వస్తున్నాడు. నాతో పాటు ఓపెనింగ్‌కు దిగుతాడు.
భారత్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్‌దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కేరీ, గ్లెన్ మాక్స్‌వెల్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, ఆడమ్ జంపా