Harry Brook Test Record:  ఇంగ్లండ్ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ అరుదైన రికార్డు సృష్టించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 9 ఇన్నింగ్సుల్లోనే 800 పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర లిఖించాడు. ఇప్పటివరకు మొదటి 9 ఇన్సింగుల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు భారత మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లి పేరిట ఉండేది. కాంబ్లి తొలి 9 ఇన్నింగ్సుల్లో 798 పరుగులు సాధించాడు.  ఇప్పుడు బ్రూక్ దాన్ని బద్దలు కొట్టాడు. అలాగే టెస్టుల్లో వందకుపైగా స్ట్రైక్ రేట్ తో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం టెస్టుల్లో హ్యారీ బ్రూక్ సగటు 100.88. 


వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్- ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లోనే హ్యారీ బ్రూక్ ఈ రికార్డు సృష్టించాడు. బ్రూక్ బ్యాటింగ్ కు వెళ్లినప్పుడు ఇంగ్లండ్ 3 వికెట్లకు 21 పరుగులతో ఉంది. జాక్ క్రాలీ (2), బెన్ డకెట్ (9), ఓలీ పోప్ (10)లు విఫలమవటంతో ఇంగ్లీష్ జట్టు కష్టాల్లో పడింది. ఈ దశలో బ్యాటింగ్ కు దిగిన హ్యారీ బ్రూక్, జో రూట్ తో కలిసి అదరగొట్టాడు. తమకు సొంతమైన బజ్ బాల్ విధానంతో వేగంగా పరుగులు రాబట్టాడు. 107 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. ఆ తర్వాత మరింత వేగంగా బ్యాటింగ్ చేసిన బ్రూక్ తర్వాతి 62 బంతుల్లోనే 84 పరుగులు చేసేశాడు. ప్రస్తుతం 184 పరుగులతో అజేయంగా ఉన్నాడు. మరోవైపు జో రూట్ కూడా శతకం (101 నాటౌట్) బాదాడు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 294 పరుగులు జోడించారు.  






6 టెస్టులు 4 సెంచరీలు


హ్యారీ బ్రూక్ 6 టెస్టుల్లో 9 ఇన్నింగ్సుల్లో 807 పరుగులతో కొనసాగుతున్నాడు. ఇందులో 4 సెంచరీలున్నాయి. అతని టెస్ట్ సగటు 100.88. భారత దిగ్గజం సునీల్ గావస్కర్ మాత్రమే (129.66) టెస్ట్ సగటులో బ్రూక్ కన్నా ముందున్నాడు. అతి తక్కువ టెస్ట్ ఇన్నింగ్సుల్లో అత్యధిక పరుగులు చేసినవారి జాబితాలో బ్రూక్ తర్వాత వినోద్ కాంబ్లి (798), హెర్బర్ట్ సుట్ల్కిఫ్ (780), సునీల్ గావస్కర్ (778), ఎవర్టన్ వీకెస్ (777) లు ఉన్నారు. 






హైదరబాద్ సన్ రైజర్స్ లో హ్యారీ బ్రూక్


టెస్టుల్లో అదరగొడుతున్న ఇంగ్లండ్ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ ను ఐపీఎల్ జట్టు సన్ రైజర్స్ దక్కించుకుంది. ఇటీవల జరిగిన మినీ వేలంలో రూ. 13.25 కోట్ల భారీ ధర చెల్లించి బ్రూక్ ను దక్కించుకుంది. అయితే ఇప్పటివరకు హ్యారీ పరిమితి ఓవర్ల క్రికెట్ లో పెద్దగా ప్రభావం చూపలేదు. మార్చి 31 నుంచి ఐపీఎల్ 16వ ఎడిషన్ ప్రారంభం కానుంది.