DELHI CAPITALS: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో సహా మొత్తం ఐదు జట్లు పాల్గొంటున్నాయి. ఫిబ్రవరి 13వ తేదీన జరిగిన వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ తమ జట్టులో భారత మహిళల క్రికెట్ జట్టుకు చెందిన షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్‌లను చేర్చుకుంది. మొదటి సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును విజేతగా చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించగల మగ్గురు ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.


1. షెఫాలీ వర్మ
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ షెఫాలీ వర్మ ప్రదర్శన ఇటీవల అంతంత మాత్రంగానే ఉంది. కానీ తనదైన రోజున ఆమె కచ్చితంగా మ్యాచ్ విన్నరే. షెఫాలీ వర్మ స్ట్రైక్ రేట్ టీ20 ఫార్మాట్‌లో దాదాపు 132గా ఉంది.


తన అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటివరకు 56 టీ20 మ్యాచ్‌లు ఆడిన షెఫాలీ వర్మ 24.24 సగటుతో మొత్తం 1,333 పరుగులు సాధించింది. షెఫాలీ మొదటి బంతి నుంచి బౌలర్లపై దూకుడుగా ఆడుతుంది. ఈ కారణంగా ఆమె జట్టుకు బ్యాట్‌తో అతిపెద్ద మ్యాచ్ విన్నర్‌గా ఉండగలదు.


2. మెగ్ లానింగ్
మహిళల క్రికెట్‌లో ఆస్ట్రేలియన్ జట్టు గత ఏడు టీ20 ప్రపంచకప్‌లలో ఫైనల్స్‌కు చేరుకోవడంలో మెగ్ లానింగ్ పాత్ర ఎంతో కీలకం. కేవలం ప్లేయర్‌గా మాత్రమే కాకుండా జట్టు కెప్టెన్‌గా కూడా మెగ్ లానింగ్ ఎంతో సేవలు అందించింది. టీ20 ఫార్మాట్‌లో అపారమైన అనుభవంతో ఒత్తిడిలో ఎలా ఆడాలో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మెగ్ లానింగ్‌కు బాగా తెలుసు.


మెగ్ లానింగ్ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో ఇప్పటివరకు 131 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో ఆమె 36.90 సగటుతో 3,395 పరుగులు చేసింది. మెగ్ లానింగ్ రెండు సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు కూడా సాధించింది. అదే సమయంలో మహిళల బిగ్ బాష్ లీగ్‌లో కూడా మెగ్ లానింగ్ రికార్డులు అద్భుతంగా ఉన్నాయి.


3. జెస్ జోనాసన్
భారత పిచ్‌లపై ఏ ఫార్మాట్‌లో చూసినా స్పిన్ బౌలింగ్‌కు కొంచెం సహకారం కనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో భాగమైన అనుభవజ్ఞురాలైన లెఫ్టార్మ్ స్పిన్నర్ జెస్ జోనాస్సెన్ చాలా ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఉంది.


ఏ సందర్భంలోనైనా జట్టు తరఫున వికెట్లు తీయగల సత్తా తనకు ఉందని జోనాసన్ ఇప్పటివరకు తన కెరీర్‌లో నిరూపించుకుంది. ఇప్పటి వరకు 99 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన జోనాసన్ 95 వికెట్లు పడగొట్టింది. ఈ సమయంలో తన ఎకానమీ రేటు 5.61గా ఉంది.


మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో ఆటగాళ్లపై భారీ డబ్బుల వర్షం కురిసింది. స్మృతి మంథన, యాష్లే గార్డ్‌నర్, నటాలీ స్కీవర్, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ వంటి ప్లేయర్ల కోసం జట్లు చాలా డబ్బు ఖర్చు చేశాయి. ఈ వేలంలో భారత జట్టు ఓపెనర్ స్మృతి మంథన అత్యంత ఖరీదైన క్రీడాకారిణిగా నిలిచింది. రూ.3.40 కోట్ల భారీ మొత్తానికి స్మృతి మంధానను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సంతకం చేసింది. స్మృతి మంథన కోసం ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆసక్తికరమైన పోరు జరిగింది. కానీ చివరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచింది.