టీవల కాలంలో పాన్ ఇండియా చిత్రాల సందడి మొదలైన తర్వాత, సినీ ఇండస్ట్రీలో భాషా ప్రాంతీయత భేదాలు తొలగిపోయాయి. ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా అన్ని రకాల సినిమాలను ఆదరిస్తుండటంతో.. ఫిలిం మేకర్స్ అందరూ ఇతర భాషల్లో సినిమాలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా బలమైన మార్కెట్ కలిగిన హిందీ చిత్ర పరిశ్రమ మీద దృష్టి సారిస్తున్నారు. ఇందుకు టాలీవుడ్ కూడా మినహాయింపు కాదు. మన దర్శకులే కాదు, నిర్మాతలు కూడా పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు. 


ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో 'ప్రతిబంధ్' నుంచి 'గజినీ' వరకు అనేక చిత్రాలను నిర్మించారు. అశ్వినీదత్, మధు మంతెన, ఠాగూర్ మధు లాంటి ఇతర నిర్మాతల భాగస్వామ్యంతో ప్రొడక్షన్ చేసారు. 2008లో 'గజినీ' రీమేక్ చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న అరవింద్.. పద్నాలుగేళ్ల తర్వాత 'జెర్సీ' రీమేక్ తో హిందీలోకి రీఎంట్రీ ఇచ్చారు. ఇందులో దిల్ రాజు మరియు సూర్యదేవర నాగవంశీ వంటి స్టార్ ప్రొడ్యూసర్స్ నిర్మాణ భాగస్వామ్యులుగా ఉన్నారు. 


తెలుగులో విమర్శకుల ప్రశంసలు అందుకున్న 'జెర్సీ' చిత్రాన్ని, అల్లు ఎంటెర్టైన్మెంట్స్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ & సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై అదే పేరుతో హిందీలో రూపొందించారు. షాహిద్ కపూర్ వంటి స్టార్ హీరోతో చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఈ క్రమంలో ఇటీవల 'షెహజాదా' చిత్రాన్ని నిర్మించారు అల్లు అరవింద్. ఇది తెలుగులో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'అల వైకుంఠపురములో' చిత్రానికి అధికారిక రీమేక్. 


అల్లు ఎంటెర్టైన్మెంట్స్, హారిక & హాసిని క్రియేషన్స్, టీ-సిరీస్ - బ్రాత్ ఫిలిమ్స్ సంస్థలు కలిసి 'షెహజాదా' చిత్రాన్ని నిర్మించాయి. దీనికి అరవింద్ తో పాటుగా గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, కిషన్ కుమార్, ఎస్ రాధాకృష్ణ (చిన్నబాబు), అమన్ గిల్ నిర్మాతలుగా వ్యవహరించారు. బాలీవుడ్ స్టార్ కార్తీక్ ఆర్యన్ హీరోగా తెరకెక్కిన ఈ రీమేక్ మూవీ కూడా హిందీలో డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది.


మరోవైపు దిల్ రాజు గతేడాది తెలుగులో సక్సెస్ అయిన 'హిట్' చిత్రాన్ని అదే పేరుతో హిందీలో రీమేక్ చేసారు. భూషణ్ కుమార్, కుల్దీప్ రాథోడ్‌ కూడా దీంట్లో నిర్మాణ భాగస్వాములుగా ఉన్నారు. రాజ్ కుమార్ రావ్ తో తీసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇలా బాలీవుడ్ లో పాగా వేయాలనుకున్న ముగ్గురు టాలీవుడ్ నిర్మాతలకు చేదు అనుభవమే ఎదురైంది. అయితే ఈ ఫ్లాప్ అయిన సినిమాలు అన్నీ తెలుగులో హిట్ అయిన కంటెంట్ తో తీసినవి కావడం గమనార్హం. 


నిజానికి సీనియర్ నిర్మాత, మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు అప్పట్లో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద దాదాపు పది హిందీ చిత్రాలను ప్రొడ్యూస్ చేసారు. అలానే అన్నపూర్ణ స్టూడియోస్, పద్మాలయ పిక్చర్స్, ఉషా కిరణ్ మూవీస్, వైజయంతీ మూవీస్.. ఇలా పలు టాలీవుడ్ సంస్థలు హిందీలో సినిమాలు నిర్మించాయి. కాకపోతే ఎక్కువగా రీమేక్ సినిమాలతో అక్కడి నిర్మాణ భాగస్వాములతో కలిసి హిందీ ప్రేక్షకులకు చేరువయ్యే ప్రయత్నం చేసారు. మరి రాబోయే రోజుల్లోనేనైనా మన నిర్మాతలు బాలీవుడ్ లో హవా నడిపిస్తారేమో చూద్దాం!