Joe Root News | ఇంగ్లాండ్‌ స్టార్ బ్యాటర్ జో రూట్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌ చరిత్రలో కీలకమైన నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా జో రూట్ రికార్డు సృష్టించాడు. జో రూట్ 1630 పరుగులతో అగ్ర స్థానంలో నిలిచాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ (1625 పరుగులు) పేరిట ఉన్న రికార్డును ఇంగ్లాండ్ బ్యాటర్ రూట్ బద్ధలుకొట్టాడు. అంతకుముందు అలిస్టర్ కుక్ రికార్డును బ్రేక్ చేసి రెండో స్థానానికి వచ్చాడు.

ఒక్క ఇన్నింగ్స్‌తో కుక్, సచిన్ రికార్డులు బద్ధలు

ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య టెస్టు సిరీస్ జరుగుతోంది. కివీస్‌తో జరిగిన తొలి టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో జో రూట్ 23 పరుగులు చేశాడు. తద్వారా నాలుగో ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు (1630) చేసిన ఆటగాడిగా నిలిచాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ కు 1625 పరుగులు చేయడానికి 60 ఇన్నింగ్స్‌లు అవసరం అయ్యాయి. ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ 49 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ చేరుకున్నాడు. కెరీర్‌లో 150 టెస్టులు ఆడిన జో 35 సెంచరీలు, 64 హాఫ్ సెంచరీల సాయంతో 12,777 పరుగులు చేశాడు. టెస్టు ఫార్మాట్లో అత్యధిక పరుగులు వీరుల జాబితాలో జో రూట్ ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్నాడు.

 

నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 బ్యాటర్లు- జో రూట్ (ఇంగ్లాండ్) - 1630 (49 ఇన్నింగ్స్‌లు)- సచిన్ తెందూల్కర్ (ఇండియా) - 1625 (60 ఇన్నింగ్స్‌లు)- అలిస్టర్ కుక్ (ఇంగ్లాండ్)- 1611 (53 ఇన్నింగ్స్‌లు)- గ్రేమ్ స్మిత్ (దక్షిణాఫ్రికా)- 1611 (41 ఇన్నింగ్స్‌లు)- ఎస్ చందర్‌పాల్ (వెస్టిండీస్)- 1580 (49 ఇన్నింగ్స్‌లు)

న్యూజిలాండ్‌పై తొలి టెస్టులో ఇంగ్లాండ్ ఘన విజయం

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆదివారం నాడు 155/6 స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన న్యూజిలాండ్ 254 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 6 వికెట్లు తీయగా, క్రిస్ వోక్స్ 3 వికెట్లు పడగొట్టాడు. స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్ (84; 167 బంతుల్లో) ను కార్స్ ఔట్ చేయడంతో న్యూజిలాండ్ ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యం ఉండటంతో ఇంగ్లాండ్ కు న్యూజిలాండ్ కేవలం 104 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రత్యర్థి ఇంగ్లాండ్ జట్టు కేవలం 12.4 ఓవర్లలోనే టార్గెట్ ఛేదించి ఘన విజయాన్ని అందుకుంది. ఓపెనర్ జాక్ క్రాలే (1)ను త్వరగా ఔట్ చేసినా..  బెన్ డకెట్ (27), జాకబ్ బెథెల్ (50 నాటౌట్; 37 బంతుల్లో), జో రూట్ (23 నాటౌట్; 15 బంతుల్లో) లాంఛనాన్ని పూర్తి చేశారు. మూడు టెస్టుల సిరీస్ లో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.

న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 348 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ బౌలర్లలో కార్స్, బషీర్ చెరో 4 వికెట్లు పడగొట్టారు. అట్కిన్సన్ 2 వికెట్లు తీశాడు.ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 499 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీకి 4 వికెట్లు, నాథన్ స్మిత్ 3 వికెట్లు, టిమ్ సౌథీ 2 వికెట్లు, రూర్కీ ఒక్క వికెట్ తీశారు.న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 254 రన్స్ చేసి ఆలౌట్ కాగా, 104 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్ ఛేదించింది. దాంతో నాలుగో రోజే తొలి టెస్టు మ్యాచ్ ముగిసింది. మరో రెండు మ్యాచ్‌లు ఉన్నాయి.

Also Read: Champions Trophy 2025: ఐసీసీ దెబ్బకు దిగొచ్చిన పాకిస్తాన్ - హైబ్రిడ్ పద్ధతికి ఓకే చెప్పిన పీసీబీ, కానీ ఈ కండిషన్స్ తప్పనిసరి!