ICC issues ultimatum to PCB over hybrid model proposal: ప్రపంచంలోనే ధనిక బోర్డు అయిన బీసీసీఐ(BCCI)తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో... పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB)కు మరోసారి తెలిసి వచ్చింది. భారత్ రాకపోయిన ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025)ని తమ దేశంలోనే నిర్వహిస్తామని ఇప్పటివరకూ ప్రగల్భాలు పలికిన పీసీబీ అడుగు వెనక్కి వేసింది. హైబ్రీడ్ పద్ధతిలో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు అంగీకారం తెలిపింది. బీసీసీఐ అనుకున్నట్లుగానే పీసీబీతో చర్చలు జరిపిన ఐసీసీ.. ఈ ట్రోఫీ హైబ్రీడ్ పద్ధతిలోనే జరుగుతుందని ప్రకటించింది.
ప్రపంచ క్రికెట్లో మన మాటే వేదం
ప్రపంచ క్రికెట్ ను శాసిస్తుంది కచ్చితంగా బీసీసీఐనే. క్రికెట్ దేశంలో ఒక మతం. క్రికెటర్లు ఆరాధ్య దైవాలు. దేశంలో కోట్లాది మంది అభిమానులు.. వేల కోట్ల రాబడులతో బీసీసీఐ రాజ్యం సాగుతోంది. ఐపీఎల్ వేలంలో ఆటగాళ్లపై కోట్లకు కోట్లు గుమ్మరించారు. దీంతో బీసీసీఐ పేరు ప్రఖ్యాతులు మరింత పెరిగాయి. ప్రపంచ క్రికెట్ ను శాసించే స్థాయికి బీసీసీఐ చేరుకుంది. దానికి తగ్గట్లే.. బీసీసీఐ మరోసారి తన మార్క్ ను చాటింది. ఛాంపియన్స్ ట్రోఫీ అసలు జరుగుతుందా... జరిగితే భారత్ పాల్గొంటుందా లేదా అనేది సందిగ్దంలో పడింది. దానికి తగ్గట్లే ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు పాకిస్థాన్ కు టీమిండియా వెళ్లడం లేదని భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
భద్రతా కారణాల వల్ల పాకిస్థాన్ కు.. జట్టు వెళ్లడం లేదని విదేశాంగ శాఖ వెల్లడించింది. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉ ద్రిక్తతల వల్ల పాక్ పర్యటనకు.. భారత జట్టుకు అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేసింది. అయితే భారత్ లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తామని తొలుత పాక్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. కానీ ఇప్పుడు ఐసీసీ చర్చల తర్వాత ఒకడుగు వెనక్కి వేసింది. ఐసీసీ కాబోయే అధ్యక్షుడు జై షా.. ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో చక్రం తిప్పినట్లు తెలుస్తోంది.
ఐసీసీ ప్రకటన ఏంటంటే...
బీసీసీఐ, పీసీబీలతో ఐసీసీ చర్చలు జరిపింది. ఈ క్రమంలో ఇరు బోర్డులు కూడా ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ పద్దతిలో జరిపేందుకు అంగీకరించాయని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులు పాక్ వద్దే ఉంటాయని.. భారత్ ఆడే మ్యాచ్ లు మాత్రం పాకిస్థాన్ లో కాకుండా దుబాయ్ వేదికగా జరుగుతాయని పేర్కొంది. భారత్ నాకౌట్‌కు చేరుకుంటే సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు పాకిస్థాన్ వెలుపల జరుగుతాయని తెలిపింది. అయితే భవిష్యత్తులో భారత్ ఏదైనా ఐసీసీ టోర్నీని నిర్వహిస్తే, ఆ టోర్నీ కూడా హైబ్రిడ్ మోడల్‌లోనే ఉండాలని పీసీబీ డిమాండ్ చేసింది. భారత్.. పాకిస్థాన్ కు వచ్చి ఆడలేనప్పుడు, పాకిస్థాన్ జట్టు కూడా భారత్‌కు వెళ్లి ఆడదని పీసీబీ స్పష్టంగా చెప్పింది.
పాక్ స్పందన ఇదే..
ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రీడ్ పద్ధతిలో నిర్వహించాలన్న ఐసీసీ ప్రతిపాదనపై పీసీబీ అధికారులు స్పందించారు. తమ దేశంలో భద్రత పటిష్టంగానే ఉన్నా ఐసీసీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తమను ఆవేదనకు గురిచేసిందని పీసీబీ అధికారి రషీద్ లతీఫ్ వెల్లడించారు. భారత్.. పాక్ పర్యటనకు రాకపోతే.. భారత్ లో నిర్వహించే ఐసీసీ ట్రోఫీలకు తమ జట్టు వెళ్లబోదని స్పష్టం చేశారు. క్రీడల్లోకి రాజకీయాలను తీసుకురావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫిబ్రవరి 19 నుంచి..
ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు నిర్వహించాలని భావిస్తున్నారు. 2008 ముంబై ఉగ్రదాడి తర్వాత భారత్... పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడలేదు. 2017లో పాకిస్థాన్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలుచుకుంది. మరోవైపు 2013 నుంచి భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని గెలవలేదు.