భారత్‌లో జరుగతున్న ప్రపంచకప్‌ను ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ భారీగా ఏర్పాట్లు చేసింది. ఈ ఏర్పాట్లలో భాగంగా మ్యాచ్ ముగిసిన త‌ర్వాత భారీగా బాణాసంచా కాలుస్తోంది. ఇప్పటికే కాలుష్యంతో సతమతమవుతున్న నగరాల్లో ఈ బాణాసంచ కాల్చడం వల్ల కాలుష్యం మరింత పెరగుతోంది. పర్యావరణం కూడా దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీల‌క నిర్ణయం తీసుకుంది. తీవ్ర కాలుష్యంతో స‌త‌మ‌తం అవుతున్న ముంబై, ఢిల్లీ న‌గ‌రాల్లో ఇక నుంచి బాణాసంచా పేల్చడం ఉండదు. ఈ విషయాన్ని భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు కార్యద‌ర్శి జై షా స్పష్టం చేశారు. ఈ రెండు న‌గ‌రాల్లోనూ వాయు కాలుష్యం మ‌రీ అధికంగా ఉంద‌ని, అందుకే ఈ న‌గ‌రాల్లో ఇక నుంచి ఫైర్ వ‌ర్క్స్ ఉండ‌వ‌ని జై షా స్పష్టం చేశారు. ఈ విష‌యాన్ని ఐసీసీకి కూడా చెప్పినట్లు షా తెలిపారు. 



 వన్డే ప్రపంచకప్‌లో ఏదైనా జట్టు మ్యాచ్‌ గెలిచిన తర్వాత స్టేడియంలో టపాసులను పేలుస్తూ సంబరాలు నిర్వహిస్తున్నారు. అలాగే మ్యాచ్‌ మధ్యలో అభిమానుల కోసం లైటింగ్‌ షో కూడా ఏర్పాటు చేశారు.  లైటింగ్ షో వల్ల ఇబ్బంది లేకపోయినా టపాసులను కాల్చడం వల్ల మాత్రం కాలుష్యం పెరుగుతోంది. వాయు కాలుష్యం విపరీతంగా ఉన్న ఢిల్లీ, ముంబై నగరాల్లో టపాసులను పేలిస్తే వాతావరణానికి హాని చేసినట్లేనని నెటిజన్లు, అభిమానుల నుంచి విజ్ఞప్తులు అందాయి. దీంతో ఈ రెండు మహా నగరాల్లోని మైదానాల్లో జరిగే మ్యాచ్‌ల సందర్భంగా టపాసులను కాల్చడాన్ని విరమించుకున్నట్లు  బీసీసీఐ ప్రకటించింది. 



 ప‌ర్యావ‌ర‌ణ అంశాల విష‌యంలో తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని, అభిమానులు, స్టేక్‌హోల్డర్ల ప్రయోజ‌నాల‌కు పెద్ద పీట వేస్తామ‌ని జై షా తెలిపారు. వాతావరణ ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుందని జై షా వెల్లడించారు. అభిమానులు, ఆటగాళ్లు, ప్రజల ఆరోగ్యంపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని తెలిపారు. ఢిల్లీ వేదికగా నవంబర్ 6న ఆఖరి మ్యాచ్‌ జరగనుంది. బంగ్లాదేశ్-శ్రీలంక జట్లు తలపడతాయి. ముంబయి వేదికగా ఇంకా మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో భారత్ - శ్రీలంక, ఆస్ట్రేలియా-అఫ్గానిస్థాన్‌ మ్యాచ్‌  కాకుండా తొలి సెమీస్‌కు కూడా ముంబయిలోని వాంఖడే మైదానం వేదిక కానుంది.



 స్టేడియంలో ఏర్పాటు చేసే లైటింగ్ షోలపైనా ఆస్ట్రేలియా ఆటగాడు మ్యాక్స్‌వెల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. లైట్ షో వల్ల తనకు భయంకరమైన తలనొప్పి వచ్చిందని మ్యాక్సీ అన్నాడు. లైట్షో అభిమానులకు అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని.. అయితే క్రికెటర్లకు మాత్రం ఇబ్బంది కరంగా మారిందని చెప్పుకొచ్చాడు. బిగ్‌బాష్ లీగ్ సందర్భంగా కూడా పెర్త్ స్టేడియంలో లైటింగ్ షోను ఏర్పాటు చేశారని, వరల్డ్ కప్‌లో మేం నెదర్లాండ్స్‌తో ఆడిన స్టేడియంలోనూ ఇది చూశానని మాక్సీ గుర్తు చేసుకున్నాడు. ఇలాంటి లైట్ షోల వల్ల ఒక్కసారిగా తలనొప్పి వస్తోందని, ఆ లైట్ షో ఆగిపోయిన తర్వాత కళ్లు అడ్జస్ట్ కావడానికి టైమ్ పడుతుందన్నాడు. అందుకే ఫ్యాన్స్ విషయంలో ఇది సరైన ఏర్పాటే అయినా.. క్రికెటర్ల విషయంలో మాత్రం సరైన ఆలోచన కాదు అనిపించిందని తెలిపాడు. అయితే ఈ వ్యాఖ్యలను మరో ఆస్ట్రేలియన్‌ క్రికెట్‌ డేవిడ్ వార్నర్‌ సమర్థించలేదు. లైటింగ్ షో వల్ల అభిమానులకు కొత్త అనుభూతి లభిస్తుందని వార్నర్‌ అన్నాడు.