MI New York:
దేశమేదైనా.. పోటీ ఎక్కడైనా.. నిర్వాహకులు ఎవరైనా.. ఫ్రాంచైజీ టీ20 క్రికెట్లో తనకు ఎదురేలేదని చాటుతోంది ముంబయి ఇండియన్స్! ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన ఈ ఫ్రాంచైజీ మొన్నీ మధ్యే విమెన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ కొట్టేసింది. ఇప్పుడు ఏకంగా అమెరికాలో మేజర్ లీగ్ క్రికెట్ (Major Cricket League) అరంగేట్రం ట్రోఫీనీ ముద్దాడింది.
డాలస్ వేదికగా సియాటెల్ ఆర్కాస్‌తో (Seattle Orcas) హారాహోరీగా జరిగిన ఫైనల్లో ఎంఐ న్యూయార్క్ (MI New York) విజయ భేరి మోగించింది. ఆ జట్టు కెప్టెన్ నికోలస్ పూరన్ (Nicholas Pooran) 55 బంతుల్లోనే 137 పరుగులతో అజేయంగా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు.
అమెరికాలో మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో మొత్తం ఆరు జట్లు తలపడ్డాయి. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచిన ఎంఐ న్యూయార్క్ ప్లేఆఫ్స్‌లో అద్భుతాలే చేసింది. ఎలిమినేటర్ వన్, క్వాలిఫయర్ 2 గెలిచి ఫైనల్ చేరుకుంది. నంబర్ వన్ టీమ్ సియాటెల్ ఆర్కాస్‌తో ఫైనల్లో తలపడింది. ప్రత్యర్థిని సునాయాసంగా ఓడించింది. అపూర్వమైన విజయంతో సరికొత్త చరిత్రను లిఖించింది.
మొదట క్వింటన్ డికాక్ (87; 52 బంతుల్లో 9x4, 4x6), డ్వేన్ ప్రిటోరియస్ (21; 7 బంతుల్లో 3x4, 1x6) దూకుడైన బ్యాటింగ్‌తో సియాటెల్ ఆర్కాస్ 9 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. కఠినమైన లక్ష్య ఛేదనలో ఎంఐ న్యూయార్క్ పరుగులు ఖాతా తెరవకముందే ఓపెనర్ స్టీవెన్ టేలర్ (0) వికెట్ చేజార్చుకుంది.
ఆ క్షణం క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ (137*; 55 బంతుల్లో 10x4, 13x6) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 249 స్ట్రైక్‌రేట్‌తో వీరబాదుడు బాదేశాడు. దాంతో ఎంఐ 3.5 ఓవర్లకే 50 స్కోర్ చేసింది. నికోలస్ 16 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. ఆ తర్వాత మరింత చెలరేగాడు. 40 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. 13.4 ఓవర్లకే జట్టు స్కోరును 150కి తీసుకెళ్లాడు. మిగిలిన రెండు ఓవర్లలోనూ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వరుస సిక్సర్లతో దుమ్మురేపాడు. డీవాల్డ్ బ్రూవిస్ (20;18 బంతుల్లో 2x4, 1x6) అతడికి అండగా నిలిచాడు.
విండీస్ విధ్వంసకర ఆటగాడు నికోలస్ పూరన్ లీగ్ క్రికెట్లో కొరకరాని కొయ్యగా మారాడు. అనుభవం వచ్చే కొద్దీ డిస్ట్రక్టివ్‌గా మారుతున్నాడు. క్రీజులోకి వచ్చిన క్షణం నుంచే వీర బాదుడు బాదేస్తున్నాడు. మరో క్రిస్‌గేల్‌గా అవతరించే పనిలో ఉన్నాడు. కొన్నాళ్ల క్రితం జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగులోనూ అతడు ఇలాగే ఆడాడు. లక్నో సూపర్ జెయింట్స్‌కు మంచి విజయాలు అందించాడు. ఎంఐ న్యూయార్క్‌ను విజేతగా నిలిపిన అతడిపై అభినందనల వర్షం కురుస్తోంది. ఇంటర్నెట్లో అతడి ఇన్నింగ్స్ వైరల్‌గా మారింది.