టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఇటీవల ఫామ్ పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. న్యూజిలాండ్ మాజీ ఆల్ రౌండర్ స్కాట్ స్టైరిస్ అన్నాడు. ఆసియా కప్ లో అతను మునుపటిలా రాణిస్తాడని ఆశాభావం వ్యక్తంచేశాడు. 


ఆసియా కప్ లో భాగంగా తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో ఆగస్టు 28న జరిగే పోరుకు రాహుల్ సిద్ధంగా ఉన్నాడని స్టైరిస్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2022 తర్వాత రాహుల్ గాయపడ్డాడని.. అది అతనికి కఠిన సమయమని అన్నాడు. ఇటీవల జింబాబ్వేతో ముగిసిన వన్డే సిరీస్ లో రాహుల్ అనుకున్నంతగా రాణించలేదు. దీనిపైనే కివీస్ ఆల్ రౌండర్ స్పందించాడు. ఆసియా కప్ కు కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. 


గాయం నుంచి కోలుకుని తిరిగొచ్చాక పరుగులు చేయకపోయినా క్రీజులో ఎక్కువ సమయం గడుపుతున్నాడని.. ఇదే ముఖ్యమైన విషయమని స్టైరిస్ అన్నాడు. ఇది నెట్స్ లో శ్రమించిన దానికన్నా ఎక్కువ ఫలితం ఇస్తుందని తెలిపాడు. ఇదే కొనసాగిస్తే రాహుల్ ఫామ్ అందుకోవడం పెద్ద విషయం కాదన్నాడు. 



దానితో ఫలితం ఎక్కువ


గాయం నుంచి కోలుకుని తిరిగొచ్చిన తర్వాత రాహుల్ ప్రతి ఇన్నింగ్స్ లో 5-10 బంతులు ఎదుర్కొంటుంటే తాను కూడా ఆందోళన చెందినట్లు స్కాట్ పేర్కొన్నాడు. అయితే చివరి వన్డేలో 46 బంతులు ఎదుర్కొన్నాక రాహుల్ కుదురుకుంటున్నట్లు అనిపించిందన్నాడు. అదే నిజమైతే అతను త్వరగానే లయ అందుకుంటాడని చెప్పాడు. ఆ ఆత్మవిశ్వాసంతోనే పాక్ తో మ్యాచ్ కు సిద్ధమవుతాడని అన్నాడు.


అది రాహుల్ కు  లాభించేదే
 
మోకాలి గాయం కారణంగా పాకిస్థాన్ బౌలర్ షాహీన్ అఫ్రీది దూరమవడం రాహుల్ కు లాభించే అంశం అవుతుందని స్టైరిస్ అభిప్రాయపడ్డాడు. అతను స్టంప్స్ పై దాడి చేసే విధానం కేఎల్ కు ఇబ్బంది కలిగించేదేనని.. అఫ్రీది బౌలింగ్ లో రాహుల్ ఎల్బీడబ్యూగా వెనుదిరిగే అవకాశం ఉందన్నారు. అయితే షాహీన్ గైర్హాజరీలో రాహుల్ బలహీనతను సొమ్ము చేసుకునే వ్యక్తి లేడనేది వాస్తవమే అని స్టైరిస్ అన్నాడు. ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకుని కేఎల్ రాహుల్ మళ్లీ రాణిస్తాడని న్యూస్ 18 నిర్వహించిన షోలో చెప్పాడు. 


కుర్రాళ్లు బాగా ఆడుతున్నారు


ఇదే షోలో పాల్గొన్న భారత మాజీ క్రికెటర్ సబా కరీం శుభ్ మన్ గిల్ గురించి మట్లాడారు. వైట్ బాల్ క్రికెట్ లో గిల్ ఇప్పుడిప్పుడే బాగా రాణిస్తున్నాడని చెప్పాడు. ఇప్పటి యువతరం భారత ఆటగాళ్లు బాగా ఆడుతున్నారని కితాబిచ్చారు. జాతీయ జట్టులో స్థానం కోసం తీవ్రమైన పోటీ ఉందని..  అందుకే తమకు వచ్చిన ప్రతి అవకాశాన్ని కుర్రాళ్లు వినియోగించుకోవాలని చూస్తున్నారని అన్నారు.  టీమిండియాలో ఒక్కో స్థానానికి ఇద్దరు, ముగ్గురు రెడీగా ఉన్నారని.. అందుకే అవకాశం అందుకున్న యువకులు తమదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారని కరీం తెలిపారు. ఇది భారత్ కు చాలా మంచి పరిణామమని పేర్కొన్నాడు.