World Cup 2023 Points Table Update: ప్రపంచ కప్ 2023లో నెదర్లాండ్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్ 99 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో విజయంతో న్యూజిలాండ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు న్యూజిలాండ్, నెదర్లాండ్స్ మాత్రమే రెండు మ్యాచ్‌లు ఆడాయి. అందులో న్యూజిలాండ్ జట్టు రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. కాగా డచ్ జట్టు మాత్రం రెండింటిలోనూ ఓటమిని చవి చూసింది. న్యూజిలాండ్ రెండో మ్యాచ్‌లో గెలిచి నాలుగు పాయింట్లు, +1.958 నెట్ రన్ రేట్ సాధించింది. ఓటమి తర్వాత నెదర్లాండ్స్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.


నెదర్లాండ్స్ ఇప్పటి వరకు పాయింట్ల ఖాతా ఓపెన్ చేయలేకపోయింది. దక్షిణాఫ్రికా రెండు పాయింట్లు, +2.040 నెట్ రన్ రేట్‌తో రెండో స్థానంలో ఉంది. దీని తర్వాత పాకిస్తాన్ రెండు పాయింట్లు, +1.620 నెట్ రన్‌రేట్‌తో మూడో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ రెండు పాయింట్లు, +1.438 నెట్ రన్‌రేట్‌తో నాలుగో స్థానంలో నిలిచింది. ఇక టీమిండియా రెండు పాయింట్లు, +0.883 నెట్ రన్‌రేట్‌తో ఐదో స్థానంలో ఉంది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత జట్టు ఏకంగా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.


అదే సమయంలో ఆరు నుంచి పదో స్థానంలో ఉన్న మొత్తం ఐదు జట్లు ఇంకా తమ విజేత ఖాతాలను తెరవలేదు. ఆస్ట్రేలియా -0.883 నెట్ రన్ రేట్‌తో ఆరో స్థానంలో ఉంది. కంగారూ జట్టు తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. దీని తర్వాత ఆఫ్ఘనిస్తాన్ -1.438 నెట్ రన్ రేట్‌తో ఏడో స్థానంలో, నెదర్లాండ్స్ -1.800 నెట్ రన్ రేట్‌తో ఎనిమిదో స్థానంలో, శ్రీలంక -2.040 నెట్ రన్ రేట్‌తో తొమ్మిదో స్థానంలో, ఇంగ్లండ్ జట్టు -2.149 నెట్ రన్ రేట్‌తో 10వ స్థానంలో ఉన్నాయి.


తదుపరి మ్యాచ్‌లు ఎవరెవరి మధ్య
అక్టోబర్ 10వ తేదీన రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ ధర్మశాలలో ఇంగ్లండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగనుంది. ఇక హైదరాబాద్‌లో పాకిస్తాన్, శ్రీలంక జట్లు రెండో మ్యాచ్‌లో తలపడనున్నాయి.


మరోవైపు ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌ను చిత్తు చిత్తుగా ఓడించిన న్యూజిలాండ్‌... రెండో మ్యాచ్‌లోనూ ఘన విజయం సాధించింది. హైదరాబాద్‌ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో కూడా పసికూన నెదర్లాండ్స్‌పై న్యూజిలాండ్ జట్టు ఘన విజయం సాధించింది. అంచనాలకు తగ్గట్లే ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ జట్టుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వని న్యూజిలాండ్‌... 99 పరుగుల తేడాతో విజయదుంధుభి మోగించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ జట్టు 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 322 పరుగులు సాధించింది. 323 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన డచ్ ఆర్మీ... 46.3 ఓవర్లలో కేవలం 223 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో  పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ జట్టు అగ్రస్థానాన్ని బలపరుచుకుంది. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial