భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన నెదర్లాండ్స్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోరు సాధించి అఫ్గాన్‌పై ఒత్తిడి పెంచాలని డచ్‌ జట్టు భావిస్తోంది.  నెదర్లాండ్స్‌ కెప్టెన్‌ ఎడ్వర్డ్స్ రెండు అర్ధసెంచరీలతో ఫామ్‌లో ఉన్నాడు. సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, కోలిన్ అకెర్‌మాన్, లోగాన్ వాన్ బీక్‌లతో డచ్‌ బ్యాటింగ్ లైనప్ కూడా బలంగానే ఉంది. బంగ్లాదేశ్‌పై వాన్ బీక్ 16 బంతుల్లో 23  పరుగులు చేశాడు. ఇప్పటివరకూ నెదర్లాండ్స్‌-అప్ఘాన్ మధ్య 9 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఆఫ్ఘనిస్థాన్ 7 గెలిచింది. డచ్ జట్టు రెండు మ్యాచ్‌లు గెలిచింది. ఇరు జట్ల మధ్య గత నాలుగు మ్యాచ్‌లు కూడా అఫ్గానే గెలిచింది. నేటి మ్యాచ్‌లోనూ అఫ్గానిస్థాన్‌దే పైచేయిలా కనిపిస్తోంది.

 

అఫ్గాన్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని బ్యాటింగ్‌ చేసే బలం నెదర్లాండ్స్‌కు ఉంది. నెదర్లాండ్స్‌కు కూడా సెమీస్‌ చేరే అవకాశం ఉంది. 2023 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి నెదర్లాండ్స్ పెను సంచలనం సృష్టించింది. బంగ్లాదేశ్‌పైనా డచ్‌ జట్టు ఘన విజయం సాధించింది. ఈ రెండు విజయాలు నెదర్లాండ్స్‌ను సెమీ ఫైనల్ రేసులో సజీవంగా నిలిపాయి. పాయింట్ల పట్టికలో డచ్ జట్టు ఎనిమిదో స్థానంలో ఉంది. ఈరోజు ఆఫ్ఘానిస్థాన్‌ను ఓడిస్తే.. నెదర్లాండ్స్‌కు సెమీఫైనల్‌ చేరే అవకాశాలు మెరుగవుతాయి. కానీ డచ్‌ జట్టు ఇక్కడ ఓడిపోతే సెమీస్‌ ఆశలకు తెరపడుతుంది.  లక్నోలోని భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఎకానా స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరుగుతోంది. ఈ మైదానంలో జరిగిన 12 మ్యాచుల్లో  రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్లే తొమ్మిది సార్లు గెలిచాయి. ఈ పిచ్‌ స్పిన్‌కు అనుకూలంగా ఉందన్న అంచనాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నాణ్యమైన అఫ్గాన్‌ స్పిన్‌ను ఎదుర్కోవడం డచ్‌ జట్టు అంత తేలిక కాదు.  2003 ప్రపంచ కప్‌లో కెన్యా సెమీ ఫైనల్‌ చేరినట్లే ఈసారి తాము కూడా వరల్డ్‌ కప్‌ సెమీస్‌ చేరాలని అఫ్గాన్‌ భావిస్తోంది. 

 

మరోవైపు డచ్‌ జట్టుపై నెగ్గి సెమీస్‌ చేరాలని అఫ్గాన్‌ జట్టు పట్టుదలగా ఉంది.  ఇప్పటికీ అఫ్గాన్‌కు.. నెదర్లాండ్స్‌కు  సెమీస్‌ అవకాశాలు సజీవంగా ఉండడంతో ఈ మ్యాచ్‌లో గెలిచి ముందడుగు వేయాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఈ ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు అగ్రశ్రేణి జట్లకు షాక్ ఇచ్చి ప్రకంపనలు సృష్టించాయి. ప్రపంచకప్‌లో నాలుగో బెర్తు కోసం జరుగుతున్న సమీకరణాలు ఆసక్తిని పెంచుతున్న వేళ ఈ మ్యాచ్‌ చాలా ఆసక్తికరంగా సాగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే అఫ్గాన్‌ సెమీస్‌ దిశగా మరో అడుగు ముందుకు వేయగలదు. ఈ ప్రపంచకప్‌లో ఆఫ్ఘన్ జట్టు ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడగా 3 గెలిచింది. ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంక వంటి పెద్ద జట్లకు షాక్‌ ఇచ్చి విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉన్న అఫ్గాన్‌ నేడు నెదర్లాండ్స్‌పై గెలిస్తే ఐదో స్థానానికి చేరుకుంటుంది. పాయింట్ల పట్టికో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లకు సమానంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కంగారూ, కివీస్ జట్లు తమ తదుపరి మ్యాచ్‌ల్లో పేలవ ప్రదర్శన చేస్తే అప్గాన్‌కు సెమీస్‌ అవకాశాలు మెరుగవుతాయి. 

 

అఫ్గానిస్థాన్‌ ఫైనల్‌ 11:

హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్‌), రహ్మానుల్లా గుర్బాజ్ , ఇబ్రహీం జద్రాన్,  రహమత్ షా, మొహమ్మద్ నబీ, ఇక్రమ్ అలీఖిల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మద్, ఫ్ఫజ్ ఉర్ రహ్మద్ , 

 

నెదర్లాండ్స్ ఫైనల్‌ 11: 

స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్‌), కోలిన్ అకెర్మాన్, వెస్లీ బరేసి, బాస్ డి లీడే, ఆర్యన్ దత్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, మాక్స్ ఓ'డౌడ్, సాకిబ్ జుల్ఫికర్, లోగాన్ వాన్ బెక్ రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, పాల్ వాన్ మీకెరెన్.