వ‌చ్చే ఏడాది అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహించే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ‌క‌ప్‌నకు ఆఫ్రికా దేశం న‌మీబియా అర్హత సాధించింది. న‌మీబియా రాజ‌ధాని విండ్‌హోక్ వేదిక‌గా జ‌రుగుతున్న ఆఫ్రికా రీజియన్‌ క్వాలిఫయర్స్‌ టోర్నీలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి అగ్రస్థానం ఖాయం చేసుకోవడంతో నమీబియా టీ 20 ప్రపంచకప్‌నకు అర్హత సాధించింది. టాంజానియాతో జ‌రిగిన చివరి మ్యాచ్‌లో 58 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించడంతో న‌మీబియా పొట్టి ప్రపంచకప్‌నకు క్వాలిఫై అయింది. టాంజానియాతో జ‌రిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన నమిబీయా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 157 ప‌రుగులు చేసింది. డేజే స్మిత్ 25 బంతుల్లో ఒక ఫోర్‌, నాలుగు సిక్సర్ల సాయంతో 40 ప‌రుగులు చేయగా... మైకేల్‌ లింజన్‌ 30 పరుగులు చేశాడు. వీరిద్దరూ రాణించడంతో టాంజానియా 158 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.  అనంత‌రం టాంజానియా 20 ఓవ‌ర్లు ఆడినా ఆరు వికెట్లు కోల్పోయి 99 ప‌రుగులే చేయ‌గ‌లిగింది. అమాల్‌ రాజీవన్‌ (41 నాటౌట్‌) మినహా అంతా విఫలమయ్యారు. 



 వరుసగా మూడో టి20 ప్రపంచకప్‌కు నమీబియా అర్హత సాధించడం విశేషం. 2021, 2022, 2024 టీ 20 ప్రపంచ కప్‌లకు కూడా నమీబియా అర్హత సాధించింది. ఏడు దేశాలు త‌ల‌పడుతున్న  ఆఫ్రికా రీజియన్‌ క్వాలిఫయర్స్‌ టోర్నీలో పాయింట్ల ప‌ట్టిక‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జ‌ట్లు పొట్టి ప్రపంచకప్‌నకు అర్హత సాధిస్తాయి. ఇప్పటికే న‌మీబియా ప‌ది పాయింట్లు సాధించి టీ 20 వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించింది. ఇంకో బెర్తు మాత్రమే మిగిలి ఉంది. రెండో స్థానం కోసం ఉగాండా, కెన్యాల మ‌ధ్య తీవ్ర పోటీ నెల‌కొంది. ఉగాండా, కెన్యాలు త‌లా నాలుగు మ్యాచ్‌లు ఆడి మూడు గెలిచి ఆరు పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ జ‌ట్లు మ‌రో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. నాలుగో స్థానంలో ఉన్న జింబాబ్వే.. నాలుగు మ్యాచ్‌లు ఆడి రెండు మాత్రమే గెలిచి నాలుగు పాయింట్లతో ఉంది. ఆ జ‌ట్టు కూడా రెండు మ్యాచ్‌లో ఆడాల్సి ఉండ‌గా రెండు గెలిచినా ఆ జ‌ట్టు ఇత‌ర జ‌ట్ల ఫ‌లితాల‌పై ఆధార‌ప‌డాల్సి ఉంటుంది. ఉగాండా, కెన్యాలలో ఓ జట్టుకే టీ 20 ప్రపంచకప్‌ బెర్తు అవకాశం ఎక్కువగా ఉంది. గతంలో అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్న కెన్యా... మరోసారి పూర్వ వైభవం కోసం పాకులాడుతోంది. ఈసారి టీ 20 ప్రపంచకప్‌కు అర్హత సాధించాలని పట్టుదలగా ఉంది.



మరోవైపు వ‌చ్చే ఏడాది అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహించే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ‌క‌ప్‌ వేదికలను ఐసీసీ ఖరారు చేసింది. అమెరికాలోని మూడు మైదానాల్లో మ్యాచ్‌లను నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. డల్లాస్‌లోని గ్రాండ్‌ ప్రైరీ, ఫ్లోరిడాలోని బ్రోవార్డ్ కౌంటీ, న్యూయార్క్‌లోని నసౌ కౌంటీ స్టేడియాలను ఐసీసీ ఖరారు చేసింది. వెస్టిండీస్‌లోని మైదానాల్లోనూ మ్యాచ్‌లు నిర్వహించనుంది. ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన క్రికెట్ స్టేడియాల్లో మాడ్యూలర్ విధానంలో సౌకర్యాలను కల్పించాలని ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నసౌ కౌంటీ స్టేడియంలో 34 వేల సీటింగ్ కెపాసిటీతో నిర్మించేందుకు ఇప్పటికే మాడ్యూలర్‌ స్టేడియం సొల్యూషన్స్‌తో అగ్రిమెంట్ చేసుకుంది. అమెరికాలో మూడు వేదికలను ప్రకటించడం ఆనందంగా ఉందని.. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ వంటి మెగా టోర్నీలో అమెరికా భాగం కావడం ఆనందంగా ఉందని ఐసీసీ వెల్లడించింది.


 


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply