MS Dhoni IPL retirement plans: మహేంద్రసింగ్ ధోనీ(Mahendra Singh Dhoni) కూల్ కెప్టెన్.. టీమిండియా(Team India)కు అత్యధిక ఐసీసీ ట్రోఫీ(ICC Trophies)లు అందించిన కెప్టెన్‌గా గుర్తింపు పొందాడు. అంతేనా ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL )లో చెన్నైసూపర్ కింగ్స్‌కు 5 టైటిళ్లు అందించి అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. కెప్టెన్సీతో మ్యాజిక్ చేసి గెలవదు అనుకున్న ఎన్నో మ్యాచ్‌లను మలుపు తిప్పి గెలిచేలా చేయడంలో ధోనీ ప్రావీణ్యం అందరికీ తెలిసిందే. 40 ఏళ్ల వయసులోనూ గతేడాది చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలబెట్టి తాను ఎందుకు అంత విజయవంతమైన కెప్టెన్‌నో మరోసారి క్రికెట్ ప్రపంచానికి చాటి చెప్పాడు. ఇక ధోనీ తన కెరీర్‌లో చివరి ఐపీఎల్‌కు కూడా సిద్ధమైపోయాడని ఊహాగానాలు చెలరేగాయి. అయితే ధోనీకిది చివరి ఐపీఎల్ కాదని ఇప్పటికే టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానించాడు. ఇప్పుడు అతని చిన్ననాటి స్నేహితుడు కూడా అదే అన్నాడు.
ఇంకో రెండేళ్లు!
ధోనీ తన కెరీర్‌లో చివరి ఐపీఎల్‌కు కూడా సిద్ధమైపోయాడని ఊహాగానాల వేళ మహీ చిన్ననాటి స్నేహితుడు పరమ్‌జిత్ సింగ్ కీలక విషయాన్ని వెల్లడించాడు. ధోనీ ఫిట్‌నెస్ చూస్తే ఇదే చివరి సీజన్ అని అనుకోలేమని... ప్రస్తుత సీజన్‌తోపాటు కనీసం మరో రెండేళ్లు ఆడతాడని అనుకుంటున్నానని... దానికి కారణం అతడి ఫిట్‌నెస్ స్థాయే కారణమని అన్నాడు.
స్నేహమేరా జీవితం అన్న ధోనీ
ఈ మధ్య ధోనీ కొత్త లోగో ఉన్న బ్యాట్‌తో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. అది ఏ పెద్ద కంపెనీ లోగోనో కాదు. ఆ బ్యాటుపై ఉన్న స్టిక్కర్ ఏ కంపెనీది కాదు. ఆ స్టిక్కర్ మీద అతడి స్నేహితుడి షాపు పేరు రాసి ఉంది. బాల్యమిత్రుడికి సాయం చేయాలనే ఉద్దేశంతో ధోనీ తన ఫ్రెండ్ షాప్ పేరుతో ఉన్న స్టిక్కర్ అతికించిన బ్యాటుతో మహీ ప్రాక్టీస్ చేశాడు. ధోనీ చిన్నప్పటి స్నేహితుడికి ‘ప్రైమ్ స్పోర్ట్స్' అనే క్రీడా పరికరాల దుకాణం ఉంది. ఇందులో క్రికెట్ కిట్తో పాటు జెర్సీలు, ఇతర ఆట సామగ్రి లభిస్తాయి. దాంతో, తన మిత్రుడి దుకాణానికి మరింత పాపులారిటీ తేవడం కోసం ధోనీ.. ప్రైమ్ స్పోర్ట్స్ స్టిక్కర్ ఉన్న బ్యాటుతో ప్రాక్టీస్ చేశాడు. ఇంకేముంది.. క్షణాల్లో ఆ ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్‌గా మారాయి. టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ధోనీ.. తన కెరీర్‌లో చాలా కంపెనీల లోగో ఉన్న బ్యాట్‌లు ఉపయోగించాడు. అతడు స్నేహితుల దుకాణం పేరున్న బ్యాటుతో కనిపించడం మాత్రం ఇదే తొలిసారి. దాంతో, ప్రైమ్ స్పోర్ట్స్ బ్యాటుతో ధోనీ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు చూసినవాళ్లంతా.. అందుకే ధోనీ ప్రత్యేకం అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇటీవలే ఐపీఎల్ ఆల్‌టైమ్ అత్యుత్తమ జట్టు సారథిగా ధోనీ ఎంపికయ్యాడు. 2008లో మొదలై బ్లాక్‌బాస్టర్ లీగ్‌గా మారిన ఐపీఎల్‌లో ఇప్పటిదాకా ఆడిన ఆటగాళ్లతో అత్యుత్తమ జట్టును వసీం అక్రమ్, మాథ్యూ హేడెన్, టామ్ మూడీ, డేల్ స్టెయిన్‌తో కూడిన సెలక్షన్ ప్యానల్.. 70 మంది పాత్రికేయులతో కలిసి ఎంపిక చేసింది.